సోమవారం 23 నవంబర్ 2020
Badradri-kothagudem - Nov 16, 2020 , 02:18:18

ధరణిపోర్టల్‌తో సులభమైన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ

 ధరణిపోర్టల్‌తో సులభమైన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ

  • నిమిషాల్లోనే పని పూర్తవుతుంటే రైతుల కండ్లలో ఆనందం
  •  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉపందుకున్న రిజిస్ట్రేషన్లు
  •  నేటి నుంచి ఏజెన్సీ భూములకూ ‘ధరణి’
  •  ఇదివరకు రిజిస్ట్రేషన్‌ అయిన భూములకు మ్యూటేషన్‌ ఫీజు ఖరారు
  •  పెరుగుతున్న గిఫ్ట్‌ రిజిస్ట్రేషన్లు 
  • ధరణితో నెరవేరుతున్న సీఎం కేసీఆర్‌ కల  

‘రోబో 2.0 సినిమా లెక్క.. అత్యాధునిక సాంకేతికతతో రూపొందిన మన ధరణి పోర్టల్‌తో రిజిస్ట్రేషన్‌ పనులన్నీ చకచకా అయితున్నయ్‌. ఎంత వేగంగా అంటే..? కేవలం నిమిషాల్లోనే. ఆస్తిహక్కు పత్రం అర్ధగంటలో చేతుల్లోకి వస్తుండటంతో రైతుల ఆనందాలకు అవధుల్లేవ్‌. కిలోమీటర్ల కొద్దీ తిరిగే తిప్పలు తప్పడం, లంచాల ఊసే లేకపోవడం, మండలాఫీసుల్లోనే పనులు జరుగుతుండటంతో మస్తు ఖుషీ అవుతున్నరు. మొత్తానికి సీఎం కేసీఆర్‌ ధరణి పేరుతో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణకు జనమంతా ‘జయహో’ అంటున్నారు. 

 భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ ఖమ్మం : ఎలాంటి వివాదాలకు తావు లేకుండా.. అతి తక్కువ సమయంలో ఎవరి భూమిని వారికి రిజిస్ట్రేషన్‌ చేసి అలవొకగా హక్కుపత్రాలను పొం దే విధానం దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. అంతటి సులువైన, వేగంతమైన సేవలు ధరణి ద్వారా తీసుకొచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. ధరణి పోర్టల్‌తో అత్యంత పారదర్శకంగా భూములను రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసి, ఈ-పాస్‌బుక్‌లు అందిస్తున్నారు. కేవలం అరగంటలోనే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ పూర్తిచేసి, పాస్‌బుక్‌లను అందజేసేలా రూపొందించిన ఈ ప్రక్రియ ఉమ్మ జిల్లాలో విజయవంతమైంది. ధరణి ద్వారా భూ రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఊపందుకున్నది. 

నేటి నుంచి ఏజెన్సీలో భూముల రిజిస్ట్రేషన్లు

నిన్నటి వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 23మండలాల్లో కేవలం 8మండలాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం అన్ని మండలాల్లో ధరణి సేవలు అందుబాటులోకి వ చ్చాయి. మండలాల్లో ఏజెన్సీ భూములు ఉండటంతో ఎస్టీలే ఎక్కువగా వ్యవసాయం చేస్తున్నారు. ఎస్టీలు భూమిని విక్రయించినా.. ఇతరులు కొనుగోలు చేసేందుకు హక్కు లేదు. దీం తో వారికి భూమిపై హక్కులు కల్పించే అవకాశం లేదు. ఒక వేళ ఎస్టీ నుంచి ఎస్టీ భూమి కొనుగోలు చేసిన దానికి సవాలక్ష ఆంక్ష లు ఉన్నాయి. అయితే, ఈ నెల 16 నుంచి ఎస్టీ భూములను మరో ఎస్టీకి, వారి కుటుంబసభ్యులకు గిఫ్ట్‌ రూపంలో, అమ్మకం రూ పంలో విక్రయాలను నిర్వహించుకునేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ధరణి పోర్టల్‌ రాకతో ఎస్టీల భూములు కూడా మరో ఎస్టీ కొనుగోలు చేసేందుకు వారంరోజుల్లోనే ప్రక్రియను పూర్తిచేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎస్టీ నుంచి మరొక ఎస్టీ భూమి కొనుగోలు చేయాలంటే తొలుత కలెక్టరేట్‌ కార్యాలయానికి ఆన్‌లైన్‌లో నమోదుచేసుకోవాలి. ఆన్‌లైన్‌ ప్రక్రియ పూర్తి చేసేందుకు, భూమిని విక్రయించేందుకు వారంరోజుల్లోగా కలెక్టర్‌ కార్యాలయం అనుమతినిస్తుంది. ఈ వారంరోజుల్లో ఒక ఎస్టీ మరో ఎస్టీకి భూమిని ఎందుకు అమ్ముతున్నారు? భూమిని కొనుగోలు చేసే ఎస్టీకి అంత  స్థోమత ఉన్నదా? లేదా? అది ప్రభుత్వ భూమినా? కాదా? తదితర వివరాలన్నింటిపై సర్వే నిర్వహించి వారంరోజుల్లో పరిశీలన చేసి భూమిపై ఒక నిర్ధారణకు వస్తారు. అనంతరం దానిపై ఎటువంటి అభ్యంతరాలు లేవని కలెక్టర్‌ నివేదిక ఇచ్చిన తర్వాత.. ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. 

