శనివారం 05 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Nov 20, 2020 , 04:52:14

రైతులను దోచుకుంటే సహించం

రైతులను దోచుకుంటే సహించం

కొత్తగూడెం: రైతులు రుగాలం కష్టించి పండించిన పంటను దళారులు దోచుకుంటే సహించేది లేదని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి హెచ్చరించారు. ధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార, డీఆర్‌డీఏ, మహిళా సమాఖ్యలు, రైతుబంధు సమితి సభ్యులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిచారు. కలెక్టర్‌ మాట్లాడుతూ... రైతులకు మంచి మద్దతు ధర రావాలన్న ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు. రైతులు ఈ కేంద్రాల్లోనే పంట విక్రయించాలని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకంటే తక్కువకు రైతుల నుంచి పంట ఉత్పత్తులు కొనుగోలు చేసే దళారులతో కఠినంగా వ్యవహరించాలని అన్నారు. గ్రామస్థాయిలో మహిళా సంఘాలు, రైతుబంధు సమితి సభ్యుల రైతుల ప్రతినిధులుగా వ్యవహరిస్తూ కొనుగోలు కేంద్రాలు, నాణ్యత ప్రమాణా పాటింపు తదితర అంశాలను తెలపాలని కోరారు. పంట విక్రయంపై ప్రతి గ్రామంలో

అవగాహన రావాలన్నారు. రైతులంతా కొనుగోలు కేంద్రాల్లోనే పంట విక్రయించేలా రైతుబంధు సమితి సభ్యులు, మహిళా సమాఖ్యలు బాధ్యత తీసుకోవాలని కోరారు. జిల్లాలో 1.30 లక్షల మంది వ్యవసాయ రంగాన్ని నమ్ముకొని జీవిస్తున్నారని చెప్పారు. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రానున్న రెండు మూడు రోజుల నుంచి వరి కోతలు ముమ్మరం కానున్నందున అన్ని కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్ల ప్రక్రియ జరగాలని చెప్పారు. కోతలు ప్రారంభమైన తరువాత కొనుగోళ్లు ప్రక్రియలో జాప్యం జరిగితే రద్దీ పెరుగుతుందని, రైతులు ఇబ్బందులు పడతారని, ఈ పరిస్థితి రాకుండా చూడాలని అన్నారు. రైతు వేదికలకు ఈ నెల 24వ తేదీ వరకు తుది మెరుగులు దిద్ది ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని, ఇదే చివరి అవకాశమని అన్నారు. వచ్చే వారం నిర్వహించనున్న బ్యాంకర్ల సమావేశంలో రైతుబంధు సమితి సభ్యులు, మహిళా సమాఖ్యలు క్షేత్రస్థాయి నుంచి ఫీడ్‌బ్యాక్‌ నివేదికలతో హాజరుకావాలని చెప్పారు. అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, అనుదీప్‌, జిల్లావ్యవసాయ అధికారి అభిమన్యుడు, పౌర సరఫరాల శాఖ అధికారి చంద్రప్రకాష్‌, సంస్థ మేనేజర్‌ ప్రసాద్‌, డీఆర్‌డీవో మధుసూదన్‌రాజు, డీసీవో మైఖేల్‌ బోస్‌ పాల్గొన్నారు. 

తహసీల్దార్లకు అభినందన

ధరణి రిజిస్ట్రేషన్లను స్లాట్స్‌ ప్రకారం ఎప్పటికప్పుడు క్లియర్‌ చేసిన ఎనిమిది మండలాల తహసీల్దార్లను కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి అభినందించారు. ధరణి, రెండు పడక గదుల నిర్మాణం-కేటాయింపుపై గురువారం తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ధరణి రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ప్రారంభంలో కొన్ని ఇబ్బందులను ఎదురైనప్పటికీ అధిగమించి రిజిస్ట్రేషన్లు ప్రక్రియ నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఎల్‌ ఫామ్‌ జారీలో తహసీల్దార్లు ఎటువంటి ప్రలోభాలకు లోనవకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. డబుల్‌ బెడ్‌రూం లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయాలని చెప్పారు. ఈ ఇళ్లకు అన్ని మౌలిక వసతులు కల్పించాలని సంబంధిత పర్యవేక్షణ ఇంజినీరింగ్‌ అధికారులతో చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, అనుదీప్‌, డీఆర్‌వో అశోక్‌ చక్రవర్తి, ఏవో గన్యా తదతరులు పాల్గొన్నారు.