భక్తులకు అసౌకర్యం కలగొద్దు

భద్రాచలం: కరోనా నేపథ్యంలో దేవాదాయ శాఖ కమిషనర్ నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ముక్కోటి ఏర్పాట్లు చేయాలని భద్రాచలం ఇన్చార్జి సబ్‌కలెక్టర్ పోత్రు గౌతమ్ అన్నారు. భద్రాచలంలోని సబ్‌కలెక్టరు కార్యాలయంలో ముక్కోటి ఉత్సవాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులకు కేటాయించిన విధులు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. పట్టణంలోని హోటల్ యజమానులతో సమావేశం నిర్వహించి నిర్ణీత ధరలకు ఆహార పదార్దాలను నాణ్యతగా అమ్మాలని తెలిపారు. పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటు, లైటింగ్, బారికేడ్లను ఏర్పాట్లను అధికారులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలన్నారు. భక్తులు గోదావరిలోకి దిగకుండా భద్రాచలంతో పాటు పర్ణశాల వద్ద బారికేడింగ్ ఏర్పాటు చేయడంతో పాటు నది లోతును సూచించే సూచికలు ఏర్పాటు చేయడంతో పాటు గజ ఈతగాళ్లను సిద్దంగా ఉంచాలని తెలిపారు.
తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటుతో పాటు గతంలో ఉన్న మరుగుదొడ్లకు మరమ్మత్తులు నిర్వహించాలని తెలిపారు. మంచినీటి సరఫరా విషయంలో ఆర్డబ్ల్యూఎస్ శాఖ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. స్వామి వారి కార్యక్రమాలను భక్తులు వీక్షించడానికి ఎల్ఈడీ టీవీలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో దేవస్థానం ఇవో శివాజీ, ఏడీఎంఅండ్‌హెచ్‌వో శ్రీనివాసు, పంచాయతీ కార్యదర్శి ప్రసాదరెడ్డి, ఇరిగేషన్ ఈఈ ప్రసాద్, ఆర్టీసీ డీఎం శ్రీనివాస్, డీపీవో పవన్ పాల్గొన్నారు.