మంగళవారం 01 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Nov 06, 2020 , 00:56:13

ఇంటింటికీ శుద్ధజలం

ఇంటింటికీ శుద్ధజలం

  • భద్రాద్రి ఏజెన్సీ గొంతు తడిపిన ‘మిషన్‌ భగీరథ’
  • మిషన్‌ భగీరథతో గూడేల్లో తీరుతున్న మంచినీటి వ్యథ
  • తెలంగాణ వచ్చాక ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగు నీరు 

దుమ్ముగూడెం: భద్రాద్రి ఏజెన్సీలో మిషన్‌ భగీరథతో సీఎం కేసీఆర్‌ అపరభగీరథుడయ్యారు. గోదావరి జలాలను భద్రాద్రి ఏజెన్సీతోపాటు ఉమ్మడి జిల్లాల్లో ఇంటింటికీ అందించేందుకు శ్రీకారం చుట్టారు. మిషన్‌ భగీరథతో ఏజెన్సీ గొంతు తడిపినట్లయింది. ప్రతీ గ్రామంలో పైపులైను ఏర్పాటు చేసి ఇంటింటికీ నల్లాల ద్వారా మిషన్‌ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడక ముందు ఏజెన్సీలో మారుమూల గ్రామాల ప్రజలు మంచినీటి కోసం నానా అగచాట్లు పడేవారు. తెలంగాణ ఏర్పడి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత అనతికాలంలోనే భద్రాచలం ఏజెన్సీ వ్యాప్తంగా తాగునీటి కష్టాలు తీరిపోయాయి. మిషన్‌ భగీరథను నెలకొల్పి పైపులైన్లు, నల్లాలు ఏర్పాటు చేసి మారుమూల పల్లెల్లో ఉన్న ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన గోదావరి జలాలను సరఫరా చేస్తున్నారు.

రూ.55 కోట్లతో   పనులు..

దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల క్రాస్‌రోడ్డు వద్ద దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో మంచినీటి సరఫరాకు రూ.55 కోట్లతో మిషన్‌ భగీరథ పనులను ప్రభుత్వం చేపట్టింది. మారుమూల గ్రామాలకు సైతం శుద్ధిచేసిన నీటిని అందిస్తున్నారు. దుమ్ముగూడెం మండలంలో 103 హ్యాబిటేషన్లు ఉండగా 80 హ్యాబిటేషన్లకు తాగునీరు అందుతోంది. పది గ్రామాలకు పైపులైను నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పది గ్రామాల్లో ప్రజలు తక్కువగా ఉండటం వల్ల పైపులైన్ల ఏర్పాటు కొంతమేరకు ఆలస్యమైంది. కొత్తగా 37 మంచినీటి ట్యాంకుల నిర్మాణాన్ని చేపట్టడంతోపాటు 32 పాత ట్యాంకులకు కూడా మరమ్మతులు చేపట్టి అన్నింటికీ మిషన్‌ భగీరథ ద్వారా మంచినీటిని నింపి గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. దీంతో భద్రాద్రి ఏజెన్సీలో ప్రజల చిరకాల ఆకాంక్ష మంచినీటి సరఫరాతో నెరవేరింది.

నల్లా తిప్పితే నీళ్లు..


నల్లా తిప్పితే మిషన్‌ భగీరథ నీళ్లొస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా మన్యంలో మంచినీటి కోసం పడరాని పాట్లు పడ్డాం. కొన్ని మారుమూల గిరిజన గ్రామాల్లో చెలమల ద్వారా మంచినీటిని తోడుకునే పరిస్థితి అప్పట్లో ఉండేది. మంచినీటి కోసం, ఇతర అవసరాల కోసం ఎన్నో మైళ్లు నడిచి వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం మిషన్‌ భగీరథ ద్వారా ఉదయం, సాయంత్రం ఇంటి వద్ద నల్లాల్లోకే మంచినీటి వస్తున్నాయి. నీటికి కొదువ లేకుండా పోయింది. 

-తెల్లం సీతమ్మ, జడ్పీటీసీ, దుమ్ముగూడెం