మంగళవారం 24 నవంబర్ 2020
Badradri-kothagudem - Nov 07, 2020 , 04:12:29

ఆఖరిగింజా కొనుగోలు చేస్తాం

ఆఖరిగింజా కొనుగోలు చేస్తాం

  •  నిరాటంకంగా సంక్షేమ పథకాలు
  •  మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌
  • మన రైతులు అదృష్టవంతులు :  ఎంపీ నామా 
  • రైతులు నష్టపోకుండా  కేసీఆర్‌ ముందుచూపు :  ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య

సత్తుపల్లి : తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రజలపై ఎలాంటి భారం మోపకుండా ఏడేండ్ల నుంచి సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని రాష్ట్ర రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. శుక్రవారం సిద్ధారంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కలెక్టర్‌ ఆర్‌వీ.కర్ణన్‌లతో కలిసి మొక్కజొన్న కొనుగోలు కేంద్రం, పల్లెప్రకృతివనం, వైకుంఠధామాల ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ జిల్లాలో సత్తుపల్లి, పాలేరు ని యోజకవర్గాలు వరిసాగు చేపట్టడంలో అగ్రస్థానంలో ఉన్నాయన్నారు. జిల్లాలో పంటను కొనుగోలు చేసేందు కు 438 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, వీటిలో 117 సత్తుపల్లి నియోజకవర్గంలోనే ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. ధాన్యం కొనుగోలు కోసం 66లక్షలు గన్నీ సంచులు జిల్లాలో సిద్ధంగా ఉంచామని, రవాణాకు సైతం ఇబ్బందులు లేకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారన్నారు. 

కేంద్రానివి తప్పుడు నిర్ణయాలు : ఎంపీ

దేశంలోని రైతులంతా తెలంగాణవైపు చూస్తున్నారని, పరిపాలన దక్షత కలిగిన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండటం మన రైతుల అదృష్టమని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతువ్యతిరేక బిల్లులను తీసుకొస్తుందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతులకు ఇచ్చే 24 గంటల ఉచిత విద్యుత్‌ను సైతం ఆపడానికి త్వరలో పార్లమెంట్‌లో డ్రాఫ్ట్‌ బిల్లులు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుందన్నారు. 

వ్యవసాయ చట్టంతో రైతులకు నష్టం : సండ్ర

కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టం అమలుచేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మక్కజొన్న రైతులను దెబ్బతీసేందుకు 5లక్షల మెట్రిక్‌ టన్నులు మక్కజొన్నలను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఇచ్చిందని, దీనివల్ల రాష్ట్రంలో కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు. గత ఏడాది క్వింటా రూ.1765కు కొనుగోలు చేస్తే.. నేడు అందులో సగం ధర కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు. అయినప్పటికీ రైతులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్‌ మక్కజొన్నల కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నారన్నారు. ఖమ్మం నుంచి సత్తుపల్లి జాతీయ రహదారి అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని, ప్రస్తుతం పనులు కూడా ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం మద్దతు ధరకు కొ నుగోలు చేస్తుందని అన్నారు. జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ.కర్ణన్‌ మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో ఆరబోసి నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలన్నారు.

కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ మధుసూదన్‌రావు, డీసీవో విజయకుమారి, డీఎస్‌వో రాజేందర్‌, ఆర్డీవో సూర్యనారాయణ, జేడీఏ విజయనిర్మల, ఏఎం నర్సింహారావు, డీఎం సోములు, డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల వెంకటశేషగిరిరావు, ఎంపీపీ దొడ్డా హైమావతి శంకర్‌రావు, ఆత్మాచైర్మన్‌ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, సర్పంచ్‌ నల్లంటి ఉదయలక్ష్మి, ఎంపీటీసీ అరుణకుమారి, రైతుబంధు జిల్లా సభ్యులు పసుమర్తి చందర్‌రావు, గాదె సత్యం, డీసీసీబీ డైరెక్టర్లు తుళ్లూరి బ్రహ్మయ్య, చల్లగుళ్ల కృష్ణయ్య, బోబోలు లక్ష్మణరావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు యాగంటి శ్రీను, నాయకులు మోరంపూడి ప్రసాద్‌, మోరంపూడి ప్రభాకర్‌, మందపాటి ముత్తారెడ్డి, మట్టా ప్రసాద్‌, తోట సుజలారాణి, అమరవరపు కృష్ణారావు, బొడ్డు శివరామకృష్ణలతో పాటు ట్రాన్స్‌కో డీఈ వెంకటేశ్వర్లు, ఏడీఈ కిరణ్‌కుమార్‌, వ్యవసాయశాఖ ఏఈ నర్సింహారావు, ఎంపీడీవో సుభాషిణి, డీటీ సురేందర్‌, సొసైటీ అధ్యక్షులు చిలుకుర్తి కృష్ణమూర్తి, తుమ్మూరు శ్రీరాంప్రసాద్‌, మామిళ్లపల్లి కృష్ణయ్య, మందపాటి వెంకటరెడ్డి, సొసైటీ సీఈవోలు తదితరులు పాల్గొన్నారు.