బుధవారం 02 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Oct 25, 2020 , 01:46:42

‘భద్రాద్రి సుందరీకరణ’కు ప్రణాళికలు

‘భద్రాద్రి సుందరీకరణ’కు ప్రణాళికలు

  • ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ
  • అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష

భద్రాచలం: దక్షిణ అయోధ్యగా పేరు గాంచిన భద్రాచలాన్ని ‘సుందరీకరణ’ చేసేందుకు సత్వర చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం భద్రాచలంలో డంపింగ్‌ యార్డు కోసం కూనవరం రోడ్డులో ఉన్న స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మార్కెట్‌ యార్డులో నిర్మాణం జరుగుతున్న రైతు వేదిక, ఎంపీడీవో కార్యాలయం వెనుక ఉన్న జరుగుతున్న ప్రకృతి వనం అభివృద్ధి పనులను జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కోరం కనకయ్యతో కలిసి పరిశీలించి, అధికారులకు పలు సలహాలు, సూచలను అందచేశారు. భద్రాద్రి అభివృద్ధికు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉందని బాలసాని అన్నారు. అభివృద్ధి పనుల పరిశీలన అనంతరం ఐటీడీఏ ప్రాంగణంలోని హౌజింగ్‌ గెస్ట్‌హస్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. భద్రాద్రిపై చిన్నచూపు చూస్తున్నారని కొంతమంది విమర్శలు చేస్తున్నారని, కానీ అది అవాస్తవమని అన్నారు. భద్రాచలంలో అభివృద్ధికి కావాల్సినంత స్థలం లేకపోవడంతోనే పనులను అలస్యమవుతున్నాయని వివరించారు.

భద్రాచలం అభివృద్ధికి మంత్రి అజయ్‌కుమార్‌ ప్రత్యేక చొరవ చూపుతున్నారని, అందులో భాగంగానే భద్రాచలాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికను చేపట్టినట్లు తెలిపారు. ప్రధానంగా భద్రాచలంలో చెక్‌పోస్టు వద్ద నుంచి అంబేద్కర్‌ సెంటర్‌ వరకు, అక్కడి నుంచి చర్ల రోడ్డులోని కేకే ఫంక్షన్‌ హాల్‌ వరకు, కూనవరం రోడ్డులోని సీఆర్‌పీఎఫ్‌ క్యాంపు వరకు సెంట్రల్‌ లైటింగ్‌ను, పచ్చటి మొక్కలతో సుమారు రూ.50 లక్షల నిధులతో చేపట్టడానికి మంత్రి ఆదేశాల మేరకు నివేదికను సిద్ధం చేయాలని పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. భద్రాచలానికి సమస్యగా మారిన డంపింగ్‌ యార్డు కోసం కూనవరం రోడ్డులో కరకట్ట కోసం ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించిన ఆరు ఎకరాల భూమిలో ఒక ఎకరం పరిశీలన చేసినట్లు తెలిపారు. ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో నిర్మాణం జరుగుతున్న ప్రకృతి వనంలోనే పట్టణ ప్రజల కోసం పిల్లల కోసం పార్క్‌, వాకింగ్‌ ట్రాక్‌, విడివిడిగా టాయ్‌లెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రజల వ్యాయామం కోసం ఓపెన్‌ జిమ్‌ ఏర్పాటుకు నివేదికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతు వేదికతో పాటు అన్ని అభివృద్ధి పనులను మాసాంతం లోపు పూర్తి చేసి, మంత్రి అజయ్‌కుమార్‌తో ప్రారంభించడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిపారు.

అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష

కాగా భద్రాచలంలో చేపడుతున్న అభివృద్ధి పనులపై భద్రాచలం తహసీల్దార్‌ ఎస్‌.శ్రీనివాస్‌ యాదవ్‌, పంచాయతీ ఈవో గాదె ప్రసాద రెడ్డి, పంచాయితీ రాజ్‌, ఆర్‌డబ్యూఎస్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఇంజినీరింగ్‌ అధికారులతో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కోరం కనకయ్య సమీక్షా సమావేశం నిర్వహించారు. డబుల్‌ బెడ్రూంలపై కాంట్రాక్టర్‌లతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరిస్తానని, నవంబర్‌ మొదటి వారంలోపు డివిజన్‌లోని అన్ని ఇండ్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్‌ భద్రాచలం నియోజకవర్గ ఇంచార్జ్‌ డా. తెల్లం వెంకట్రావ్‌, దుమ్ముగూడెం మండల అధ్యక్షుడు అన్నెం సత్యాలు, చర్ల మార్కెట్‌ కమిటీ అధ్యక్షులు బోదెబోయిన బుచ్చయ్య, నాయకులు యశోద రాంబాబు, ఎల్‌ వెంకటేశ్వర్లు, అరికెల తిరుపతిరావు, రత్నం రమాకాంత్‌, ముంతాజ్‌, మామిడి పుల్లారావు, చర్ల, దుమ్మగూడెం మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణ సీఐ టి.స్వామి బందోబస్తును పర్యవేక్షించారు.