శుక్రవారం 27 నవంబర్ 2020
Badradri-kothagudem - Oct 21, 2020 , 03:20:13

ధరణితో సేవలు సులభతరం

ధరణితో సేవలు సులభతరం

కొత్తగూడెం : ధరణి పోర్టల్‌తో ప్రజా సేవ సులభతరం కానుందని, ధరణి సేవలు నిర్వహణలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా డెమో సాఫ్ట్‌వేర్‌పై బాగా ప్రాక్టీస్‌ చేయాలని గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌, ధరణి ప్రత్యేక అధికారి క్రిస్టినా జడ్‌ చోంగ్తూ అన్నారు. ధరణి సేవలు నిర్వహణకు జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమితులైన ఆమె మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో రెవెన్యూ, ఐటీడీఏ, అదనపు కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించి ధరణి పోర్టల్‌ నిర్వహణపై సన్నద్ధతను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... సమస్యలు లేకుండా ధరణి కార్యక్రమం నిర్విరామంగా నిర్వహించేందుకు ప్రతిరోజు తహసీల్దార్లు డెమో సాఫ్ట్‌వేర్‌ ద్వారా ప్రాక్టీస్‌ చేసి వచ్చిన సమస్యలపై ఉదయం, సాయంత్రం నివేదికలు అందజేయాలన్నారు. మారుమూల ప్రాంతమైన జిల్లాలో ప్రభుత్వ ఆదేశాలు మేరకు త్వరగా ఏర్పాట్లు చేయడం పట్ల జిల్లా కలెక్టర్‌ను అభినందించారు. జిల్లాలో కొత్తగూడెం డివిజన్‌లో 159, భద్రాచలం డివిజన్‌లో 218 మొత్తం 377 గ్రామాల్లో 1,50,430 ధరణి ఖాతాలున్నాయని, వాటిలో 1,18,103 ఎకరాల వ్యవసాయ భూముల ఖాతాలున్నాయని చెప్పారు. జిల్లాలోని 23 మండలాల్లో 67 కంప్యూటర్లు, 23 సానర్లు, 38 ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్లు, 23 ఐరీస్‌ స్కానర్లు, 23 పీపీబీ ప్రింటర్లు, 23 ఓవర్‌హెడ్‌ స్కానర్లు, 23 వెబ్‌ కెమెరాలు అందుబాటులో ఉంచామన్నారు. 23 స్వాన్‌ నెట్‌ సేవలు, 15 ఇంటర్నెట్‌ సేవలతో పాటు 8 చోట్ల డాంగిల్స్‌ సిద్ధం చేశామన్నారు. ఈ నెల 18వ తేదీన ప్రతి తహసీల్దార్‌ 10 మాడ్యూల్స్‌ ద్వారా ప్రాక్టీస్‌ చేశారని, జిల్లాలో ఇప్పటి వరకు డెమో సాఫ్ట్‌వేర్‌ ద్వారా 349 స్లాట్స్‌ బుక్‌ చేసి 311 మాడ్యూల్స్‌ విజయవంతంగా పూర్తి చేశారని, 25వ తేదీన ప్రారంభించనున్న ధరణి పోర్టల్‌ నిర్వహణలో జిల్లాలో చేసిన ఏర్పాట్లు పరిశీలనకు వచ్చానని అన్నారు. ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నట్లు ఆమె చెప్పారు. రిజిస్ట్రేషన్‌ సేవలు సులభతరం కావాలన్న లక్ష్యంతో ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం ధరణి పోర్టల్‌ సేవలను అందుబాటులోకి తేనుందన్నారు. జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో ధరణి సేవలు నిరంతరాయంగా నిర్వహించేందుకు తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు చెప్పారు. కలెక్టరేట్‌లో డీఆర్‌వో అశోక్‌చక్రవర్తి, ఇంచార్జి ఏవో గన్యా, తహసీల్దార్‌ శివయ్య, భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ పరిపాలన అధికారి రాజేంద్రప్రసాద్‌లను పర్యవేక్షణ అధికారులుగా నియమించామన్నారు. ధరణి జిల్లా సమన్వయ కర్తగా జి.వెంకటేశ్వర్లును, ప్రత్యామ్నాయంగా మహేష్‌, నరేష్‌లను నియమించినట్లు చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు ట్రయల్స్‌ నిర్వహిస్తున్నామని, వాటి ఫలితాలను బట్టి సమగ్ర నివేదికలు తీసుకోనున్నట్లు ఆయన వివరించారు. ప్రతీ రోజు దాదాపు 110 వరకు ప్రాక్టీస్‌ చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఈ సమీక్షలో ఐటీడీఏ పీవో పోట్రు గౌతం, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, అనుదీప్‌, డీఆర్‌వో అశోక చక్రవర్తి, ఆర్డీవో స్వర్ణలత, కలెక్టరేట్‌ వివిధ సెక్షన్లు పర్యవేక్షకులు గన్యా, రంగాప్రసాద్‌, ఈడీఎం విజయసారథి తదితరులు పాల్గొన్నారు.

సేవలు మరింత సులువు..

కూసుమంచి : ధరిణి పోర్టల్‌ ద్వారా ప్రజాసేవ మరింత సులువు అవుతుందని, ముఖ్యంగా రైతుల పనులు త్వరగా పూర్తవుతాయని గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌ డాక్టర్‌ క్రిస్టినా జెడ్‌ చోంగ్తూ అన్నారు. కూసుమంచి తహసీల్దార్‌ కార్యాలయాన్ని మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు విషయాలను తహసీల్దార్‌ శిరీష ద్వారా అడిగి తెలుసుకున్నారు. ధరణి పోర్టల్‌ విధానం పనితీరును పూర్తిగా పరిశీలించారు. ఒక డమ్మి రిజిస్ట్రేషన్‌ను దగ్గరుండి తహసీల్దార్‌ శిరీష ద్వారా చేయించారు. కూసుమంచిలో డమ్మి రిజిస్ట్రేషన్‌ సమయంలో సర్వర్‌ బిజీగా రావటంతో కొంత సేపు పని జరగలేదు. దీనిపై కమిషనర్‌కు కలెక్టర్‌ ఆర్‌వీ.కర్ణన్‌ వివరణ ఇచ్చారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ గౌతం, అస్టెంట్‌ కలెక్టర్‌ వరుణ్‌ రెడ్డి, గిరిజన సంక్షేమశాఖాధికారి ప్రియాంక, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.