ఆదివారం 29 నవంబర్ 2020
Badradri-kothagudem - Oct 18, 2020 , 03:53:26

అభయ హస్త వాసిని.. ఆదిలక్ష్మి

అభయ హస్త వాసిని.. ఆదిలక్ష్మి

  • భద్రాద్రి రామాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
  • తొలిరోజు ఆదిలక్ష్మి అలంకరణలో దర్శనం
  • మహిళల సామూహిక కుంకుమార్చన
  • నేడు సంతాన లక్ష్మి అలంకారంలో దర్శనం

భద్రాచలం: చుతుఃభుజాలతో పై రెండు చేతుల్లో పద్మాలను ధరించి ‘వరద-అభయ హస్తాలతో’ విరాజిల్లుతున్న ఆదిలక్ష్మి.. పాహిమాం.. పాహి మాం. అంటూ భక్తులు వేనోళ్ల కీర్తిస్తూ తరించారు. విజయదశమిని పురష్కరించుకొని ప్రతి యేటా రామాలయంలో ఆనవాయతీగా నిర్వహించే ‘దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు’ శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారు ‘ఆదిలక్ష్మి’ అలంకరణలో దర్శనమిచ్చారు. 

సామూహిక కుంకుమార్చన 

తొలి రోజు వేడుకల్లో భాగంగా లక్ష్మీతాయారు ఆలయంలో  అమ్మవారికి అభిషేకం జరిపారు. అనంతరం రామాలయ ప్రాంగణంలోని ఉపాలయంలో ప్రత్యేకం ఆసనంపై వేంచేసిన ఆదిలక్ష్మి అలంకరణలో అమ్మవారు అభయమిచ్చారు. వేద పండితులు శ్రీరామాయణ పారాయణోత్సవం,  బాలకాండ పారాయణ హవనం చేశారు. బేడా మండపంలో సామూహిక కుంకుమార్చన జరిపారు. సాయంత్రం మంత్రపుష్ప పూజ, దర్బారు సేవలు నిర్వహించారు. కొవిడ్‌-19 కారణంగా తిరు  వీధి సేవలను రద్దు చేశారు. చిత్రానక్షత్రం సందర్భంగా ఆలయం ప్రాంగణంలోని యాగశాలలో ‘సుదర్శన హోమం’ జరిపారు. బేడా మండపంలో అర్చకులు రామయ్యకు శాస్ర్తోక్తం గా నిత్యకల్యాణం నిర్వహించారు. భక్తులు స్వామిని, అమ్మవారిని దర్శించుకొని తన్మయులయ్యారు. పూజల్లో దేవస్థాన ఈవో బీ శివాజీ పాల్గొన్నారు. కార్యక్రమాల్లో అర్చకులు, వేదపండితులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. 

నేటి సంతానలక్ష్మి  అలంకార విశిష్టత 

‘అఖిల జగన్మాతరం, అస్మన్మాతరం..’ అంటూ ప్రార్థిస్తారు భగవద్‌ రామానుజులు. సకల చరాచర జగత్తు అంతా ఆ అమ్మ సంతానమే. అందుకే ఆమెకు సంతాన లక్ష్మి అని పేరు. ఈ రూపంలో ఉన్న అమ్మను ఆరాధిస్తే సంతానానికి సంబంధించిన అవరోధాలన్నీ తొలగి సత్సంతానం, సుఖశాంతులు కలుగుతాయని శాస్త్రం. మన అందరి అభీష్టాలను నెరవేర్చడానికి నేడు సంతాన లక్ష్మి అలంకారంలో దర్శనమివ్వనున్నారు లక్ష్మీతాయారు అమ్మవారు. దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని అర్చకులు కోరారు.