శనివారం 05 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Oct 16, 2020 , 00:37:57

తల్లీ రావె..బతుకమ్మ

తల్లీ రావె..బతుకమ్మ

  • నేటి నుంచి పుడమిపై పూల జాతర
  • గౌరమ్మ వచ్చె.. సంతోషాలు తెచ్చె..
  • పల్లెల్లో ఇక సంబురాలు షురూ..
  • 24న సద్దుల బతుకమ్మతో సమాప్తం
  • తొమ్మిది రోజుల పాటు జగన్మాత ఉత్సవాలు

ఇంటిల్లిపాది ఎదురుచూస్తున్న బతుకమ్మ రానేవచ్చింది. ఇది స్త్రీతత్వాన్ని ఆరాధించేపండుగ.. అమ్మను గౌరవించుకునే పండుగ.. కేవలం  బొడ్డెమ్మల పండగే కాదు.. తీరొక్క పువ్వులు తెచ్చేది, పేర్చేది, మోసేది, అమ్మను సంతోషపెట్టేది మగపిల్లలే అయినప్పుడు.. ఇదీ అందరి పండుగ.. అందరికీ పండుగే. తంగేడు పూలతో.. జానపదాల మాలతో.. అమ్మను ఆరాధించే పండుగ వచ్చేసింది. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పలారం, చీరె, సారెల సందడితో.. సాయంకాలం మొదలు అర్ధరాత్రి వరకూ ఆడబిడ్డలు ఆడి, పాడుకునే పండుగ మన బతుకమ్మ. ‘ఓ తల్లీ రావే బతుకమ్మ.. మము దీవించి సల్లంగ కాపాడే బతుకమ్మా.. తరలిరావమ్మా..!’

-ఖమ్మం కల్చరల్‌/ ఇల్లెందు రూరల్‌/ కొత్తగూడెం టౌన్‌

ఖమ్మం కల్చరల్‌/ ఇల్లెందు రూరల్‌/ కొత్తగూడెం టౌన్‌: ప్రపంచంలోనే అరుదైన పూలపండుగ శుక్రవారం నుంచి ఇంటిం టా సందడి చేయనుంది. ‘ఇంతి’ంతై విశ్వవాప్తమై సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్న బతుకమ్మ ఆగమనంతో ఇంటిల్లిపాదికీ సంబురమే. ప్రకృతి వరప్రసాదమైన ఈ పూల పండుగలో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు భక్తిశ్రద్ధలతో మమేకమవుతారు. తొమ్మిది రోజులు జగన్మాత స్వరూపులైన మహాగౌరి, మహాలక్ష్మి, మహాసరస్వతి సహా వివిధ అవతారాలను విభిన్న రీతుల్లో పూజిస్తారు. శతాబ్దాల తరబడి జరుపుకొంటున్న ఈ పండుగ తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక కొత్త సొబగు సంతరించుకుంది. రాష్ట్రం సిద్ధించిన నాటి నుంచి బతుకమ్మను అధికారిక పండుగగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అశ్వయుజ శుద్ధపాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజులపాటు బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా జరుపుకుంటారు. 

బతుకమ్మ విశిష్టత

హైందవ సంప్రదాయంలో కల్యాణం, గృహప్రవేశం, వినాయకచవితి, దీపావళి, వ్రతాలు నిర్వహించేటప్పుడు పసుపుతో గౌరీమాతను తయారు చేసి పూజిస్తారు. బతుకమ్మను పేర్చేటప్పుడు సైతం గౌరీమాతను తయారు చేసి పెడతారు. బతికించి, కోరికలు తీర్చే అమ్మగా గౌరీమాతను బతుకమ్మగా మహిళలు పూజిస్తారు. పెళ్లి వయసు గల యువతులు మంచి భర్త రావాలని, వివాహమైన స్త్రీలు తన భర్త వందేళ్లు ఆయురారోగ్యాలు బాగుండాలని, తన పసుపు కుంకుమలు కాపాడాలని బతుకమ్మను పూజించడం ఈ పండుగ విశిష్టత.

బతుకమ్మ ఆవిర్భావంపై కథనాలు

బతుకమ్మ పుట్టపై గ్రామీణులు పాడుకునే పాటల్లో పలు అంశాలతో పాటు చారిత్రక నేపథ్యం గల కథలూ ఉన్నాయి. క్రీస్తుశకం 300 ఏళ్ల కాలంలో దక్షిణ భారతదేశాన్ని చాళక్యులు పరిపాలించేవారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వీరి వంశస్థుడైన ధర్మంగధుడు అనే రాజుకు సంతానం లేదు. చాలా ఏళ్ల తరువాత జన్మించిన ఏకైక కుమార్తెకు లక్ష్మి అని పేరు పెట్టాడు. ఆమె అనేక రోగాలతో బాధపడుతూ గండాలను ఎదుర్కొంటుంది. శక్తిస్వరూపిణి అయిన గౌరీదేవిని ప్రకృతిలో సహజంగా లభించే పూలతో పూజించాలని ఆస్థాన పండితులు చెబుతారు. 

