శుక్రవారం 04 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Nov 13, 2020 , 02:01:30

గిరిజన కళకు ప్రోత్సాహం

గిరిజన కళకు ప్రోత్సాహం

  •  ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్‌

భద్రాచలం : గిరిజన కళలను ప్రోత్సహించడంలో భద్రాచలం ఐటీడీఏ నిరంతరం కృషి చేస్తుందని పీవో పోట్రు గౌతమ్‌ అన్నారు. గురువారం భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న గిరిజన మ్యూజియం వద్ద అశ్వారావుపేట మండలం కోయ రంగాపురం గ్రామానికి చెందిన గిరిజన సంస్కృతి కోయ, కొమ్ము డ్యాన్సు కళా బృందం నృత్య ప్రదర్శనను పీవో తిలకించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ.. గిరిజన కళలు, ఆచార సంప్రదాయాలను కాపాడుకోవడం కోసం ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన మ్యూజియాన్ని పునరుద్ధరించి తెగలకు సంబంధించిన పురాతన వస్తువులను భద్రపరిచినట్లు పీవో తెలిపారు. గిరిజన మ్యూజియం చుట్టూ పచ్చదనం వెల్లివిరిసేలా అనువైన మొక్కలను ప్రకృతివనం నుంచి సేకరించి మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను తీసుకుంటే మ్యూజియం చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం వెల్లివిరుస్తుందన్నారు. మ్యూజియం ఎదురుగా ఉన్న చేపల చెరువు చుట్టూ కంచె ఏర్పాటు చేయాలన్నారు. దానికి సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలను నాటి, కొమ్ము, కోయ డ్యాన్సు బృందంతో కలిసి ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో ఏపీవో జనరల్‌ కొమరం నాగోరావు, ఏవో బీం, భద్రాచలం ఏటీడీవో నర్సింహారావు, వీరస్వామి, ఆర్వోఫ్‌ఆర్‌ శ్రీనివాసు, క్రీడల నిర్వహణ అధికారి వీరునాయక్‌, ఏటీవో పీఎంఆర్‌సీ రమణయ్య, కోయ కొమ్ము డ్యాన్సు బృందం, ట్రూఫ్‌ లీడర్‌ కారం మల్లయ్య బృందం సభ్యులు పాల్గొన్నారు.