సోమవారం 30 నవంబర్ 2020
Badradri-kothagudem - Oct 30, 2020 , 04:53:25

‘ధరణి’తో భూ వివాదాలకు చెక్‌..

‘ధరణి’తో భూ వివాదాలకు చెక్‌..

సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ధరణి పోర్టల్‌తో రైతుల భూ వివాదాలు పూర్తిగా తొలగిపోనున్నాయని, ధరణి సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీవో గౌతమ్‌ పోట్రు అన్నారు. గురువారం ఆయన ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్‌ కోసం ప్రవేశపెట్టిన నూతన ధరణి వెబ్‌సైట్‌ను తహసీల్దారు కార్యాలయంలో తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి, వెబ్‌సైట్‌ ప్రారంభించి మాట్లాడారు. ఆన్‌లైన్‌ ద్వారా తహసీల్దారు కార్యాలయంలో అరగంటలో భూములకు సంబంధించిన హక్కుదారులకు రిజిస్ట్రేషన్‌, పట్టా పాస్‌పుస్తకం పొందవచ్చన్నారు. ధరణి పోర్టల్‌తో భూమల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన సేవలు సులభతరం కానున్నాయన్నారు.

భద్రాచలం నియోజకవర్గంలోని భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, పర్ణశాల, పినపాక నియోజకవర్గంలోని మణుగూరు, మణుగూరు రూరల్‌, బూర్గంపహాడ్‌, పినపాక, అశ్వాపురం, కరకగూడెం, గుండాల, ఆళ్లపల్లి, సారపాక మండలాల్లోని తహసీల్దార్‌ కార్యాలయాల్లో  జిల్లా అదనపు కలెక్టర్‌ కర్నాటి వెంకటేశ్వరరావు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు,తహసీల్దార్లు, ఎంపీడీవోలు ధరణి పోర్టల్‌ను ప్రారంభించి మాట్లాడారు. రెవెన్యూశాఖలో అవినీతిని రూపుమాపేందుకు నూతన రెవెన్యూ చట్టాన్ని తెచ్చి భూముల రిజిస్ట్రేషన్‌లో ఎలాంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీగా ధరణి వెబ్‌సైట్‌కు శ్రీకారం చుట్టడం గొప్ప విషయమన్నారు. మీసేవలో స్లాట్‌ బుక్‌చేసిన సమయంలో మీకు ఇచ్చిన సమయానికి కార్యాలయానికి వెళితే దళారుల ప్రమేయం లేకుండా రిజిస్ట్రేషన్‌ చేయించుకునే వీలుందన్నారు.  కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు  పాల్గొన్నారు.

- భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, పర్ణశాల, మణుగూరు, మణుగూరు రూరల్‌, బూర్గంపహాడ్‌, పినపాక, అశ్వాపురం, కరకగూడెం, గుండాల, ఆళ్లపల్లి

ధరణితో మేలు 

తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ధరణి పోర్ట ల్‌ రైతులకు ఎంతో మేలు చేస్తుంది. ధరణిలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ వల్ల ప్రతి రైతు కు తన పొలాల సరిహద్దులు చిరకాలం నిలిచి ఉంటాయి. డిజిటల్‌ యుగంలో ధరణి పోర్టల్‌ ఆవిష్కరణ సరికొత్త అధ్యాయం.

 - చంద్రయ్య, రైతు, నల్లబల్లి, పర్ణశాల

రైతుబాంధవుడు కేసీఆర్‌

తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నేటివరకు రైతుల సంక్షేమమే పరమావధిగా సీఎం పనిచేస్తున్నాడు. ఆ యన రైతు బాంధవుడు. రైతులకు సంబంధించిన పట్టా పాస్‌పుస్తకాలు, భూముల వివరాలు అవినీతి కోరల్లో చిక్కుకోకుండా ఉండేందుకు కొత్త చట్టాన్ని తెచ్చి ధరణి పోర్టల్‌ను ప్రారంభించి రైతులకు బాధలనేవి లే కుండా చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్‌. మ ధ్యవర్తులకు డబ్బులు ఇచ్చే పనిలేకుండా చేసిండు.

 - రామకృష్ణ, రైతు, మోరంపల్లిబంజర, బూర్గంపహాడ్‌ మండలం