బుధవారం 25 నవంబర్ 2020
Badradri-kothagudem - Oct 29, 2020 , 02:16:35

సీతారామతో సస్యశ్యామలం

సీతారామతో సస్యశ్యామలం

  • సాగునీటి పథకాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
  • రాష్ట్ర రవాణాశాఖ మంత్రి  అజయ్‌కుమార్‌
  • పినపాక నియోజకవర్గంలో విస్తృత పర్యటన
  • పులుసుబొంత ప్రాజెక్టు నిర్మాణానికి ఏర్పాట్లు
  • ప్రభుత్వ విప్‌ రేగా

సీతారామ ప్రాజెక్టు, సీతమ్మసాగర్‌తో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలమవుతుంది.. పులుసుబొంత ప్రాజెక్టుతో పినపాక నియోజకవర్గంలోని ప్రతి మండలానికి సాగునీరు అందుతుంది.. సాగునీటి ప్రాజెక్టులు, లిఫ్ట్‌ ఇరిగేషన్‌       పథకాలు, చెక్‌ డ్యాంల నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి    సారిస్తున్నది.. యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూస్తాం..’ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ హామీ ఇచ్చారు. బుధవారం పినపాక నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటించారు.. ఎంపీ కవిత, ప్రభుత్వ విప్‌ రేగాతో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించి, అనంతరం కరకగూడెం మండలం అనంతారంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.. మారుమూల పల్లెల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ప్రభుత్వ నిధులతో మౌలిక వసతుల కల్పిస్తామన్నారు.  

కరకగూడెం : సీతారామ ప్రాజెక్టు ఉమ్మడి జిల్లా సస్యశ్యామలమవుతుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. బుధవారం మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు  శంకుస్థాపన చేశారు. అనంతారం పంచాయతీ కొత్తూరు నుంచి వయా చొప్పాల మీదుగా 9 గ్రామాలను కలుపుతూ సమత్‌మోతే పంచాయతీ గొల్లగూడెం వరకు పీఎంజీఎస్‌వై నిధులు రూ. 2.20 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి పువ్వాడ, మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి అజయ్‌ మాట్లాడుతూ..

సమైక్య పాలనలో రోడ్డు సౌకర్యాలు లేక ప్రజలు నరకయాతన పడ్డారని, సీఎం కేసీఆర్‌ అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నారన్నారు. గ్రామాల్లోని ప్రజలు ప్రతి ఒక్కరూ సహకరించి అభివృద్ధిలో భాగస్వాములవ్వాలన్నారు.  అలాగే ఈ ప్రాంత రైతాంగానికి సాగు నీరందించేందుకు పులుసుబొంత ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వరప్రదాయిని సీతారామ ప్రాజెక్టు పనులు పినపాక నియోజకవర్గం నుంచి అద్భుతంగా పూర్తవుతున్నాయని చెప్పారు. ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి జిల్లా సస్యశ్యామలమవుతుందన్నారు.  ఈ ప్రాజెక్టు పూర్తయితే నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సాగునీరందుతుందని చెప్పారు. అలాగే చరిత్రాత్మకంగా ధరణి వెబ్‌సైట్‌ను గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభిస్తున్నారని,

దీంతో ఇక రైతుల కష్టాలు పూర్తిగా తొలగిపోతాయని భరోసా కల్పించారు. అనంతరం మంత్రి అజయ్‌ మండలంలోని మోతే- రఘనాథపాలెం గ్రామాల మధ్య ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెద్దవాగుపై కూలిన వంతెనను పరిశీలించి  వంతెన ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య మాట్లాడుతూ... బంగారు తెలంగాణ సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ దిండిగాల రాజేందర్‌, ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్‌, అదనపు కలెక్టర్‌ అనుదీప్‌, ఏఎస్పీ శబరీష్‌, ఆర్‌డీవో స్వర్ణలత, జడ్పీటీసీ  కొమరం కాంతారావు, ఎంపీపీ రేగా కాళిక, సర్పంచులు జవ్వాజీ రాధ, బత్తిని నర్సింహారావు, గొగ్గల నాగమణి, ఇర్ప విజయ్‌కుమార్‌, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీసులు భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. 

మణుగూరులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన 

మణుగూరు : రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ బుధవారం  మణుగూరు మండలంలో పర్యటించారు. రూ. 5.73 కోట్ల వ్యయంతో నిర్మించే రోడ్లు, వంతెనల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. తొలుత ఆయన మండలంలోని  రూ. 4.63 కోట్ల వ్యయంతో రామానుజవరం-పగిడేరు వయా గొల్ల కొత్తూరు, కొత్తూరు కాలనీ వరకు  నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

అనంతరం మణుగూరు మున్సిపాలిటీలో కుంకుడుచెట్ల గుంపు వద్ద రూ. 60లక్షల వ్యయంతో కట్టువాగుపై నిర్మించనున్న వంతెనకు, ఆదర్శనగర్‌లో రూ.70లక్షల వ్యయంతో కట్టువాగుపై నిర్మించనున్న వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కవిత, ప్రభుత్వ విప్‌ రేగా, జడ్పీ చైర్మన్‌ కోరం, మణుగూరు జడ్పీటీసీ పోశం నర్సింహారావు, డీసీసీబీ డైరెక్టర్‌తుళ్లూరి బ్రహ్మయ్య, ఎంపీపీ కారం విజయకుమారి, మున్సిపల్‌ కమిషనర్‌ నాయిని వెంకటస్వామి,  పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు ముత్యంబాబు, అడపా అప్పారావు తదితరులు పాల్గొన్నారు. 

డిసెంబర్‌ నాటికి ప్రాజెక్ట్‌ నిర్మాణానికి ఏర్పాటు.

డిసెంబర్‌ నాటికి అన్ని అనుమతులతో పులుసుబొంత ప్రాజెక్ట్‌కు సంబంధించిన అన్ని అనుమతులు పూర్తి చేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రాజెక్ట్‌ పనులు ప్రారంభిస్తామని ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టం చేశారు. 40 ఏండ్లుగా అధికారంలో ఉండి ప్రతిపక్ష నాయకులు ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు. అభివృద్ధిని అడ్డుకునేందుకే లేనిపోని విమర్శలు చేస్తున్నారని చురకలు అంటించారు. పులుసుబొంత ప్రాజెక్ట్‌ పనులను త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు.  

ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే  రేగా కాంతారావు

కోట్లాది రూపాయలతో ఏజెన్సీ గ్రామాల అభివృద్ధి

 ఏజెన్సీ గ్రామాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ కోట్లాది రూపాయలను మంజూరు చేస్తున్నారని మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత అన్నారు. టీఆర్‌ఎస్‌తోనే  మారుమూల పల్లెల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పులుపుబొంత ప్రాజెక్ట్‌ నిర్మాణానికి సంబంధించి త్వరలోనే ఈ ప్రాంత ప్రజలు తీపి కబురు వింటారని తెలిపారు. ఫారెస్ట్‌ క్లియరెన్స్‌ కోసం ఢిల్లీలో ఉన్నాతాధికారులతో మాట్లాడి అనుమతులు మంజూరు చేయిస్తామని స్పష్టం చేశారు.

మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత