బుధవారం 20 జనవరి 2021
Badradri-kothagudem - Nov 27, 2020 , 02:32:52

ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మృతి

ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మృతి

కొత్తగూడెం క్రైం: ఛత్తీస్‌గఢ్‌ ఏజెన్సీలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య గురువారం ఉదయం భీకరంగా ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టు పార్టీ మిలీషియా దళ కమాండర్‌ మృతిచెందాడు. బీజాపూర్‌ ఎస్పీ కమలోచన్‌ కశ్యప్‌ వెల్లడించిన వివరాలు... ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా కుట్రు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జిల్లా రిజర్వ గార్డ్‌, పోలీస్‌ బలగాలు సంయుక్తంగా సెర్చింగ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో కుట్రు అంతర్గత క్షేత్రమైన దర్బా అడవుల్లో మావోయిస్టులు తారసపడి జవాన్లపై కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులకు దిగాయి. రెండువైపులా సుమారు 30 నిమిషాలపాటు భీకర పోరు సాగింది. జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్టులు దట్టమైన అటవీ మార్గంలోకి పారిపోయారు. జవాన్లు ఆ ప్రాంతాన్ని స్వాధీనంలోకి తీసుకుని గాలించగా మావోయిస్టు మృతదేహం, ఓ తుపాకి, ఇతర సామాగ్రి దొరికాయి. మృతుడిని మావోయిస్టు పార్టీ జన్‌మిలీషియా కమాండర్‌ సంతోష్‌ పొడియంగా పోలీసులు గుర్తించారు. కుట్రు పోలీస్‌ స్టేషన్‌ ఏఎస్సై నాగయ్య, బైరాంగఢ్‌ అభయారణ్యం రేంజర్‌ పటేల్‌ హత్య కేసుల్లో సంతోష్‌ పోడియం నిందితుడు. ఇతడిపై రూ.లక్ష రివార్డు ఉంది.logo