మంగళవారం 01 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Nov 14, 2020 , 04:10:16

ప్రతి ఇంట్లో దీపాల వెలుగు జిలుగులు

ప్రతి ఇంట్లో దీపాల వెలుగు జిలుగులు

  • న్యాయస్థానం ఉత్తర్వుల మేరకే దీపావళి
  • పటాకులకు బ్రేక్‌.. గ్రీన్‌ పటాకులే కాల్చాలి
  • నేడు ఆనంద దీపావళి

భద్రాచలం: దీపావళి పండుగ అంటేనే తారజువ్వలు, క్రాకర్స్‌ వెలిగిస్తూ పటాకులు కాలుస్తూ వెలుగులు విరజిమ్ముతూ యువతీ, యువకులు, చిన్నాపెద్ద తేడా లేకుండా  జరుపుకునే పండుగ. ఈ పండుగ రెండురోజుల పాటు పటాకుల క్రయ, విక్రయాలు జరిపేవారు.  ఈసంవత్సరం కరో నా నేపథ్యం, న్యాయస్థానం తీర్పు, ప్రభుత్వ నిర్ణయంతో ఈసారి పటాకులకు బ్రేక్‌ పడింది. కొవిడ్‌ నిబంధనలకు లోబడి పండుగను జరుపుకోవాలని రాష్ట్ర హైకోర్టు గురువారం పటాకుల విక్రయం, కాల్చివేతను నిషేధించాలని, దానికి తగు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుతాన్ని ఆదేశించింది.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఉదయం దుకాణాలను మూసివేశారు. తిరిగి సాయంత్రం సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఉపశమనం కలుగడటంతో విక్రయ దారులు మళ్లీ విక్రయాలను ప్రారంభించారు. రాత్రి 8 నుంచి 10గంటల వరకు మాత్రమే పటాకులు కాల్చాలని స్పష్టమైన ఆదేశాలను వెలువరించింది. దీంతో వ్యాపారులు గ్రీన్‌ టపాసులనే విక్రయిస్తూ వ్యాపార కార్యకలాపాలను నిర్వహించుకుంటున్నారు.  ప్రభుత్వ సూచనలు, నియమ నిబంధనల మేరకు రెవెన్యూ, పోలీస్‌, అగ్నిమాపక శాఖ వారి అనుమతితోనే విక్రయాలకు లైసెన్సులను పొందారు. భద్రాచలం అగ్రిమాపక శాఖ పరిధిలో భద్రాచలంలో ఏడు, బూర్గంపహాడ్‌లో 2, సారపాకలో 1, అశ్వాపురంలో 1,  చర్లలో 3, పినపాక లో 1, మణుగూరులో 9 దుకాణాలకు లైసెన్సులు మంజూరయ్యాయి. దీంతో గత మూడు రోజుల నుంచి వారు స్టాకు ను తెచ్చుకొని విక్రయానికి రంగం సిద్ధం చేసుకున్నారు. శనివారం దీపావళి కావడంతో శుక్రవారం ఉదయం విక్రయాలు కొద్దికొద్దిగా ప్రారంభమయ్యాయి. 

ఈ క్రమంలో రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల మేరకు టపాసుల విక్రయాన్ని ఆపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో రెవెన్యూ, పోలీసు అధికారులు విక్రయాలను నిలిపివేశారు. దీంతో లక్షలాది రూపాయలను పెట్టుబడి పెడ్టిన దుకాణదారులు ఆందోళనకు గురై నిరుత్సాహ పడ్డారు. ఈ క్రమంలో మళ్లీ సాయంత్రం సుప్రీం కోర్టు తీర్పు మేరకు గ్రీన్‌ కాకర్స్‌, రెండు గంటల పాటు దీపావళికి టపాసులను కాల్చుకోవచ్చనే ఆదేశాలు రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. అదేవిధంగా దీపావళి సందర్భంగా తమ ఇండ్లను ప్రమిదలతో అలంకరించేందుకు పలు రకాల , ఆకారాల ప్రమిదలను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపారు.

మణుగూరు:  పినపాక నియోజకవర్గంలో దీపావళి పండుగను ప్రజలు అత్యంత ఆనందోత్సవాలతో శనివారం ఘనంగా జరుపుకోనున్నారు. దీపావళిని ఈసారి పటాకుల శబ్ధాలు లేకుండా పండుగను జరుపు కోనున్నారు. దీపావళి పండుగను పటాకులు కాల్చకుండా దీపాల వెలుగులతో ప్రజలు సందడి చేయనున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ నేపధ్యంలో హైకోర్టు పటాకులు కాల్చడంపై హైకోర్టు నిషేదంతో ప్రతి ఇంటిని దీపాల వెలుగులతో నింపనున్నారు. ప్రతి ఇంటా చిన్న పెద్ద అందరు ఆనందంతో ఇళ్ళ ముంగిట దీపాలను వెలిగించి కొత్త దుస్తులు ధరించి పండుగను జరుపుకోన్నారు. నూనే దీపాలు వెలిగించి ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వనించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. 

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

మణుగూరు రూరల్‌: దీపావళి దుకాణాదారులు ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మణుగూరు తహసీల్దార్‌ లూథర్‌విల్సన్‌ తెలిపారు. శుక్రవారం పట్టణంలో ఏర్పాటు చేసిన దీపావళి దుకాణాలను పరిశీలించి ఆయన సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ప్రభుత్వం, అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు నిబంధనలు అతిక్రమించి ప్రకృతికి, ప్రజలకు హాని కలిగించే పటాకులు విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుంటామని  దుకాణాదారులను హెచ్చరించారు. దీపావళి సందర్భంగా గ్రీన్‌క్రాకర్స్‌ను మాత్రమే కాల్చేందుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తూ దీపావళి పటాకుల నిషేధంపై మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిందన్నారు.