శనివారం 05 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Oct 27, 2020 , 04:48:16

సందడిగా రామ్‌లీలా మహోత్సవం

సందడిగా రామ్‌లీలా మహోత్సవం

  • భద్రాద్రిలో ముగిసిన శరన్నవ రాత్రి ఉత్సవాలు
  • నిజరూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు
  • వైభవోపేతంగా శమీ పూజ
  • రావణ వధకు బాణం సంధించిన ఆలయ ఈవో
భద్రాచలం: భద్రాచలం పుణ్యక్షేత్రం భక్తిభావంతో మునిగితేలింది.  విజయదశమి సంబురాలు అంబరాన్నంటాయి. రామ్‌లీల మహోత్సవం భక్తులను మైమరిపించింది. సోమవారం విజయదశమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శమీపూజ ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీ సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులను స్వామి వారి ఆలయం నుంచి మేళతాళాల నడుమ దసరా మండపానికి తీసుకొచ్చారు. అనంతరం శమీ పూజను భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ఉదయం ఆరాధన ప్రక్రియలో భాగంగా అమ్మవారికి అభిషేకం, అష్టోత్తర సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం స్వామి వారికి నిత్య కల్యాణం, మహాపట్టాభిషేకం నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున పూర్ణాహుతి గావించారు.  అలాగే స్వామి వారిని ముత్తంగి రూపంలో అలంకరించారు. మహాలక్ష్మి అమ్మవారు ‘నిజరూప లక్ష్మి’ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. 
పరవశించిన భద్రాద్రి పుణ్యక్షేత్రం
 దసరా ఉత్సవాలతో భద్రాద్రి భక్తితో పరవశించింది. రామ్‌లీలా మహోత్సవాన్ని  భక్తులు తిలకించి పులకించిపోయారు. మహోత్సవానికి ముందుగా శ్రీ సీతారామ చంద్రస్వామికి మహారాజు అలంకారం చేసి భాజాభజంత్రీలు, మేళతాళాలతో దసరా మండపం వద్దకు తిరువీధి సేవగా తీసుకొచ్చారు. తొలుత విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం నిర్వహించారు. తరువాత సంప్రోక్షణ నిర్వహించి షోడపోచారాలతో శమీ వృక్షానికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సుదర్శనం, ఖడ్గం, ధనస్సు, గధ తదితర ఆయుధాలకు పూజలు చేశారు. చివరగా ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరునకు ఆవాహనం చేసి బాణాలు సంధించారు. ఈ సందర్భంగా జమ్మి పత్రాలు అక్షింతలతో అర్చన చేసి చివరగా వాటిని భక్తుల శిరస్సుపై చల్లారు. అనంతరం శ్రీరామలీలా మహోత్సవాన్ని నిర్వహించగా వందలాది మంది భక్తులు కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా తిలకించారు. ఈ సమయంలో రావణాసురుని దిష్టిబొమ్మపై బాణాన్ని రామాలయ అర్చకులు సంధించారు. చివరగా స్వామివారిని రామాలయానికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బి శివాజీ, ఏఈవో శ్రవణ్‌కుమార్‌, డీఈ రవీందర్‌, ఏఈ నర్సింహారాజు, పీఆర్‌వో సాయిబాబు, స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ఆలయ ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, ఆలయ అర్చకులు, వేద పండితులు  పాల్గొన్నారు. పట్టణ సీఐ టి స్వామి, ట్రాఫిక్‌ ఎస్సై శ్రీనివాస్‌, అగ్నిమాపక శాఖాధికారి క్రాంతి కుమార్‌ ఆధ్వర్యంలో సిబ్బంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పర్యవేక్షించారు.