ఆదివారం 29 నవంబర్ 2020
Badradri-kothagudem - Oct 21, 2020 , 03:20:09

దసరా పండుగకు ప్రత్యేక బస్సులు

దసరా పండుగకు ప్రత్యేక బస్సులు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : దసరా పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, ఇతర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడపడానికి హైదరాబాద్‌ నగరంలోని వివిధ పాయింట్లను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పాటు చేసింది. ఈ నెల 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ప్రత్యేకంగా 2034 బస్సులను నడుపనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 22న 657 బస్సులు, 23న 659 బస్సులు, 24న 614 బస్సులను పండుగ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం అదనంగా నడుపనున్నట్టు తెలిపారు. ఈ బస్సులే కాకుండా ప్రయాణికుల రద్దీని బట్టి వెంటనే అదనపు బస్సులను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే, ఈ నెల 22 నుంచి 24వ తేదీలలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు బస్సులను అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ (www.tsrtconline.in) సౌకర్యంతో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రయాణికులు సుఖవంతంగా ప్రయాణం చేయాలని ఆర్టీసీ అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.

ఇప్పటికే మూడు వేల అదనపు బస్సులు

ఇప్పటికే ఈ నెల 15వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్‌ ఆర్టీసీ, హైదరాబాద్‌ నుంచి పొరుగు రాష్ర్టాలలోని వివిధ ప్రాంతాలకు 3000 అదనపు బస్సులను నడపడానికి ప్రణాళిక రూపొందించింది. మహాత్మా గాంధీ బస్‌ స్టేషన్‌, జూబ్లీ బస్‌ స్టేషన్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కేపీహెచ్‌బీ, ఎస్సార్‌నగర్‌, అమీర్‌పేట, టెలిఫోన్‌ భవన్‌, ఈసీఐఎల్‌, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్స్‌, ఎల్బీనగర్‌లతో పాటు జంట నగరాలలోని వివిధ శివారు కాలనీలలో నివసించే వారికి ప్రధానమైన పాయింట్ల నుంచి, టికెట్‌ బుకింగ్‌ ఏజెంట్ల వద్ద నుంచి కూడా ప్రత్యేక బస్సులను నడపడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్లాట్‌ఫామ్‌ 10 నుంచి 13 వరకూ ఖమ్మం వైపు వెళ్లే బస్సులు, స్పెషల్‌ బస్సులు ఉంటాయి. వివరాలకు ఖమ్మం సెక్టార్‌ ఆర్‌ఎం నంబర్‌ 9959225953ను సంప్రదించొచ్చు. టికెట్లు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవడానికి సంప్రదించాల్సిన వెబ్‌సైట్‌ www.tsrtconline.in, ఇది ప్రయాణికుల సౌకర్యార్థం నిత్యం అందుబాటులో ఉంటుంది.