బుధవారం 20 జనవరి 2021
Badradri-kothagudem - Nov 30, 2020 , 00:43:15

ఆలయాల్లో కార్తీక కాంతులు

ఆలయాల్లో కార్తీక కాంతులు

  • భక్తిశ్రద్ధలతో జ్వాలాతోరణం
  •  దేవాలయాల్లో మహిళల  దీపారాధన
  •  భద్రాద్రి గోదావరి తీరంలో  పుణ్యస్నానాలు
  • ఘనంగా కృత్తికా దీపోత్సవం 

కార్తీక పౌర్ణమి ఆలయాలకు ఆధ్యాత్మిక శోభను తీసుకువచ్చింది.. భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది.. ఆదివారం మధ్యాహ్నం కార్తీక ఘడియలు మొదలు కాగా సాయంత్రం ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి.. నిర్వాహకులు భక్తిశ్రద్ధలతో జ్వాలాతోరణం నిర్వహించారు.. మహిళా భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టి దీపారాధన చేశారు.. భద్రాద్రిలో అర్చకులు కృత్తికా దీపోత్సవం నిర్వహించారు.. భక్తులు గౌతమీ తీరంలో పుణ్యస్నానమాచరించారు.. 

  నెట్‌వర్క్‌


భద్రాచలంలో మహిళలు, భక్తులు ఆదివారం కార్తీక పౌర్ణమిని భక్తిశ్రద్దలతో కొలిచారు. మహిళలు పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. మా మంగళ్యాలను నిండు నూరేళ్లు చల్లంగా చూడు తల్లి.. అని  వేడుకుంటూ గోదావరిలో కార్తీక దీపాలను వదిలారు. అనంతరం కరకట్ట వద్ద నున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర  ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా పలువురు మహిళలు, భక్తులు తమ తమ ఇండ్లలోనే కార్తీక  దీపాలను వెలిగించి పూజలు చేశారు. పట్టణంలో ఉన్న పలు శివాలయాల్లో జ్వాలాతోరణం కార్యక్రమంను అంగరంగ వైభవోపేతంగా జరిపారు. ఖమ్మం జిల్లాలోని  కూసుమంచి, తీర్థాల, పెనుబల్లి, కారేపల్లి, మధిర, ఖమ్మంలలోని శివాలయాలు ‘ఓం నమఃశ్శివాయ’ పంచాక్షరి మంత్రంతో మార్మోగాయి. శివాలయాల్లో  భోళాశంకరుడిని  దర్శించుకుని, అభిషేకాలు, అర్చనలు , రుద్రాభిషేకాలు, బిల్వదళార్చనలతో శివ పూజలు చేసి  త్రినేత్రుడిని ప్రసన్నం చేసుకున్నారు. కాగా సోమవారం మధ్యాహ్నం వరకు పౌర్ణమి తిథి ఉండటంతో సూర్యోదయ  కాలానికి మిగులు తిథిగా సోమవారం కూడా కార్తీక పౌర్ణమి పండుగను జరుపుకోనున్నారు. రెండు రోజుల పాటు  వాడవాడలా దీపోత్సవాలతో జిల్లా మరింత కాంతి వైభవంతో ఉట్టిపడింది.  

 -భద్రాచలం/ఖమ్మం కల్చరల్‌logo