శనివారం 05 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Oct 18, 2020 , 03:53:26

అధైర్యపడకండి.. ఆదుకుంటాం

అధైర్యపడకండి.. ఆదుకుంటాం

  • పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
  • సత్తుపల్లి డివిజన్‌లో 20వేల ఎకరాల్లో పంట మునక
  • గండ్లు పడిన కాలువలకు సత్వరం మరమ్మతులు చేపట్టాలి
  • రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌
  • సత్తుపల్లి, వేంసూరు మండలాల్లో ఎమ్మెల్యే సండ్రతో కలిసి పర్యటన
  • గండ్లు పడిన కాలువలు, నష్టపోయిన పంటల పరిశీలన

వేంసూరు: వర్షాల కారణంగా ఎంత నష్టం వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలుస్తుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి మంత్రి అజయ్‌కుమార్‌ శనివారం వేంసూరు మండలంలో పర్యటించారు. మండల పరిధి ఎర్రగుంటపాడు గ్రామంలో ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త చింతల వసంతానికి పార్టీ సభ్యత్వం ద్వారా బీమా సౌకర్యం ఉండటంతో రూ.2లక్షల బీమా చెక్కును కుటుంబసభ్యులకు అందజేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. పంట నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దన్నారు. దెబ్బతిన్న రోడ్లు, గండ్లు పడిన కాల్వల మరమ్మతులకు అంచనాలు వేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న పంటలను ఏఈవోలు క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్ర సర్వే నిర్వహించి నివేదికలు సమర్పించాలన్నారు. అనంతరం అడసర్లపాడు వద్ద కట్టలేరు ప్రవహం వల్ల దెబ్బతిన్న లోలెవల్‌ కాజ్‌వేను మంత్రి పరిశీలించి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఎల్లప్పుడూ కార్యకర్తలకు అండగా నిలుస్తుందని, పార్టీ సభ్యత్వం కలిగిన ప్రతి ఒక్కరికి బీమా సౌకర్యం కల్పిస్తుందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు.

రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది : ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య

వర్షాల కారణంగా నియోజకవర్గ స్థాయిలో రైతు లు సాగుచేసిన పంటలకు భారీగా నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం అన్ని విధాలా రైతులను ఆదుకుంటుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. నియోజకవర్గస్థాయిలో 25వేల ఎకరాలకు పైగా చేతికొచ్చిన పంట పూర్తిగా దెబ్బతిన్నదని, ఎన్టీఆర్‌ కెనాల్‌ కాలువ కింద పలు మండలాల్లో గండ్లు పడ్డాయని, వాటికి మరమ్మతులు చేయాలని మంత్రి ఆదేశాలు ఇచ్చారని ఎమ్మెల్యే సండ్ర తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఈఈ హేమలత, డీఈ శంకర్‌రావు, ఏడీఏ నర్సింహారావు, ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ మారోజు సుమలత, వైస్‌ ఎంపీపీ దొడ్డా శ్రీలక్ష్మి,  రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ వెల్ది జగన్మోహన్‌రావు, డీసీసీబీ డైరెక్టర్‌ గొర్ల సంజీవరెడ్డి, సీడీసీ డైరెక్టర్‌ పీ శంకర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు పాలా వెంకటరెడ్డి, కంటె వెంకటేశ్వరరావు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు, నాయకులు పాల్గొన్నారు.