మంగళవారం 24 నవంబర్ 2020
Badradri-kothagudem - Oct 24, 2020 , 01:42:53

జమలాపురం ఆలయ అభివృద్ధికి కృషి

జమలాపురం ఆలయ అభివృద్ధికి కృషి

  • జమలాపురం వెంకన్న ఆలయంలో మంత్రి పువ్వాడ పూజలు

 ఎర్రుపాలెం : తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధ్దికి కృషిచేస్తానని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం మంత్రి పువ్వాడ  రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, జడ్పీచైర్మన్‌ లింగాల కమల్‌రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాతా మధు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావుతో కలిసి జమలాపురం వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి హోదాలో తొలిసారి ఆలయానికి వచ్చిన మంత్రికి అధికారులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. ప్రధాన అర్చకుడు శ్రీనివాసశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి తీర్థప్రసాదాలతో పాటు, శేషవస్ర్తాలు అందజేశారు.

అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. జమలాపురం వరకు ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్డు నిర్మాణానికి రూ.1.60 కోట్లు,  జమలాపురం నుంచి రాజుపాలెం రాష్ట్ర సరిహద్దు వరకు ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్డు నిర్మాణానికి రూ.1.60 కోట్లు మొత్తం రూ.3.20 కోట్లను తక్షణమే మంజూరు చేయించి రోడ్డు నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలుస్తానని చెప్పారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో కొత్త పనులు చేపట్టడం ఆలస్యమైందని, కొవిడ్‌ అనంతరం దైవస్థానం వరకు డబుల్‌రోడ్డు నిర్మాణ పనులు చేపడతామన్నారు.  దేవస్థానానికి భక్తుల సౌకర్యార్థం బస్సులు నడపాలని స్థానిక ప్రజాప్రతినిధులు కోరగా సానుకూలంగా స్పందించిన మంత్రి ఖమ్మం నుంచి నేరుగా దైవస్థానానికి బస్సులు నడిపేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. తొలుత మంత్రికి టీఆర్‌ఎస్‌  ఆధ్వర్యంలో  నాయకులు మీనవోలు వరకు వెళ్లి మేళతాళాలతో పూలవర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు. అనంతరం ర్యాలీగా ఆలయం వద్దకు చేరుకున్నారు.

ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్‌ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, టీఆర్‌ఎస్‌  ఫౌండర్‌ మెంబర్‌ బొమ్మెర రామ్మూర్తి, ఆలయ ఈవో జగన్మోహన్‌రావు, సర్పంచ్‌ మూల్పూరి స్వప్న, ఎంపీపీ దేవరకొండ శిరీష, జడ్పీటీసీ శీలం కవిత, తహసీల్దార్‌ జగదీశ్వరప్రసాద్‌, ఎంపీడీవో రామకృష్ణ, ఎంపీటీసీ మూల్పూరి శైలజ, సొసైటీ అధ్యక్షుడు మూల్పూరి శ్రీనివాసరావు, సర్పంచ్‌ మొగిలి అప్పారావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షడు శేగిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, మండల రైతుబంధు సమితి కో-ఆర్డినేటర్‌ శీలం వెంకట్రామిరెడ్డి, రైతుసమితి జిల్లా సభ్యురాలు వేమిరెడ్డి త్రివేణి, టీఆర్‌ఎస్‌ మండల మహిళా అధ్యక్షురాలు శీలం ఉమామహేశ్వరరెడ్డి, ముఖ్యనాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అర్చకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.