సోమవారం 23 నవంబర్ 2020
Badradri-kothagudem - Nov 06, 2020 , 00:56:06

సాంకేతిక సమస్యలను అధిగమించాలి

సాంకేతిక సమస్యలను అధిగమించాలి

  • టీఎస్‌ జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు
  • కేటీపీఎస్‌ ఏడో దశ కర్మాగార విభాగాల పరిశీలన

పాల్వంచ: విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం కలగొద్దని, సాంకేతిక సమస్యలను అధిగమించాలని టీఎస్‌ జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు సూచించారు. గురువారం కేటీపీఎస్‌లో జెన్‌కో డైరెక్టర్లు, ఇంజినీర్లతో ఆయన మాట్లాడారు. కేటీపీఎస్‌ ఏడో దశలో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో 800 మెగావాట్ల సామర్ధ్యంతో నిర్మించిన కర్మాగారాన్ని సందర్శించారు. హైదరాబాద్‌ నుంచి బయలుదేరి గురువారం సాయంత్రం 5 గంటలకు పాల్వంచకు చేరుకున్న ఆయన.. నేరుగా గెస్ట్‌హౌస్‌కు వెళ్లి అక్కడ కొద్దిసేపు టీఎస్‌ జెన్‌కో డైరెక్టర్లు, కేటీపీఎస్‌ సీఈలతో సమావేశమయ్యారు. అనంతరం 6 గంటలకు కేటీపీఎస్‌ ఏడో దశ కర్మాగారాన్ని సందర్శించారు. సింగరేణి నుంచి వచ్చే బీఓబీఆర్‌ బొగ్గు వ్యాగన్ల అన్‌లోడ్‌ ప్రక్రియను పరిశీలించారు. ఆ తర్వాత సైలో వరకూ వచ్చి దాన్ని పూర్తిగా చూశారు. అక్కడి నుంచి నడుచుకుంటూ  కర్మాగారంలోని ఈఎస్పీ, బాయిలర్‌ డివిజన్లను పరిశీలించుకుంటూ యూనిట్‌ కంట్రోల్‌ బోర్డు (యుసీబీ)కు చేరుకున్నారు. ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. పరిస్థితిని గురించి డైరెక్టర్లు, సీఈలతో సమీక్షించారు. యూనిట్‌లో ఉత్పత్తి చేపట్టిన తర్వాత నుంచి పరిస్థితి ఏ విధంగా ఉందనే విషయంపై చర్చించారు. ఇటీవల నూతన రైల్వే ట్రాక్‌ పూర్తి చేసిన తర్వాత బొగ్గు సరిపడా వస్తున్నదా లేదా అని తెలుసుకున్నారు. 

ఏడాది తర్వాత కేటీపీఎస్‌ సందర్శన..

రాష్ర్టానికి అత్యధిక విద్యుత్‌ను అందిస్తున్న కేటీపీఎస్‌ను సీఎండీ ప్రభాకర్‌రావు ఏడాది తర్వాత సందర్శించారు. శుక్రవారం ఉదయం శాశ్వతంగా మూసేసిన కేటీపీఎస్‌ పాత కర్మాగారాన్ని పరిశీలించనున్నారు. అనంతరం ఆయన మణుగూరు బీటీపీఎస్‌ కర్మాగారాన్ని సందర్శిస్తారు. శనివారం ఉదయం కేటీపీఎస్‌ 5, 6 దశల కర్మాగారాలను సందర్శించి ఉత్పత్తి ప్రక్రియపై సమీక్షిస్తారు. జెన్‌కో డైరెక్టర్లు లక్ష్మయ్య, అజయ్‌, సీఎండీ పీఏ హనుమాన్‌, సీఈలు వెంకటేశ్వరరావు, బీటీపీఎస్‌ సీఈ పిల్లి బాలరాజు, ఎస్‌ఈలు ఎం.శ్రీనివాసరావు, మంగీలాల్‌, యుగపతి, బీహెచ్‌ఈఎల్‌ ఇంజినీర్లు పాల్గొన్నారు.