శుక్రవారం 23 అక్టోబర్ 2020
Badradri-kothagudem - Oct 18, 2020 , 03:53:26

రైతాంగానికి అండగా ప్రభుత్వం

రైతాంగానికి అండగా ప్రభుత్వం

  • మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌  
  • ఎర్రగుంటపాడు, అడసర్లపాడు గ్రామాల్లో పర్యటన 

సత్తుపల్లి : వాయుగుండం కారణంగా జిల్లాలో పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. శనివారం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి మండలంలోని బేతుపల్లి చెరువు కాలువ గండి, చింతలచెరువు అలుగు గండిని మంత్రి పరిశీలించి మరమ్మతులు చేయాలని ఇరిగేషన్‌ శాఖ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో ప్రాథమిక అంచనా మేరకు సుమారు 10 కాలువలకు గండ్లు పడినట్లు నిర్ధారించామన్నారు. బేతుపల్లి చెరువు కాలువ, రామానగరం, తుంబూరు నల్లకాలువ, నారాయణపురం తుంబూరు ఫీడర్‌ ఛానల్‌ దెబ్బతిన్నాయని, గండ్లు పడిన కాలువలకు తాత్కాలిక మరమ్మతులు సత్వరమే చేపట్టి నష్టం అంచనాలను సిద్ధం చేయాలని ఇరిగేషన్‌శాఖ అధికారులను ఆదేశించారు. సత్తుపల్లి డివిజన్‌లో 20వేల ఎకరాల్లో వరిపంట నీట మునిగిందని, దీంతో 14,338 మంది రైతుల పంటలు మునిగాయని, 4,880 మంది రైతుల 5,356 పత్తి పంట నీటమునిగిందని ప్రాథమికంగా నిర్ధారించామన్నారు.

వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతి పంట నష్టాన్ని సర్వేచేసి నష్టం అంచనాలను సమగ్రంగా నివేదిక అందించాలని సూచించారు. సత్తుపల్లి మండలంలో 71 మంది రైతుల పొలాల్లో వరిపొలంలో నీరు చేరడం వల్ల సుమారు 120 ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు అంచనాకు వచ్చినట్లు తెలిపారు. అనంతరం గంగారంలో పల్లెప్రకృతి వనాన్ని మంత్రి అజయ్‌కుమార్‌ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల శేషగిరిరావు, ఆర్డీవో సూర్యనారాయణ, జిల్లా వ్యవసాయశాఖాధికారి విజయనిర్మల, నీటిపారుదలశాఖ జిల్లా అధికారి నర్సింహారావు, డీఈఈ మరియన్న, ఏఈ వెంకటేశ్వర్లు, ఏడీఏ నర్సింహారావు, ఏవో శ్రీనివాసరావు, మున్సిపల్‌ కమిషనర్‌ సుజాత, తహసీల్దార్‌ మీనన్‌, రైతుబంధు కన్వీనర్‌ గాదె సత్యం, డీసీసీబీ డైరెక్టర్‌ చల్లగుళ్ల కృష్ణయ్య, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు యాగంటి శ్రీనివాసరావు, ఎంపీడీవో సుభాషిణి, ఎంపీపీ దొడ్డా హైమావతి శంకర్‌రావు, మున్సిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేశ్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ తోట సుజలారాణి, ఆత్మాచైర్మన్‌ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు ఉన్నారు.


logo