ఆదివారం 24 జనవరి 2021
Badradri-kothagudem - Nov 28, 2020 , 01:18:13

పులి దడ

పులి దడ

  • సారపాక, అశ్వాపురం మండలాల్లో అలికిడి
  • పాదముద్రలు సేకరించిన అటవీశాఖ అధికారులు
  • భయాందోళనకు గురవుతున్న ప్రజలు

పులి సంచారం ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజలకు దడ పుట్టిస్తున్నది. ఏక్షణంలో ఏమౌతుందోనని బిక్కు బిక్కుమంటున్నారు. ‘అదిగో పులి.. ఇదిగో జాడ’ అంటూ రోజుకో చోట పులి జాడలు కనుగొంటున్నారు.  గురువారం సారపాక మండలంలోని ఐటీసీ పీఎస్‌పీడీ సమీపంలోని పుష్కరవనం-మణుగూరు క్రాస్‌ రోడ్డు వద్ద పులి కన్పించినట్లు ఓ వ్యక్తి ఫారెస్టు అధికారులకు సమాచారం అందించిన విషయం మరువక ముందే తాజాగా శుక్రవారం పులి జాడలు ఇదిగో అంటూ ఓ రైతు అధికారులకు సమాచారం అందించారు. ఇలా పులి ఎపిసోడ్‌ రోజుకో మలుపు తిరుగుతూ ఏజెన్సీ వాసులను భయాందోళనకు గురి చేస్తున్నది. ఒకవైపు స్థానికుల సమాచారాన్ని ధ్రువీకరిస్తూనే మరోవైపు పులిని గుర్తించే పనిలో అటవీశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. అడవుల్లో ఎక్కడికక్కడ సీసీ కెమేరాలను పెడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. 

- కరకగూడెం/అశ్వాపురం

సారపాక ఐటీసీ పీఎస్‌పీడీ సమీపంలోని పుష్కరవనం-మణుగూరు క్రాస్‌ రోడ్డు మధ్యలోని అటవీప్రాంతంలో గురువారం రాత్రి సంచరించిన విషయం మరువకముందే శుక్రవారం తెల్లవారుజామున రెడ్డిపాలెం గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్వరరావుకు క్రాస్‌ రోడ్డు సమీపంలో  పులి కన్పించింది. ఈ విషయాన్ని అధికారులకు సమాచారం ఇవ్వగా  మణుగూరు ఎఫ్‌డీవో వేణుబాబు, ఎఫ్‌ఆర్‌వో జి.ప్రసాదరావులు సిబ్బందితో హుటాహుటీన అక్కడకు చేరుకొని పులి పాదముద్రలను సేకరించారు. ఇవి పులి ఆనవాళ్లేని ధ్రువీకరించారు. అయితే గురువారం పులి కన్పించిందని సమాచారం అందడంతో ఫారెస్టు అధికారులు సాయంత్రం నుంచి రాత్రి వరకు గాలించిన ఎలాంటి ఆధారాలు లభించలేదు. కానీ శుక్రవారం ఉదయం పాదముద్రలు ఉండడంతో ఈ ప్రాంతంలో పులి సంచారం ఉందని నిర్ధారించారు. మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి పత్తిచేలతో పాటు సమీప ప్రాంతాల్లో ఫారెస్టు సిబ్బంది కలియతిరిగి పులి సంచరించిన ప్రాంతాన్ని గాలిస్తూ కనబడిన వేలిముద్రలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అటవీప్రాంతానికి సమీప గ్రామాలైన నాగినేనిప్రోలు రెడ్డిపాలెం, సారపాక, శ్రీరాంపురం, సందెళ్ల రామాపురం, ముసలిమడుగు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎవరూ భయాందోళనలకు గురికావద్దని అటవీశాఖ అధికారులు  సూచనలు చేశారు.

పాదముద్రలు సేకరించాం...

టి.వేణుబాబు, ఎఫ్‌డీవో, మణుగూరు

తమకు అందిన సమాచారం మేరకు పులి సంచరించిన ప్రాంతానికి వెళ్లి పాదముద్రలు సేకరించినట్లు మణుగూరు ఎఫ్‌డీవో టి.వేణుబాబు తెలిపారు. శుక్రవారం ఆయన మండలంలోని సందెళ్ల రామాపురంలోని నర్సరీలో విలేకరులతో మాట్లాడారు. గురువారం రాత్రి దుమ్ముగూడెం వెళుతున్న గురు అనే వ్యక్తి కారులో వెళుతూ మణుగూరు క్రాస్‌రోడ్డు-పుష్కరవనం మధ్యలో పులిని చూశానని చెప్పడంతో అందిన సమాచారం మేరకు ఎఫ్‌ఆర్‌వో, సిబ్బందితో గాలించగా రాత్రి వరకూ ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. అయితే తాజాగా శుక్రవారం రెడ్డిపాలెం గ్రామం సమీపంలో సేకరించిన పాదముద్రలు సేకరించి హైదరాబాద్‌ ల్యాబ్‌కు పంపుతున్నామని తెలిపారు. ‘గత వారం రోజుల నుంచి గుండాల, ఇల్లెందు, ఆళ్లపల్లి, మణుగూరు, కరకగూడెం ప్రాంతాల్లో కొందరు పులిని చూశాం...’ పాదముద్రలు చూశామని చెబుతున్నారని, వాటి ముద్రలను సేకరిస్తున్నట్లు తెలిపారు. సీసీఎఫ్‌, డీఎఫ్‌వో ఆదేశాల మేరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. 

పులి సంచారం వాస్తవమే..

  గత రెండు రోజులుగా కృష్ణసాగర్‌ అడవుల్లో పులి సంచరిస్తుందనే ప్రచారంతో మండల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. అయితే పులి సంచారం వాస్తవమేనని ఫారెస్టు అధికారులు తెలిపారు. శుక్రవారం పులి సంచారంపై అశ్వాపురం రేంజీ అధికారి జి.ప్రసాదరావుని వివరణ కోరగా మండలంలోని రామచంద్రాపురం, సత్యనారాయణపురం సరిహద్దులోని అటవీప్రాంతంలో పులి సంచరిస్తుందని ధ్రువీకరించారు. పాదముద్రలు కూడా సేకరించినట్లు వివరించారు. 


logo