మ్యుటేషన్‌ ఫీజు ఖరారు

ధరణి పోర్టల్‌ అమలులోకి రాక ముందు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక ముంది రైతులు భూముల క్రయ, విక్రయాలు జరిపారు. అప్పటి నిబంధనల మేరకు భూముల రిజిస్ట్రేషన్‌ కేవలం రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లోనే చేశారు. అనంతరం మ్యుటేషన్‌ చేయించుకోవడానికి అనేక మంది ఆయా మండల తహసీల్దార్లకు దరఖాస్తులు చేసుకున్నారు. కొన్నిచోట్ల గ్రామ రెవెన్యూ అధికారులకు వివరాలను అందచేసి, వాళ్ల చుట్టూ తిరుగుతున్నారు. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేసింది. వారి దగ్గర ఉన్న రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకోవాలని తహసీల్దార్లను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో మ్యుటేషన్‌ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం ధరణి ప్రవేశపెట్టడంతో నాడు రిజిస్ట్రేషన్‌ అయి, మ్యుటేషన్‌ కాని వారు.. ధరణితో మ్యుటేషన్‌ చేయించుకునేందుకు ఫీజును ఇటీవల ప్రభుత్వం ఖరారు చేసింది. పాస్‌బుక్‌ లేని వారు మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకుంటే ఎరానికి రూ.2500 ఫీజు, పాస్‌బుక్‌లు ఉన్న వారు మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకుంటే రూ.300 ఫీజును ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానం వలన అనేక మంది రైతులకు మేలు జరగనుంది. ప్రభుత్వం నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో ఊపందుకున్న రిజిస్ట్రేషన్లు

కొనుగోలు, అమ్మకాలపై ఆసక్తి ఉన్న రైతులు, ఇతర భూ యజమానులు క్రయవిక్రయాలను నిర్వహించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జోరందుకున్నది. భద్రాద్రి జిల్లాలో ఇప్పటి వరకు 8 మండలాల్లోనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు అనుమతి ఉండటంతో పలువురు స్లాట్‌లు బుక్‌ చేసుకున్నారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు జరిగిన రిజిస్ట్రేషన్లలో ‘గిప్ట్‌ రిజిస్ట్రేషన్లే’ అధికంగా ఉన్నాయి. నాడు వీఆర్వో వ్యవస్థ రద్దు ద్వారా పడిపోయిన భూముల ధరలకు ధరణితో మళ్లీ రెక్కలొచ్చాయి. ధరణితో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చాలా సులువుగా, వేగవంతంగా ఉండటంతో భూమికి ధర పెరిగింది. గతంలో రిజిస్ట్రేషన్‌ అంటే ఎంతో సమయం, వ్యయప్రయాసలతో కూడుకొని ఉండేది. కానీ, నేడు ఆ పరిస్థితికి సీఎం కేసీఆర్‌ స్వస్తి చెప్పారు. అతి తక్కువ సమయంలో అత్యంత పారదర్శకంగా రిజిస్ట్రేషన్‌ సేవలను ప్రభుత్వం అందిస్తుండడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ, నూతన వ్యవస్థకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలుపుతున్నారు.