సోమవారం 30 నవంబర్ 2020
Badradri-kothagudem - Oct 15, 2020 , 02:09:48

పంట చెరువైంది... గుండె నీరైంది

పంట చెరువైంది... గుండె నీరైంది

  • కుండపోత వర్షానికి నీట మునిగిన పంటలు
  • అతలాకుతలమైన ఉమ్మడి ఖమ్మం జిల్లా
  • వరి, పత్తి రైతులకు తీరని నష్టం
  • పొలం బాట పట్టిన యంత్రాంగం
  • వరద నీటితో పొంగిపొర్లుతున్నపాలేరు జలాశయం
  • ఖమ్మం- సూర్యాపేట మార్గంలో నిలిచిన రాకపోకలు

కుండపోతగా కురిసిన వర్షాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా అతలాకుతలమైంది.. పంట చెరువైంది.. రైతు గుండె నీరైంది.. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను నీళ్ల పాలు చేసింది.. పంట నష్టం అంచనాకు యంత్రాంగం యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగింది.. పంటల వారీగా నష్టాలను అంచనా వేసింది.. పూర్తి నివేదికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపనుంది.. మరోవైపు ఏకధాటిగా కురిసిన వర్షాలకు భద్రాద్రి ఏజెన్సీ జల దిగ్బంధమైంది.. గిరిజన గూడేలకు రాకపోకలు నిలిచిపోయాయి..   పాలేరు జలాశయం పొంగి పొర్లుతోంది.. ప్రధాన రహదారిపై వరద నీరుపారడంతో  ఖమ్మం- సూర్యాపేట మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.. ప్రత్యామ్నాయ మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు.

-ఖమ్మం ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ 


ఖమ్మం ప్రతినిధి నమస్తే తెలంగాణ: అల్పపీడన ప్రభావంతో రెండు రోజులుగా కురిసిన వర్షం కార ణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా అతలాకుతలమైంది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. విస్తారంగా వర్షం కురవడంతో వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. బుధవారం వరుణుడు శాంతించడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజానీకం ఊపిరిపీల్చుకున్నది. ఓవైపు విస్తారంగా కురుస్తున్న వర్షా లు, మరోవైపు చేతికి వచ్చిన పంట చేజారి పోతుండటంతో సాగు రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వాయుగుండం ప్రభావం ఉమ్మడి జిల్లాపై లేకపోవడంతో పొడి వాతావరణం నెలకొంది. అయితే మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి జిల్లా వ్యాప్తంగా సరాసరి 29.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వేంసూరు మండలంలో 74.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా మిగిలిన మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. దీంతో బుధవారం ఉదయం నుంచి జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ సంబంధిత అధికారులతో కలిసి జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల్లో పర్యటించారు. ఆ యా మండలాల పరిధిలో దెబ్బతిన్న రహదారులు, పంట నష్టం తదితర అంశాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. కలెక్టర్‌తోపాటు జిల్లా వ్యవసాయశాఖ అధికారి, ఉద్యానపట్టు పరిశ్రమశాఖ అధికారి, ఇరిగేషన్‌ అధికారులు సైతం క్షేత్రస్థాయిలో పర్యటించి భారీ వర్షానికి కలిగిన నష్టాలపై ఆరా తీశారు. వైరా కృషివిజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు సైతం అధికారులతో కలిసి పంట పొలాలను సందర్శించారు. పత్తి, వరి, మిర్చి, ఇతర ఉద్యానపంటలు సా గు చేసిన రైతులతో మాట్లాడారు. పంటను సాదారణ స్థితికి తీసుకువచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. ఎక్కువ మొత్తంలో నష్టం జరిగిన పంట వివరాలను ఆయా వ్యవసాయశాఖ విస్తరణ అధికారులు సేకరించి జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయానికి తరలించారు.

నిండు కుండల్లా జలాశయాలు..

జిల్లాలో చిన్న, చిన్న కుంటలు, చెరువులు మొదలుకొని మధ్యతరహా, రిజర్వాయర్ల వరకు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఈ ఏడాది వానాకాలం సీజన్‌ ఆరంభం నుంచి వరుసగా కురుస్తున్న వర్షాలకు ఎప్పటికప్పుడు వరదనీరు వచ్చి చేరుతున్నది. సోమవారం రాత్రినుంచి మంగళవారం వరకు అధిక వర్షపాతం నమోదు కావడంతో మరోమారు జలాశయాలకు జలకళ సంతరించుకున్నది. చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండిపోయాయి. 

