శనివారం 23 జనవరి 2021
Badradri-kothagudem - Dec 01, 2020 , 05:31:04

కార్తీక పున్నమి శోభ

 కార్తీక పున్నమి శోభ

 కార్తీక పౌర్ణమి వెలుగులతో ఉమ్మడి జిల్లా శోభాయమానమైంది.. దీపారాధనలు, కార్తీక నోములు, వ్రతాలు, ఉపవాసాలు, దీపదానాలతో  కార్తీక వైభవం ఉట్టిపడింది. పవిత్ర కార్తీక మాసం శుక్లపక్షం పౌర్ణమి సోమవారం మధ్యాహ్నం వరకు ఉండటంతో భక్తులు కార్తీక పౌర్ణమి పండుగను అత్యంత భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు. సూర్యోదయంతో కూడిన పౌర్ణమి తిథి ప్రాధాన్యంగా పండుగను వైభవంగా జరుపుకున్నారు.  పలు శైవ, వైష్ణవాలయాలు విశేష పూజలతో కిటకిటలాడాయి. భద్రాచలం వద్ద గోదావరి భక్తులతో పోటెత్తింది. తెల్లవారుజామునుంచే భక్తుల తాకిడి పెరిగింది.  భక్తులు తమ కుటుంబ సభ్యులతో తెల్లవారుజామునే భద్రాచలానికి చేరుకొని పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలను ఆచరించారు. అనంతరం గోదావరి ఒడ్డున ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సామూహిక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలను చేశారు. 

- ఖమ్మం కల్చరల్‌ /కొత్తగూడెం 


logo