సోమవారం 18 జనవరి 2021
Badradri-kothagudem - Nov 26, 2020 , 03:13:00

కలిసొచ్చిన కార్తీకమాసం.. త్వరపడుతున్న ముహూర్తం

కలిసొచ్చిన కార్తీకమాసం.. త్వరపడుతున్న ముహూర్తం

  • ఉమ్మడి జిల్లాలో ‘పెళ్లి సందడి’
  • కల్యాణ వేదికలు కళకళ.. షామియానాలతో మిలమిల
  • కరోనా నిబంధనలు పాటిస్తూ శుభకార్యాలు
  • రెండు జిల్లాల్లో నేడు భారీగా పెళ్లిళ్లు.. తిరిగి వచ్చే నెల 9, 11న..
  • పురోహితులు, ఫొటోగ్రాఫర్లు, మ్యూజిక్‌బ్యాండ్‌ నిర్వాహకులకు మంచిరోజులు

చిరునవ్వులతో వధూవరులు.. కుటుంబ సభ్యుల ఆనందాశ్రువులు.. బంధుమిత్రుల ఆనందోత్సాహాలు.. చిన్నారుల సందళ్లు.. షడ్రుచుల వంటకాలతో విందులు.. మిలమిలలాడే షామియానాలు.. కళకళలాడుతూ కల్యాణ వేదికలు.. మంగళ వాయిద్యాల చప్పుళ్లు.. వేద మంత్రాల ప్రతిధ్వనులు.. మొత్తానికి పెళ్లి మండపాల్లో సందడే సందడి..! ఆరు నెలల తర్వాత తిరిగి ఫంక్షన్‌ హాళ్లు పెళ్లి కళను  సంతరించుకున్నాయి.. ఉమ్మడి జిల్లాలో కరోనా నిబంధనల సడలింపు, కార్తీక మాసంలో ఎక్కువ సంఖ్యలో శుభ ముహూర్తాల కారణంగా ఈ నెలలో వందల సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతున్నాయి.. గురువారం ఒక్కరోజే రెండు జిల్లాలో వందలాది పెళ్లిళ్లు జరుగనున్నాయి.. 

 కల్యాణవేదికలు కళకళలాడుతున్నాయి. పురోహితుల వేదమంత్రాలతో పెళ్లి మండపాలు మార్మోగుతున్నాయి. వధూవరులు మురిసిపోతున్నారు.. కుమారులు, కుమార్తెల పెళ్లిళ్లు చేసి తల్లిదండ్రులు పొంగిపోతున్నారు. కరోనా తర్వాత శుభకార్యాల మీద ఆదారపడిన ఆశాజీవులకు మళ్లీ ఊరట కలిగింది. ఆరునెలల తర్వాత మళ్లీ వీధుల్లో సందడి కనిపిస్తున్నాయి. ప్రధాన వ్యాపార సముదాయాలు కిటకిటలాడుతున్నాయి. వస్త్ర దుకాణాలు పెళ్లివారితో కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. కరోనా సడలింపులతో అందరూ శుభకార్యాలు, గృహ ప్రవేశాలు, వ్రతాలు, దేవుని పండుగలు.. ఇలా అన్నింటిపై ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్‌ మొదలవ్వటంతో అంతటా సందడి కనిపిస్తున్నది. దీంతో నిన్నటి వరకు పనుల్లేక అవస్థలు పడిన వ్యాపారులు ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. 

- కొత్తగూడెం  

శుభకార్యాలకు అనువైన సీజన్‌ వచ్చేసింది. మంచి ఘడియలు రానే వచ్చాయి. ఆలయాలు, కల్యాణ మండపాలు, ఇంటి లోగిళ్లు అంతటా సందడి కనిపిస్తున్నది. ముఖ్యంగా ఈ కార్తీక మాసం పెళ్ళిళ్ల సీజన్‌లా కనిపిస్తున్నది. ఈ మాసంలో ఎక్కువ సంఖ్యలో ముహూర్తాలు ఉండటంతో రెండు జిల్లాల్లో ఎక్కువ సందడి కనిపిస్తున్నది. అర్చకులు, పురోహితులు, ఫొటోగ్రాఫర్లు, షామియానా నిర్వాహకులకు దండిగా పనులు వస్తున్నాయి. ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 11 వ తేదీ వరకు పెళ్లి ముహూర్తాలు ఉండటంతో మూఢం రాకముందే పెళ్లిళ్లు చేసేందుకు యువతీ యువతుల తల్లిదండ్రులు త్వరపడుతున్నారు. జనవరి 13 దాటితే మళ్లీ ముహూర్తాలు లేవని పురోహితులు వెల్లడిస్తున్నారు.

