శుక్రవారం 27 నవంబర్ 2020
Badradri-kothagudem - Nov 17, 2020 , 05:09:38

శివాలయాల్లో కార్తీక పూజలు

శివాలయాల్లో కార్తీక పూజలు

  • కిక్కిరిసిన దేవాలయాలు
  • భద్రాచలం గోదావరి తీరంలోభక్తుల పూజలు

భద్రాచలం:  కార్తీక మాసాన్ని పురస్కరించుకొని భద్రాచలంలోని ఆలయాలు కిటకిటలాడాయి. కార్తీక మాసం ప్రారంభరోజు సోమవారం పవిత్రస్నానాలను ఆచరించి శివాలయాల్లో భక్తులు బారులు తీరారు. ఆలయాల్లో జరిగిన అభిషేకాలు, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భద్రాచలంలోని వెంకటేశ్వర కాలనీలో, ఐటీడీఏ పక్కన ఉన్న శివాలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. రామాలయానికి అనుబంధంగా ఉన్న శివాలయంలో శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన ఈవో శివాజీ దంపతులు పాల్గొని, స్వామి వారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. 

దుమ్ముగూడెం: 

మండలంలోని పలు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఇళ్లలో శివపార్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహించి సమీపంలోని ఆలయాలకు వెళ్లి కార్తీకదీపాలు వెలిగించి పూజలు చేశారు. నడికుడి ఆలయంలోని చాముండేశ్వరి, దుమ్ముగూడెంలో ముత్యాలమ్మ, సాయిబాబా ఆలయాల్లో అధిక సంఖ్యలో మహిళలు వచ్చి పూజలు చేసిన అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.

పర్ణశాల: 

పర్ణశాల వద్ద గోదావరి నదిలో తెల్లవారుజామునుంచే భక్తులు ప్రధానంగా మహిళలు కార్తీక స్నానాలు ఆచరించి శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.  శివాలయాల్లో మహిళలు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తొలుత ఆలయంలో కార్తీకదీపాలు వెలిగించారు. పర్ణశాల శివాలయంలో శివపార్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహించి రాత్రి 7 గంటలకు పల్లకి సేవ, తిరువీధి సేవ చేశారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.

పినపాక:

మండల వ్యాప్తంగా పలు ఆలయాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. సీతంపేట శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. శైవ శేత్రాల్లో శివనామ స్మరణతో మార్మోగాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాలకు, గొదావరి వద్దకు భక్తుల రాకమైదలైంది.

సారపాక: 

సోమవారం కార్తీకమాసం ప్రారంభం కావడంతో మహిళలు తెల్లవారుజామున కార్తీక స్నానాలు ఆచరించి ఇళ్లలో దీపాలు వెలిగించి సమీపంలోని శివాలయాలు, ఇతర ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  మసీద్‌రోడ్‌లోని శివాలయంలో అయ్యప్పమాల ధరించిన దీక్షాపరులు శివపార్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిని చాటుకున్నారు.

అయ్యప్ప భక్తులకు అన్నదానం

సాకేతపురి శివాలయంలో అయ్యప్ప దీక్షాపరులకు కార్తీకమాసం ప్రారంభంలో తొలి సోమవారం ఆలయ నిర్మాణకర్త కొత్తచెర్వు రాఘవేంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలోఅన్నదానం నిర్వహించారు. కార్తీకమాసంలో ప్రతి సోమవారం భక్తుల కు అన్నదానం ఉంటుందని ఆలయ నిర్మాణకర్త తెలిపారు.