సోమవారం 23 నవంబర్ 2020
Badradri-kothagudem - Nov 14, 2020 , 04:10:16

నిబంధనలతో కూడిన అనుమతి

నిబంధనలతో కూడిన అనుమతి

  • రాత్రి 8-10 వరకు ‘గ్రీన్‌ పటాకులు’ కాల్చేందుకు అవకాశం
  • జిల్లాలో కోర్టు ఉత్తర్వుల అమలుకు సిద్ధపడిన అధికారులు 
  • సుప్రీంకోర్టు ఉత్తర్వుతో ఆందోళన నుంచి తేరుకున్న వ్యాపారులు 
  • ఖమ్మం నగరంలో విక్రయాలకు ముమ్మర ఏర్పాట్లు

భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ఖమ్మం ప్రతినిధి నమస్తే తెలంగాణ:దీపావళి వేళ తెలంగాణలో పటాకుల అమ్మకాలు, కాల్చడంపై నిషేధం విధించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించడంతో జిల్లాల్లో విక్రయాలపై శుక్రవారం కొన్ని గంటలపాటు ఉత్కంఠ నెలకొంది. దీపావళి ముందురోజు ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేయడంతో విక్రయదారులు, వినియోగదారులు సందిగ్దంలో పడ్డారు. జిల్లాలో పటాకుల విక్రయాల కోసం ఖమ్మం జిల్లా కేంద్రంతోపాటు, గ్రామా ల్లో కూడా విక్రయాలకు తెరపడింది. కొద్దిగంటల వ్యవధిలోనే రాష్ట్ర ఫైర్‌ వర్కర్స్‌ డీలర్స్‌ అసోసియేషన్లు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో నిబంధనలతో కూడిన సడలింపు లభించింది. సాధారణ గాలి నాణ్యత ప్రాంతాల్లో రెండు గంటలపాటు గ్రీన్‌ కాకర్స్‌ కాల్చేందుకు అనుమతినిచ్చింది. దీంతో జిల్లా కేంద్రంలో పటాకుల విక్రయాలకు అన్ని ఏర్పాట్లు ముమ్మరం చేశారు. దీపావళి ముందు రోజు టపాసుల విక్రయాలపై ఉత్కంఠ నెలకొనడంతో విక్రయదారు లు ఆందోళనకు గురయ్యారు. జిల్లాలో కాలుష్య నియంత్రణను పాటిస్తూ పటాకులు కాల్చుకొనే విధంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకొనేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే పలు రాష్ర్టాల్లో నిషేదం ఉండడంతో మన రాష్ట్రంలో కూడా అది అమలవుతుందనే అనుమానంతో విక్రయదారులు ఇబ్బంది  పడ్డారు. 

పెవిలియన్‌ గ్రౌండ్‌లో విక్రయాలకు ఏర్పాట్లు

ఖమ్మం నగరంలో విక్రయాల కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసుకొనేందుకు నగరంలోని పెవిలియన్‌ గ్రౌండ్‌లో అనుమతించారు. 54 దుకాణాలకు జిల్లా యంత్రాంగం అనుమతి ఇవ్వడంతో నిర్వాహకులు విక్రయాలకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఒక్కో నిర్మాణానికి రూ.17.500, రెండు రోజులకు గాను నగరపాలక సంస్థ లైసెన్స్‌ ఫీజు కింద రెండు వేల రూపాయల వంతున వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు. లాటరీ ద్వారా దుకాణాల కేటాయింపు ప్రక్రియను రెండు రోజుల క్రితం అధికారులు నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా దుకాణాల్లో, ఇతర చోట్ల బాణాసంచా విక్రయాలు నిర్వహించకుండా చూడాలని కలెక్టర్లకు, ఎస్పీలకు, అగ్నిమాపక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. న్యాయవాది ఇంద్రప్రకాశ్‌ వేసిన పిల్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.  హైకోర్టు ఉత్తర్వులతో నిషేదం, తిరిగి సుప్రింకోర్టు అనుమతితో నిబంధనలతో కూడిన అనుమతి లభించడంతో కాలుష్యానికి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని పర్యావరణ పరిరక్షకులు కోరుతున్నారు. 

గ్రామాలకు చేరుకుంటున్న సామగ్రి

పటాకుల హోల్‌సేల్‌ విక్రేతల నుంచి గ్రామాలకు సామగ్రి చేరుకుంటున్నది.  శుక్రవారం భారీ స్థాయిలో సాధారణ దుకాణదారులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఖమ్మం నగరంలో దుకాణాలు ఏర్పాటు చేసి విక్రయాలు జరుపుతున్నప్పటీకీ గ్రామాలకు  ముందుగానే కొంతమేర పటాకులను తరలించేందుకు హోల్‌సేల్‌ ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.  ప్రతి మండల కేంద్రంలో కొంతమందిని ఈ విక్రయాల కోసం ముందుగానే ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలో రూ. కోట్లలో క్రయవిక్రయాలు జరుగునున్నట్లు వ్యాపారులు పేర్కొన్నారు. విక్రయాల సందర్భంగా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు పాటించాలని అధికారుల సూచించారు.