నేడు భారీగా పెళ్లిళ్లు.. తిరిగి వచ్చే నెల 9, 11న..

పెళ్లిళ్లకు ముహూర్తాలు చూడటం పరిపాటే. ఈ నెలలో నేడు (గురువారం) పెద్ద ముహూర్తమని పురోహితులు వెల్లడిస్తున్నారు. ఈ ముహూర్తం తర్వాత వచ్చేనెల 9, 11న మళ్లీ పెద్ద ముహూర్తాలు లేవని చెప్తున్నారు. ఉమ్మడి జిల్లాలో గురువారం ఒక్కరోజే 500 పెళ్ళిళ్లు జరగవచ్చని ఓ అంచనా. కరోనా తర్వాత నిబంధనలు సడలించడంతో పెళ్లింట భాజా భజంత్రీలు మోగుతున్నాయి. కల్యాణ మండపాలు వధూవరులు, బంధుమిత్రులతో కల్యాణ శోభను సంతరించుకున్నాయి. కార్తీక మాసం కలిసి రావడంతో గృహప్రవేశాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, పూలు పండ్లు వంటి కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

కళ కళలాడుతున్న కల్యాణ వేదికలు..

కరోనాతో కళతప్పిన కల్యాణ వేదికలు మళ్లీ కళకళలాడుతున్నాయి. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాకేంద్రాలతో పాటు సత్తుపల్లి, మధిర, భద్రాచలం, అశ్వారావుపేట తదితర పట్టణాల్లోని ఫంక్షన్‌ హాల్లో సందడి కనిపిస్తున్నది. బాజా భజంత్రీల సందడితో కళకళలాడుతున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలంతా శుభకార్యాలు నిర్వహించుకుంటున్నారు. కార్తీకమాసంలో మంచిరోజులు కాబట్టి, మళ్లీ శ్రీరామనవమి వరకు ముహూర్తాలు ఉండవు కనుక అందరూ ఇదే సీజన్‌లో శుభకార్యాలు కానిచ్చేస్తున్నారు. కల్యాణ మండపాలను కూడా అడ్వాన్స్‌గా బుక్‌ చేసుకుంటున్నారు.

సందడే సందడి..

కరోనా కాలంలో ఏ శుభకార్యం జరగాలన్నా సామగ్రి కొనుక్కోవాల్సిందే. నలుగురు తలో పని చేయాల్సిందే. షామియానాల నుంచి ఫొటోగ్రాఫర్ల వరకు అందరి అవసరం ఉంటుంది. కానీ కరోనా కారణంగా వ్యాపారులు, చేతివృత్తులు వారు చాలా ఇబ్బంది పడ్డారు. కరోనా నిబంధనలు సడలించడంతో ఎప్పటిలానే శుభకార్యాలు జరుగుతున్నాయి. దీంతో చిరువ్యాపారులు, చేతివృత్తుల వారు, ఇతర వ్యాపారులు వారి వ్యాపారాన్ని సాగిస్తున్నారు. గత పది రోజులుగా పెళ్లిళ్లు జరుగుతుండటంతో షామియానా నిర్వాహకులు, వీడియోగ్రాఫర్లు, లైటింగ్‌ ఓనర్లు, వంట మాస్టర్లు, ప్రింటింగ్‌ ప్రెస్‌ నిర్వాహకులు ఊపిరిపీల్చుకుంటున్నారు.

మాకు పండుగలా ఉంది.. 

ఆరు నెలల తర్వాత మళ్లీ ముహూర్తాలు వచ్చాయి. కొంతకాలం గుడికి, ఇంటికే పరిమితం అయ్యాం.  ఇప్పుడు దేవుడి దయవల్ల  సడలింపులు వచ్చాయి. ముహూర్తాలు కూడా దండిగా ఉన్నాయి.  - దండిబొట్ల భాస్కర కిశోరశర్మ, అర్చకుడు