నిర్మాణ రంగంలో నవశకం

- బి-పాస్ నిర్మాణాలకు బై పాస్
- భవన నిర్మాణాల అనుమతులు ఇక సులభతరం
- 21రోజుల్లో అన్ని రకాల అనుమతులు
- వినియోగదారుల నుంచి మంచి స్పందన
తెలంగాణ ప్రభుత్వం గతేడాది ప్రతిష్ఠాత్మకంగా అమలు లోకి తీసుకువచ్చిన బి పాస్ నిర్మాణదారుల నుంచి మంచి స్పందన వస్తున్నది.. స్వీయ ధ్రువీకరణ ఇచ్చిన 21 రోజుల్లోనే అన్ని రకాల అనుమతులు పొందే విధంగా వెసులుబాటు ఉండటంతో నిర్మాణ రంగానికి ఊతమిచ్చినట్లయ్యింది.. నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానా విధిస్తుండటంతో ఈ వ్యవస్థ మరింత పటిష్టమైంది.. మరోవైపు ప్రజలు కూడా అనుమతుల కోసం రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగే బాధతప్పిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు..
భద్రాద్రికొత్తగూడెం, నమస్తే తెలంగాణ: ప్రభుత్వ శాఖల్లో నూతన సంస్కరణలు తీసుకువచ్చి తద్వారా ప్రజలకు మెరుగైన పౌరసేవలను అందించేందుకు సీఎం కేసీఆర్ సంకల్పించారు. గత పాలకుల హయాంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు స్వరాష్ట్రంలో ఎటువంటి సమస్యలు లెత్తకుండా తమ పనులను చక్కబెట్టుకునేలా చర్యలు చేపట్టారు. అందులో భాగంగా భవన నిర్మాణాల అనుమతులను సులభతరం చేసి ఇంటి యజమానులకు ఊరట కలిగించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిల్డింగ్ పర్మీషన్ ఆఫ్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం (బీ-పాస్)ను నూతనంగా ప్రవేశపెపెట్టింది. దీంతో గత కొన్నేళ్లుగా ఇంటిని నిర్మించుకునేందుకు, షాపింగ్ మాల్స్ అనుమతులు తీసుకునేందుకు అన్ని కార్యాలయాల చుట్టూ తిరిగి సమయం వృథా, అనుమతుల్లో జాప్యంతో పాటు అధిక వ్యయప్రయాసలకు ఫుల్స్టాప్ పడింది. నూతన మున్సిపల్ చట్టం-2019 ప్రకారం ఈ బీ-పాస్ విధానాన్ని నవంబర్ 15న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లో లాంఛనంగా మున్సిపల్‌శాఖ లాంఛనంగా ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ విధానం ద్వారా సామాన్య ప్రజలకు ఎంతో మేలు జరుగనుంది. గతంలో భవనాన్ని నిర్మించుకోవాలంటే అనేక రకాల అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉండేది. ఆ అనుమతుల కోసం నెలల తరబడి మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పడు స్వీయ ధ్రువీకరణ ద్వారా అతి సులభంగా భవన నిర్మాణ అనుమతులను పొందవచ్చు.
21రోజుల్లో భవన నిర్మాణ అనుమతులు
ఇండ్లు, వ్యాపారసముదాయాలను నిర్మించుకునే యజమానులు అన్నిరకాల అనుమతులను ఇచ్చేందుకు 21రోజుల వ్యవధిని ప్రభుత్వం నిర్ణయించింది. భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు పక్కాగా ఉంటే ఆన్లైన్లో ఎవరికి వారే సొంతంగా ధ్రువీకరణతో అనుమతులను తీసుకునేలా బీ-పాస్‌ను రూపొందించింది. ఏరియాను బట్టి, స్థల విస్తీర్ణాన్ని బట్టి, మార్కెట్ వాల్యూ ప్రకారం తొలుత సాధారణ ఫీజును ఆ తర్వాత అనుమతి వచ్చాక 14రోజుల అనంతరం 21రోజుల లోపు మిగతా ఫీజును చెల్లించి స్వేచ్ఛగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా భవనాలను నిర్మించుకునేలా విధానాన్ని తీసుకువచ్చింది. లే ఔట్ అనుమతుల కోసం తాత్కాలిక లే ఔట్ ప్లాన్ అనుమతి, లే ఔట్ పూర్తి చేసిన అనంతరం డెవలపర్ సంతకం, లైసెన్స్ టెక్నికల్ పర్సన్చే అటెస్టెడ్ చేయబడిన స్వీయ ధ్రువీకరణ ఆధారంగా ఆన్లైన్లోనే జిల్లా కమిటీ అమోదించి, ఆమోదించిన ఫైనల్ లే ఔట్ డెవలపర్‌కు ఆన్లైన్లోనే జారీ చేయబడుతుంది. అనధికార కట్టడాలు, లే ఔట్లను గుర్తించేందుకు జిల్లా కలెక్టర అధ్యక్షతన జిల్లాస్థాయిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ టీం ప్రభుత్వం నియమించింది. అనుమతులు వచ్చాక ఆరు నెలలలోపు భవన నిర్మాణాన్ని ప్రారంభించాలి. రెండు సంవత్సరాలలోపు ఆ నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది.
నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా
నూతనంగా తీసుకువస్తున్న బీ-పాస్ విధానంలో నిబంధనలు అతిక్రమిస్తే భారీగా జరిమానా విధించేలా రూపకల్పన చేశారు. సెల్ఫ్ సర్టిఫికేషన్(స్వీయ ధ్రువీకరణ) ఇచ్చిన వివరాలతో ఇంటిని నిర్మిస్తే యజమానులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అనుమతులు ఇచ్చిన తర్వాత మున్సిపల్, పోలీస్, రెవెన్యూ, ఫైర్‌శాఖల అధికారులు ఎన్ఫోర్స్మెంట్ టీం రంగంలోకి దిగి వచ్చి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. దరఖాస్తుదారుడు సమర్పించిన ధ్రువపత్రాలు, భవన నిర్మాణాల జరుగు స్థలంలో తేడాలు ఉంటే 25శాతం ఆదనంగా జరిమానా విధించడం లేదా ముందస్తుగా సమాచారం ఇచ్చి నిర్మాణాన్ని కూల్చివేసే అధికారాన్ని ప్రభుత్వం కల్పించింది.
అతిక్రమిస్తే కఠిన చర్యలు
రాష్ట్ర ప్రభుత్వం బీ పాస్ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ విధానం వల్ల సెల్ఫ్ సర్టిఫికేషన్ ఆధారంగానే ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. పురపాలక శాఖ పరిధిలో భవనాలను నిర్మించుకునేవారు మీ సేవా ద్వారా కానీ, సీనియర్ సిటిజన్ సర్వీస్ సెంటర్లలో ఆన్లైన్లో అనుమతులు పొందవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించవచ్చు.
- అరిగెల సంపత్‌కుమార్, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్