మంగళవారం 01 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Oct 22, 2020 , 02:27:16

దీవించమ్మా.. ‘ధాన్యలక్ష్మి’

దీవించమ్మా.. ‘ధాన్యలక్ష్మి’

  • నేడు విజయలక్ష్మి అలంకరణ 

భద్రాచలం : ‘ధన ధాన్య కరీం.. సిద్ధిం అంటూ’ పురాణం కీర్తిస్తుందని, అన్ని రకాల ధాన్యాన్ని ప్రసాదించేది ఈ అమ్మే. ఈ అమ్మను ఆరాధిస్తే ఈతి బాధలన్నీ తొలగి, సమయానికి తగిన వానలు కురిసి దేశం సస్యశ్యామలంగా, సుభిక్షంగా ఉంటుందని వేదపండితులు వివరిస్తుండగా, ‘నమోనమామి..’ అంటూ భక్తులు భక్తపారవశ్యంలో మునిగి తేలారు. భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ‘ధాన్యలక్ష్మి’ అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ ఉత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో మూలవరులకు పంచామృతాలతో అభిషేకం చేశారు.

అనంతరం రామాలయ ప్రాంగణంలోని శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఉపాలయంలో ధాన్యలక్ష్మిగా అలంకరించి అమ్మవారిని కొలువుదీర్చారు. వేద పండితులు శ్రీ రామాయణ పారాయణోత్సవము, కిష్కింధకాండ పారాయణ హవనం చేశారు. మధ్యాహ్నం అమ్మవారికి సామూహిక కుంకుమార్చన జరిపారు. సాయంత్రం మంత్రపుష్ప పూజ, దర్బారు సేవలను నిర్వహించారు. శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అమ్మవారికి జరిగిన సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు. బేడా మండపంలో స్వామి వారికి నిత్యం నిర్వహించే నిత్యకల్యాణాన్ని ఆలయ అర్చకులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. నేడు అమ్మవారు విజయలక్ష్మిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.