ఆటాపాట.. అలంకరణే అందం..

బతుకమ్మ పండుగలో ఆటపాటలు ప్రత్యేకం. అలంకరణల్లో ప్రత్యేకత కనిపిస్తుంది. బతుకమ్మను పేర్చేటప్పుడు రెండు, ఐదు, ఏడు రకాల పూలు వాడుతారు. ఊరేగింపుగా నిమజ్జనానికి తీసుకెళ్తారు. చెరువులో నిమజ్జనం చేసి వివిధ రకాలైన పిండివంటలను ఆరగిస్తారు. చెరువు మట్టిని తెచ్చి ముత్తయిదువులు వాయినాలు ఇచ్చుకుంటారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈనెల16న పెత్తరమావాస్య నుంచి మొదలయ్యే ఈ వేడుకలు 24 వరకు  జరుగనున్నాయి. ఈ ఏడాది ఓవైపు కొవిడ్‌ వ్యాప్తి, మరోవైపు వర్షాలు ఉండటంతో బతుకమ్మ వేడుకలు పెద్ద ఎత్తున జరిగే అవకాశం లేదు. 

రెండో రోజు అటుకుల బతుకమ్మలో సప్పడి పప్పు, బెల్లం, అటుకుల ప్రసాదం వినియోగిస్తారు. మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మలో ముద్దపప్పు, బెల్లం, పాలతో ప్రసాదం వినియోగిస్తారు. నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మలో పాలు, బెల్లం, నానేసిన బియ్యంతో ప్రసాదం వినియోగిస్తారు. ఐదో రోజున అట్ల బతుకమ్మను బియ్యం నానబెట్టి దంచిన  పిండితో తయారుచేసిన అట్ల (దోశ లు) ప్రసాదం వినియోగిస్తారు. ఆరో రోజున అలిగిన బతుకమ్మలో బతుకమ్మ అలిగినట్లుగా భావించి ఆరోజు బతుకమ్మలు పేర్చరు. ఆడరు. ఏడో రోజున వేపకాయల బతుకమ్మలో సకినాలు చేసే పిండితో వేప కాయలంత పరిమాణంలో ముద్దలుగా చేసి నూనెలో వేయించిన వంటకం ప్రసాదంగా వినియోగిస్తారు. ఎనిమిదో రోజున వెన్నముద్దల బతుకమ్మలో నువ్వు లు, వెన్న, బెల్లం, నెయ్యితో తయారుచేసిన పలహారం వినియోగిస్తారు. తొమ్మిదో రోజున సద్దుల బతుకమ్మలో ఐదు రకాల సద్దుల అయిన పలహారం. పెరుగన్నం, చింతపండు పులిహోర, సద్ది, కొబ్బరి తురుము, నువ్వుల పొడి కలిపిన సద్ది పలహారం వివినియోగిస్తారు. ఇలా తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఆడిపాడిన మహిళలు సద్దుల బతుకమ్మ రోజున అంగరంగ వైభవంగా బతుకమ్మల సామూహిక నిమజ్జనోత్సవాన్ని జరిపి సాదరంగా సాగనంపుతారు.

బతుకునిచ్చే బతుకమ్మ... 

భూస్వాముల ఆకృత్యాలను భరించలేక ఒక బాలిక ఆత్మహత్య చేసుకుంటే, ఆమెను ఆ ఊరి ప్రజలు చిరకాలం ‘బతుకమ్మా’ అంటూ దీవించారట. చోళ వంశానికి చెందిన ధర్మాంగధుడు, సత్యవతి అనే రాజ దంపతులకు చాలా కాలం పాటు సంతానం కలగలేదు. వారు చేసిన నోములతో వంద మంది కొడుకులు పుట్టినా, వారంతా యుద్ధంలో చనిపోతారు. దీంతో విషాదాన్ని తట్టుకోలేక రాజు దంపతులు అడవికి వెళ్లి చేసిన తపస్సు చేస్తారు. ఈ తపస్సుకు  ప్రత్యక్షమైన లక్ష్మీదేవి వారి బిడ్డగా పుడతానని వరమిస్తుంది. ఈ మేరకు పుట్టిన బిడ్డ కలకాలం బతకాలని రుషులు ‘బతుకమ్మ’ అని నామకరణం చేస్తారు. అప్పటి నుంచి చోళ రాజ్యంలో ‘బతుకమ్మ’ సంక్షేమం కోసం పండుగ చేసుకోవడం ఆనవాయితీగా మారిందని, ‘బతుకమ్మ’ అనే దీవెనే బతుకమ్మగా వెలుగొందిందని పురాణ గాథ. ..

