మంగళవారం 24 నవంబర్ 2020
Badradri-kothagudem - Oct 29, 2020 , 02:16:37

ప్రతి గింజా కొనుగోలు చేస్తాం

ప్రతి గింజా కొనుగోలు చేస్తాం

  • రైతులు ఇబ్బందిపడకుండా ప్రణాళికలు సిద్ధం  
  • 31.75 లక్షల గన్నీబ్యాగులను అందుబాటులో ఉంచాం
  • ఆధునిక వ్యవసాయంపై రైతుల్లో చైతన్యం తేవాలి
  • 67 క్లస్టర్లలో శరవేగంగా రైతువేదికల నిర్మాణం 
  • రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌
  • సాగు ప్రణాళిక, ధాన్యం కొనుగోలు కేంద్రాలపై మంత్రి సమీక్ష 

భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: రైతు వద్దకే వచ్చి పంటలు కోనుగోలు చేస్తామని, రైతులు అధైర్యపడొద్దని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. బుధవారం కొత్తగూడెం క్లబ్‌లో వానకాలం-2020-21 సంవత్సర కార్యాచరణ ప్రణాళిక, ధాన్యం కోనుగోలు, రైతు వేదికల ఏర్పాటు తదితర అంశాలపై జిల్లా స్థ్ధాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..  కరోనా సమయంలో రైతులు ఇబ్బందులు పడకుండా ఏవిధంగా ధాన్యం కోనుగోలు చేశామో అదే స్ఫూర్తితో ఈ సీజన్‌లో పంటలు కోనుగోలు చేయాలని, ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగుతూ కొనుగోలు చేస్తామన్నారు.  250 కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ధాన్యం కొనుగోలుకు 50లక్షల గన్నీబ్యాగులు అవసరమని, ఇప్పటి వరకు జిల్లాలో 31.75 లక్షల గన్నీబ్యాగులను సిద్ధంగా ఉంచామన్నారు.  నవంబర్‌ మొదటి వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు.  మొక్కజొన్నకు బదులుగా కూరగాయలు, ఆయిల్‌పాం, అపరాలు సాగు చేసే విధంగా రైతులకు రైతు బంధు సభ్యులు, వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలన్నారు.

పత్తి కొనుగోలుకు తక్షణమే సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను అదేశించారు. కొనుగోలు కేంద్రాలలో తూకపు పరికరాలు, అగ్ని ప్రమాద నియంత్రణ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి క్లస్టర్‌కు ఒక కియోస్క్‌ను ఏర్పాటు చేయాలన్నారు.  ఇతర రాష్ట్రాల నుంచి మన జిల్లాకు వచ్చి ధాన్యం విక్రయించకుండా సరిహద్దుల్లో పటిష్ఠ నిఘాను ఏర్పాటు చేయాలని మార్కెటింగ్‌ అధికారులను మంత్రి ఆదేశించారు. వ్యవసాయాన్ని రైతులు ఆధునిక పద్ధతుల ద్వారా చేపట్టే విధంగా వ్యవసాయ విస్తరణ అధికారులు పనిచేయాలని చెప్పారు. 

జిల్లాలో 67 క్లస్టర్లలలో రైతు వేదికల నిర్మాణం శరవేగంగా కొనసాగుతుందని చెప్పారు.  ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు, జడ్పీ చైర్మెన్‌ కోరం కనకయ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మీ, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అంకిరెడ్డి కృష్ణారెడ్డి, కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి, ఆదనపు కలెక్టర్‌ దురిశెట్టి అనుదీప్‌, ఐటీడీఏ పీఓ పోట్రు గౌతమ్‌, జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌, వ్యవసాయ అధికారి అభిమన్యుడు, మార్కెటింగ్‌ ఏడి నరేందర్‌, మార్కెఫెడ్‌ డీఎం సుధాకర్‌,  వ్యవసాయ శాఖ సంబంధిత  అధికారులు పాల్గొన్నారు.