సోమవారం 30 నవంబర్ 2020
Badradri-kothagudem - Nov 12, 2020 , 03:57:19

భద్రాద్రి జిల్లా సమగ్రాభివృద్ధే ధ్యేయం

భద్రాద్రి జిల్లా  సమగ్రాభివృద్ధే ధ్యేయం

  • జనవరి లోపు మిషన్‌ భగీరథ పూర్తవ్వాలి
  • ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
  • ఇసుక మాఫియాను కట్టడి చేయాలి: ‘భద్రాద్రి’ దిశ కమిటీ చైర్మన్ మానుకోట ఎంపీ కవిత
  • రహదారి పనులు పూర్తి చేయాలి : కో-చైర్మన్‌, ఖమ్మం ఎంపీ నామా 

భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ : ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు సేవచేయాలనే భావన కలిగి ఉండాలని మహబూబాబాద్‌, ఖమ్మం ఎంపీలు, దిశ కమిటీ చైర్మన్‌, కో చైర్మన్‌ మాలోత్‌ కవిత, నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం కొత్తగూడెం క్లబ్‌లో జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం జరిగింది. దీనిలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై అం శాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి రావల్సిన ఆదాయాన్ని కొల్లగొడుతున్న ఇసుక మాఫియాను నియంత్రించాలని, ఫ్లయింగ్‌ స్కాడ్‌లను ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు. కరోనా నియంత్రణ, పల్లె ప్రకృతి వనాలు, హరితహా రం మొక్కలు నాటడం, రైతు వేదికల నిర్మాణాల్లో జిల్లా మంచి ప్రగతిలో ఉందని అన్నారు.

ఇందు కోసం కృషి చేసి న కలెక్టర్‌ను, అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. కరోనా విపత్తులో ఉప వైద్యాధికారి డాక్టర్‌ నరేశ్‌ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అవకాశమున్న అంశాలను పరిగణలోకి తీసుకుని నెలరోజుల్లో మ్యాపింగ్‌ ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. డిసెంబర్‌ నాటికి మిషన్‌ భగీరథ పనులు పూర్తిచేసి ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించాలని సూ చించారు. 400 అంగన్‌వాడీ భవనాలను నిర్మించేందుకు స్ధలసేకరణ చేయాలని, చేపట్టిన పనుల పురోగతిని తమకు ఎమ్మెల్యేల ద్వారా అందజేయాలని అన్నారు. సమావేశానికి రైల్వే అధికారులు హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. రానున్న రోజుల్లో హైదరాబాద్‌ నుంచి భద్రాచలానికి జాతీయ రహదారిని నిర్మించనున్నట్లు చెప్పారు. పాండురంగాపురం నుంచి భద్రాచలం వరకు రైల్వేలైన్‌ నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. మన ప్రాంత అభివృద్ధి కోసం ఎంపీలుగా తాము కేంద్ర ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తున్నామని గుర్తుచేశారు. జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య మాట్లాడుతూ టేకులపల్లి మండలంలో మిషన్‌ భగీరథ మంచినీరును అం దించడంలేదని,

దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 2016లో భద్రాచలం నుంచి రామవరం వరకు చేపట్టిన జాతీయ రహదారి పనులు 2018 వరకు పూర్తిచేయాల్సి ఉందన్నారు. కానీ ఇం కా పూర్తి కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లెందు ఎమ్మె ల్యే బానోత్‌ హరిప్రియ మాట్లాడుతూ ఇల్లెందు ఆసుపత్రిలో పనిచేస్తున్న గైనకాలజిస్టును డిప్యుటేషన్‌పై భద్రాచలం ఆసుపత్రికి పంపించినందున తక్షణమే మరొకరితో ఆ పోస్టును భర్తీ చేయాలని కోరారు. వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌ మాట్లాడుతూ ప్రజలకు సేవలందించడమే లక్ష్యంగా ప్రతి అధికారీ పనిచేయాలని కోరారు. భద్రాద్రి కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి మాట్లాడుతూ అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వాహనాలపై 68 కేసులు నమోదు చేసి రూ.12 లక్షల జరిమానా విధించినట్లు చెప్పారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల సమాచారం ప్రజాప్రతినిధులకు కచ్చితంగా అందించాలని అధికారులను ఆదేశించారు.

ప్రొటోకాల్‌ పాటించని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఐటీడీఐ పీఓ గౌతమ్‌ పొట్రు, అదనపు కలెక్టర్లు అనుదీప్‌, వెంకటేశ్వర్లు, డీఎఫ్‌ఓ రంజిత్‌నాయక్‌, డీఆర్‌డీఓ పీడీ మధుసూదన్‌రాజు, కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపల్‌ చైర్మన్లు కాపు సీతాలక్ష్మి, దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, డీపీఆర్‌ఓ శీలం శ్రీనివాసరావు, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.