ఆడబిడ్డగా..  లక్ష్మీదేవిగా..

పూర్వం ఒక ఊరిలో పేద కుటుంబంలో ఏడుతరాల తరువాత లక్ష్మీదేవి కటాక్షంతో ఆడబిడ్డ పు డుతుంది. దీంతో ఆ కుటుంబం కాలక్రమేణా ఐశ్వర్యంతో ధనిక కుటుంబం అవుతుంది. పెళ్లి వయసు వచ్చిన ఆడబిడ్డకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపుతారు. ఆమె పుట్టినింటి గడప దాటి వెళ్లిపోగానే ఆమె కుటుంబం ప్రకృతి వైపరీత్యాలకు ఉన్నదంతా పోయి మళ్లీ పేద కుటుంబం అవుతుంది. పేదలుగా మారిన తల్లిదండ్రులు, అన్నదమ్ములను ఆదుకోవడానికి ఆ ఆడబిడ్డ మళ్లీ బతుకమ్మ పేరుతో ఏటా పుట్టినింటికి వచ్చి గౌరీమాత పూజ చేస్తుంది. దీంతో మళ్లీ ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షంతో ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అందుకే ఇప్పటికీ వివాహమైన మహిళలు పుట్టింటికి వచ్చి బతుకమ్మ ఆడడం ఆనవాయితీగా వస్తోంది. ఆడబిడ్డను మహాలక్ష్మిగా, గౌరీమాతగా కుటుంబం భావించడం తెలంగాణ సంస్కృతిలో భాగమైపోయింది.

నేటి నుంచి సద్దుల బతుకమ్మ వరకు.. 

బతుకమ్మను తొమ్మిది రోజుల పాటు పూజిస్తారు. ప్రతిరోజూ బతుకమ్మలను ఆడి నిమజ్జనం చేసిన తర్వాత చెరువు గట్టున మహిళలు తమ వెంట తెచ్చుకున్న పలహారాలను పంచుకుని ఆరగిస్తారు. ఒక్కోరోజు ఒక్కో రకమైన ఫలహారాన్ని వినియోగిస్తారు. ఒక్కోరోజు ఉపయోగించే ఫలహారాలు, బతుకమ్మల పేర్లు ఇలా ఉన్నాయి. మొదటిరోజు ఎంగిలి పూల బతుకమ్మను పెత్తర అమావాస్య రోజున పేరుస్తారు. ఆ రోజు ప్రసాదంగా నువ్వులు, నూకలు, బెల్లం వినియోగిస్తారు. 

సమష్టి  భావనకు సంకేతం

తెలంగాణలో బతుకమ్మ వచ్చిందంటే ఇంటిల్లిపాదికీ సంబురం. అశ్వయుజ పాడ్యమికి ముందు వచ్చేది పితృ అమవాస్య. ఆ రోజును పెత్తరమావాస్యగా జరుపుకుంటాం. అదే రోజున పేర్చే బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. ఒక రోజు ముందే తమ ఇంటి ఆడపడుచు పేర్చే బతుకమ్మ అందంగా ఉండాలని యువతులు తలుస్తారు. పూలను నోటితో ఊది వికసింపచేయడంతో వాటిని ఎంగిలి పూలుగా వ్యవహరిస్తారు. బతుకమ్మ అందంగా ఉండాలంటే సమష్టి భావనతోనే సాధ్యమవుతుంది. పొలం గట్లలో ఉన్న పచ్చ తంగేడు, ఎర్ర తంగేడు, ముత్యాలపూలు, గునుగు పూలు, జిల్లేడు పూలు వంటివి సేకరించడానికి కుటుంబ సభ్యులంతా బయల్దేరుతారు. చిన్నారులు, యువకులు పూల సేకరణలో ముందుండి తమ ఇంటి బతుకమ్మ అందంగా ఉండాలని భావిస్తారు. ఒక్కో ఇంటి సభ్యులంతా కలిసి వెళ్లి బతుకమ్మ ఆడే ప్రాంతంలో ఒకేసారి కలవడం, పల్లెల్లో, పట్టణాల్లో సమష్టి ఆలోచనలకు, పండుగ స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తుంది.