ఆదివారం 17 జనవరి 2021
Badradri-kothagudem - Dec 01, 2020 , 05:56:06

వైభవంగా ‘కృత్తికా దీపోత్సవం’

వైభవంగా ‘కృత్తికా దీపోత్సవం’

భద్రాచలం : భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థాన సన్నిధిలో స్వామి వారికి సోమవారం ‘కృత్తికాదీపోత్సవం’ ఘనంగా జరిగింది. తెల్లవారుజామున స్వామి వారికి ఆరాధన, ఆరగింపు, సేవాకాలం అంతరాలయంలో నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను బేడా మండపానికి మేళతాళాల నడుమ తీసుకువచ్చారు.  కలశాలలో దేవతలను ఆవహనం చేసే కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శాస్ర్తోక్తంగా జరిపారు. అనంతరం స్వామివారికి పాలు, పంచామృతాలు, నారికేళ జలాలు, సుగంధ ద్రవ్యాలు, సమస్త నదీ తీర్దాలతో కలశాభిషేకాన్ని కనులపండువగా నిర్వహించారు. అనంతరం స్థానాచార్యులు ‘నీరాట్టం’ ద్రవిడ పాశురాన్ని స్వామి వారి అంతరాలయంలో పఠించారు. యాగశాలలో అభిషేక హోమం, మహాపూర్ణాహుతిని సమర్పించారు.

కార్తీక పౌర్ణమి కృత్తికా నక్షత్రాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది రామాలయంలో కృత్తికా దీపోత్సవాన్ని నిర్వహించటం ఆనవాయితీ. అందులో భాగంగా పోలీసు శాఖ సహకారంతో కార్యక్రమాన్ని కనులపండువగా నిర్వహించారు. అనంతరం స్వామి వారిని తిరువీది సేవకు వెళ్లగా, చప్టా దిగువన చొక్కాసురిని దహన కార్యక్రమాన్ని శాస్ర్తోక్తంగా జరిపారు. కాగా కృత్తికా దీపోత్సవాన్ని పురష్కరించుకొని స్వామి వారికి సోమవారం నిత్య కల్యాణాన్ని నిలిపివేశారు. కార్యక్రమాల్లో ఆలయ ఈవో బీ శివాజి దంపతులు, ఏఈవో శ్రావణ్‌ కుమార్‌, పీఆర్‌వో సాయిబాబు, దేవస్థాన అర్చకులు, వేదపండితులు, వైదిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.