మంగళవారం 24 నవంబర్ 2020
Badradri-kothagudem - Nov 08, 2020 , 02:07:35

అర్ధరాత్రి దొంగల బీభత్సం

అర్ధరాత్రి దొంగల బీభత్సం

  • నిమిషాల వ్యవధిలో ఆరు ఇండ్లల్లో చోరీలు
  • వరుస దొంగతనాలతో భయాందోళనలో ప్రజలు

మణుగూరు రూరల్‌: మండల పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఏకకాలంలో నిమిషాల వ్యవధిలో రెండు వీధుల్లో కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న ఇండ్లల్లో చోరీలకు పాల్పడ్డారు. సీఐ భానుప్రకాశ్‌, ఎస్‌ఐ నరేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీబొమ్మ సెంటర్‌లోని తమ్మిశెట్టి నర్సింహారావు (బాపనకుంట) అర్ధరాత్రి సమయంలో కుటుంబ సభ్యులందరూ ఇంట్లో నిద్రిస్తున్న వేళ ఇంట్లోకి దొంగలు చొరబడి రూ.35 వేలు చోరీ చేశారు. అదేప్రాంతానికి చెందిన దేశబోయిన లక్ష్మణరావు ఇంట్లో మూడున్నర తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి, రూ.1,20,000 నగదుతో ఉడాయించారు. అక్కడికి దగ్గరలోని శ్రీనివాసరావు ఇంటి వద్ద నిలిపి ఉంచిన రాయల్‌ ఎన్‌ఫిల్డ్‌ బండిని ఎత్తుకెళ్లారు. బాపనకుంట ప్రాంతానికి చెందిన కళావతి ఇంట్లోకి చొరబడి 14 గ్రాముల చైన్‌ను దొంగిలించారు. వెంటనే ఎస్‌ఐ నరేశ్‌ క్లూస్‌ టీంను పిలిపించి వేలిముద్రలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

శుక్రవారం అర్ధరాత్రి 1 గంట సమయంలో ఓ ఇంట్లో చోరీ జరిగిన విషయం  గుర్తించిన బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ భానుప్రకాశ్‌ తన సిబ్బందితో చుట్టుపక్కల ప్రాంతాల్లో జల్లెడపడుతున్న క్రమంలోనే కొద్ది దూరంలోనే దొంగతనాలు జరిగినట్లు సమాచారం రావడం, అర్ధరాత్రి సమయంలోనే పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు సేకరించారు.  దొంగతలు జరగడంపై ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.

అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలి :  సీఐ 

మణుగూరు పట్టణంలో, పీవీకాలనీలో పోలీసుల గస్తీని పెంచాం. ఎవరైనా ఇంటి నుంచి ఊరికి వెళ్లే సమయంలో విలువైన వస్తువులు లేకుండా జాగ్రత్త పడండి. కొత్త వ్యక్తుల సంచారం ఉన్నా.. అపరిచిత వ్యక్తులపట్ల అప్రమత్తంగా ఉండాలి.