సోమవారం 30 నవంబర్ 2020
Badradri-kothagudem - Nov 02, 2020 , 02:38:13

యాసంగికి పుష్కలంగా సాగునీరు

యాసంగికి పుష్కలంగా సాగునీరు

  • నిండుకుండల్లా 2,369 చెరువులు
  • మత్తడి దుంకుతున్న తటాకాలు,  ప్రాజెక్టులు
  • నీటి వృథాను అరికడుతున్న అధికారులు
  • పెరగనున్న సాగు విస్తీర్ణం

చెరువు నిండితే.. పల్లె సంబురం మాటల్లో చెప్పలేనిది. ఎందుకంటే.. చెరువుతోనే వారి జీవనవిధానం ముడిపడి ఉంటుంది. సాగునీటికి, తాగునీటికి, ఊరి అభివృద్ధికి చెరువే ఆధారం. అందుకే చెరువు నిండితే పల్లెబతుకులు పరవశిస్తాయి. ఈ ఏడాది విస్తారంగా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు, బావులు, చెరువులు మొదలుకొని ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఎక్కడచూసినా నీరే కనిపిస్తుండటంతో యాసంగికి భరోసా ఏర్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 2,396 చెరువులు దాదాపు 80 శాతం నీటితో కళకళలాడుతుండటంతో.. యాసంగి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.   

 - భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ జిల్లాలో 2,396 చెరువులు ఉండగా, అందులో 50-75 శాతం నీటితో 44 చెరువులు, 75-100 శాతం నీటితో 1820 చెరువులు, మరో 532 చెరువులు జలంతో ఉట్టిపడుతున్నాయి. అడుగంటిన భూగర్భజలాలు పైకి ఉబికివస్తున్నాయి. ఎక్కడ చూసినా మోట బావులు, చేదబావులలో చేతికందే విధంగా నీళ్లున్నాయి. కొన్నేళ్లుగా ఇంత వర్షపాతం నమోదుకాకపోవడంతో జిల్లాలో నీటి వనరులకు కొదువ లేకుండాపోయింది. కిన్నెరసాని, పెద్దవాగు, తాలిపేరు ప్రాజెక్టులు నిండిపోయాయి. వీటి గేట్లను అధికారులు పలుమార్లు పైకెత్తి క్యూసెక్కుల కొద్ది నీటిని దిగువకు విడుదల చేశారు. ఏ ఊరు చెరువు చూసినా నిండుగా దర్శనమిస్తున్నాయి. 

 పుష్కలంగా ‘సాగునీరు’.. 

పూర్తిస్థాయి చెరువులో నిండి పుష్కలంగా నీరుండటంతో యాసంగి వ్యవసాయానికే కాకుండా వచ్చే వానకాలం పంటలకు కూడా నీరు సరిపోతుందని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో అధిక వర్షపాతం నమోదైనా ఇంత పెద్ద మొత్తంలో చెరువులు నిండలేదంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కొన్ని చెరువులకు గండ్లు కూడా పడ్డాయని,  యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టిన నీటి వృథాను ఆరికట్టారు. 0.65 టీఎంసీల సామర్థ్యం ఉన్న తాలిపేరు పూర్తిగా నిండింది. దీని ద్వారా 24వేల ఎకరాలకు సాగునీరు, 0.84 టీఎంసీల సామర్థ్యం ఉన్న కిన్నెరసాని ప్రాజెక్ట్‌ ద్వారా 10వేల ఎకరాలకు సాగునీరు, 0.55 టీఎంసీల నీటి సామర్థ్యం గల పెద్దవాగు ప్రాజెక్టు ద్వారా జిల్లాలో 2వేల ఎకరాలు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 13వేల ఎకరాలకు నీరందనుంది. 

  చెరువే గ్రామానికి ఆదెరువు.. 

ఏ గ్రామానికైనా చెరువే ఆధారం. గ్రామ జీవనం ప్రధాన నీటి వనరైన చెరువుపైనే ఆధారపడి ఉంటుంది. సకల పనులకు అదే అదెరువు. చెరువులో నీరుంటే అటు సాగునీటి అవసరాలకు, ఇటు తాగునీటి అవసరాలకు చింత ఉండదు. చెరువు నిండుగా నీరుంటే గ్రామాల వాతావరణంలో మార్పు ఉంటుంది. అటువంటి చెరువులన్నీ వర్షాలకు జలకళను సంతరించుకోవడంతో   ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెరువులో సంవత్సరం పొడవునా నీరుంటే చుట్టుపక్కల కొన్ని ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు ఆయా ప్రాంతాల్లో భూగర్భజలాలు కూడా పెరిగి బావులు, బోర్లలో నీరు పుష్కలంగా ఉంటుంది. ఏ గ్రామంలోనైనా వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉండడం, చెరువుతోనే వ్యవసాయ రంగంతో పాటు ఇతర రంగాలు ముడిపడి ఉండడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 నీరు వృథాను అరికడుతున్నాం.. 


జిల్లాలో అధిక వర్షపాతం నమోదై చెరువులు, కుంటలు, ప్రాజెక్టులన్నీ నిండి జలకళను సంతరించుకున్నాయి.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీటి వనరులను పెంచేందుకు మిషన్‌కాకతీయ పథకం ద్వారా 1,300 చెరువులను, ట్రిపుల్‌ ఆర్‌ ప్యాకేజీ కింద మరో 70 చెరువులను పూడికతీతతో పునరుద్ధ్దరించాం. దీంతో చెరువుల్లో అధికనీరు నిల్వ ఉంది. చెరువులు, మత్తడిలను బలంగా ఏర్పాటు చేశాం. ఎంత పెద్ద వర్షాలు పడ్డా చెరువు కట్టలకు ఇబ్బందులు తలెత్తకుండా చేశాం. 

- సాగునీటి పారుదల శాఖ ఈఈ కే వెంకటేశ్వరరెడ్డి