ఆదివారం 06 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Nov 06, 2020 , 00:56:03

పీఎంఈజీపీ రుణాలకు దరఖాస్తుల ఆహ్వనం

పీఎంఈజీపీ రుణాలకు దరఖాస్తుల ఆహ్వనం

కొత్తగూడెం అర్బన్‌: ప్రధానమంత్రి  ఉపాధి కల్పన కార్యక్రమం(పీఎంఈజీపీ) ద్వారా రుణాలు పొందాలనుకునే ఎంట్రప్రెన్యూర్లు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా పరిశ్రమలశాఖ జనరల్‌ మేనేజర్‌ ఎ.సీతారాంనాయక్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సూక్ష్మ తరహా పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి పొందాలనే ఔత్సాహికులు పీఎంఈజీపీ పోర్టల్‌లో లాగిన్‌ అయి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. 18 సంవత్సరాలు నిండినవారు, తయారీ రంగ పరిశ్రమ నెలకొల్పేవారు రూ.25లక్షలలోపు, సేవారంగంలో స్థాపించే పరిశ్రమకు రూ.10లక్షలతో ఏర్పాటు చేసే ఎంట్రప్రెన్యూర్‌లకు సబ్సిడీ ఉంటుందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు పట్టణాల్లో ఐదు శాతం పెట్టుబడి, జనరల్‌ అభ్యర్థులు 10శాతం పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటు చేసుకోవచ్చని వివరించారు. మరిన్ని వివరాలకు జిల్లా పరిశ్రమల శాఖ కార్యాలయంలో సంప్రదించవచ్చని సూచించారు. 

‘ఉద్యం’లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని ఉత్పత్తి, కార్యకలాపాలు కొనసాగిస్తున్నవారు ‘ఉద్యం’ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని కోరారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న ఎంట్రప్రెన్యూర్‌ల ఖాతాలను పునరుద్ధరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మార్చి 31వ తేదీలోగా ఉద్యం పోర్టల్‌లో  రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని, రూ.కోటి లోపు పెట్టుబడి రూ.5కోట్ల టర్నోవర్‌ ఉంటే సూక్ష్మ పరిశ్రమగా, రూ.10కోట్ల పెట్టుబడి రూ.50కోట్ల టర్నోవర్‌ ఉంటే చిన్నతరహా పరిశ్రమగా, రూ.50కోట్ల పెట్టుబడి రూ.250కోట్ల టర్నోవర్‌ ఉంటే మధ్యతరహా పరిశ్రమగానూ పరిగణిస్తారని ఆయన వివరించారు.