బుధవారం 02 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Oct 20, 2020 , 03:00:34

అంతరాయం లేకుండా సేవలందించాలి

 అంతరాయం లేకుండా సేవలందించాలి

  • 25న ‘ధరణి’ ఆన్‌లైన్‌ సేవల ప్రారంభానికి ఏర్పాట్లు
  • అధికారులు, సర్వీస్‌ ప్రొవైడర్ల సమావేశంలో భద్రాద్రి కలెక్టర్‌

కొత్తగూడెం: ఈ నెల 25 నుంచి ధరణి వెబ్‌సైట్‌ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ చేపట్టనున్నందున అంతరాయం లేకుండా ఇంటర్నెట్‌ సేవలు సేవలు అందించాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి సూచించారు. నిరంతరాయ అంతర్జాల సేవలపై సోమవారం కలెక్టర్‌ తన చాంబర్‌లో రిజిస్ట్రేషన్‌, రెవెన్యూ, సర్వీస్‌ ప్రొవైడర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సిగ్నల్స్‌ సమస్య లేకుండా ముందస్తుగా పరిశీలించి వైర్లు సరిచేయాలని సూచించారు. సిగ్నల్స్‌లో అంతరాయం వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఏదైనా కారణాల వల్ల సిగ్నల్స్‌ ఇవ్వడంలో ఇబ్బందులు వస్తే ముందుగా తెలియజేయాలని ఆదేశించారు. 

భూములు రిజిస్ట్రేషన్‌ కోసం స్లాట్‌ బుక్‌ చేసుకున్న ప్రజలు ఇంటర్నెట్‌ సేవల సమస్య వల్ల ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిరంతరాయం సేవలు ఇవ్వాలని సూచించారు. వాహనాలు తగిలి సర్వీస్‌ వైర్లు తెగిపోకుండా ఎత్తుగా ఏర్పాటు చేయాలన్నారు.  విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని ఎస్‌ఈకి సూచించారు.  ఆళ్లపల్లి, గుండాల, కరకగూడెం, పినపాక మండలాల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు అందుబాటులో లేవని, అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, డీఆర్‌వో అశోక చక్రవర్తి, విద్యుత్‌ ఎస్‌ఈ సురేందర్‌, ఈడీఎం విజయసారథి, బీఎస్‌ఎన్‌ఎల్‌ డీఈ సక్రు, ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు పాల్గొన్నారు.