సోమవారం 23 నవంబర్ 2020
Badradri-kothagudem - Nov 09, 2020 , 04:02:13

అన్నదాత ఇంట వరికాంతులు

అన్నదాత ఇంట వరికాంతులు

  • రైతులకు వరంగా మిషన్‌ కాకతీయ చెరువులు
  • పినపాక నియోజకవర్గంలో అత్యధికంగా వరిసాగు
  •  ప్రతి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు 

మణుగూరు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్‌ కాకతీయ పథకం రైతుల పాలిట వరంగా మారింది. ప్రతి గ్రామంలో మిషన్‌ కాకతీయ చెరువులు రైతు కుటుంబాల జీవితాల్లో వెలుగులునింపాయి. దీంతో ఎటుచూసినా ధాన్యపు రాసులే కనిపిస్తున్నాయి. రైతుల ఇళ్లు వరి సిరితో కళకళలాడుతన్నాయి. పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా వరి కోతలు ప్రారంభం కావడంతో కల్లం నిండా ధాన్యపు రాసులు దర్శనమిస్తున్నాయి.

ఇంతకు ముందు బీళ్ళుగా ఉన్న పొలాలు మిషన్‌ కాకతీయతో సాగునీరందడంతో పచ్చదనం పరుచుకున్నాయి. ప్రస్తుతం వరికోతలు ప్రారంభం కావడంతో రైతులు ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడిది రికార్డ్‌ స్థాయిలో వర్షాలు కురవడంతో ప్రతి గ్రామంలో చెరువులు, కుంటలు నిండి సాగునీరు పుష్కలంగా ఉంది. మరో వైపు భూగర్భజలాలు పెరగడంతో వరి సాగు గణనీయంగా పెరిగింది. వరి ధాన్యం దిగుమతి అధికంగా ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి చెరువు, కుంట కింద రైతులు వరి పండించారు. నియోజకవర్గం మొత్తం 1,02,140 ఏకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తుండగా ఇందులో 50,508 ఏకరాల్లో వరిసాగు ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఇంతకంటే అధికంగా మరో 20 వేల ఏకరాల్లో అనధికారికంగా వరిసాగు చేసినట్లు అంచనా. ఆయా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో రైతులు ఆనందంగా ధాన్యం అమ్మకాలు జరుపుతున్నారు.

‘మిషన్‌' ఫలం.. వరి సిరులు..

మిషన్‌ కాకతీయలో భాగంగా చెరువుల అభివృద్ధితో భారీగా నీరు చేరింది. మణుగూరు, పినపాక, అశ్వాపురం, బూర్గంపాడు, గుండాల, కరకగూడెం, ఆళ్లపల్లి మండలాల్లో సుమారు 400 చెరువులను మిషన్‌కాకతీయ ద్వారా పునరుద్ధరించారు. దీంతో పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరు అందడంతో వరిసాగుతో పాటు అన్ని రకాల పంటల విస్తీర్ణం పెరిగి, గ్రామాలన్ని సస్యశ్యామలంగా దర్శనమిస్తున్నాయి. ప్రతి గ్రామంలో రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేస్తున్నారు. ప్రభుత్వ ముందుచూపుతో తమ రెండు పంటలకు ఢోకాలేదని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.