పొలంబాట పట్టిన అధికార యంత్రాంగం

వర్షం తగ్గుముఖం పట్టడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా అధికారులు పొలంబాట పట్టారు. ఖమ్మం జిల్లాలో కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, భద్రాద్రి జిల్లాలో కలెక్టర్‌ ఎంవీ రెడ్డి దెబ్బతిన్న రహదారులు, పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల రైతులకు భరోసా ఇచ్చారు. గ్రామ వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ విస్తరణ అధికారుల నుంచి మొదలుకొని జిల్లా అధికారుల వరకు పంట పొలాలను పరిశీలించారు. శాస్త్రవేత్తలు రైతులకు సలహాలు సూచనలు చేశారు. ప్రమాదకరంగా మారిన చెరువులు, కుంటలు, మధ్యతరహా జలాశయాలను సైతం ఇరిగేషన్‌ అధికారులు పరిశీలించారు. తెగిన కట్టలు, కాల్వల పునరుద్ధరణకు అవసరమైన చర్యలు చేపట్టారు. అయితే పొలాల్లో నీరు నిల్వ ఉండటంతో జాగ్రత్తలపై ఆయా గ్రామ స్థాయి అధికారులకు జిల్లా అధికారులు దిశా నిర్ధేశం చేశారు.

 ఖమ్మం జిల్లాలో     75,364 ఎకరాల్లో పంట నష్టం

వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి ఖమ్మం జిల్లాలో 75, 364 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అధికారుల ప్రాథమిక పరిశీలనలో వెల్లడైంది. దీంతో 53,358 మంది రైతులకు నష్టం వాటిల్లినట్లు అధికారులు తేల్చారు. మరో రెండు, మూడురోజుల తరువాత పంట పొలాలను పునపరిశీలించి మరోమారు నివేదిక తయారు చేసే అవకాశముంది. ప్రస్తుతం వ్యవసాయశాఖ నివేదిక ప్రకారం 348 గ్రామాలకు సంబంధించి వరి 38,111 ఎకరాలు, పత్తి 37,227 ఎకరాలు, కంది 26ఎకరాల్లో ప్రభుత్వ నిబంధనలమేరకు 33 శాతం కంటే అధికంగా నష్టం వాటిల్లినట్లు తేల్చారు. ఉద్యా న పంటలైన మిర్చి, కూరగాయలు, పండ్లు, పూల తోటలకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో పూర్తి వివరాలు అధికారులు సేకరించనున్నారు. 

స్తంభించిన రవాణా వ్యవస్థ..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ స్తంభించింది. ప్రజలు ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్‌కు సూర్యాపేట జిల్లాలోని పలు ప్రాంతాలతోపాటు, ఎగువ ప్రాంతాల నుంచి వర్షపునీరు చేరడంతో మత్తడి దుంకింది. దీంతో ఖమ్మం-సూర్యాపేట రహదారిపైకి అడుగు నుంచి రెండు అడుగుల మేర నీరు ప్రవహించడంతో అధికారయంత్రాంగం అప్రమత్తమై రాకపోకలను దారి మళ్లించారు. హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వరద పరిస్థితిని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు సమీక్షించారు.  

భద్రాద్రి జిల్లాలో 8,313ఎకరాల్లో  నీట మునిగిన పంటలు

భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపై పడింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో జిల్లాలోని వాగు లు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు మత్తడి దుంకుతున్నాయి. పర్ణశాల వద్ద చిన్న గుబ్బలమంగి వాగు పొంగిపొర్లుతున్నది. అన్నపురెడ్డిపల్లి మండలంలోని అన్నదైవం వాగు, అబ్బుగూడెం -కట్టుగూడెం మధ్యన కొత్తూరు గుంపెన వాగు, గుంటుపల్లి-నర్సాపురం వద్ద స్తంబాలచెరువు, రాళ్లచెరువులు పొంగడంతో పలు మండలంలోని పంట పొలాల్లోకి నీరు చేరింది. వరి, అరటి, పత్తి, మిరప పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా 8,313ఎకరాల్లో పంట నీట మునిగింది. 7,212 ఎకరాల్లో వరి, 686ఎకరాల్లో పత్తి, 155ఎకరాల్లో వేరుశనగ, 260ఎకరాల్లో మిర్చి పంట నీటమునిగింది. మొత్తం 67గ్రామాల్లో భారీ వర్షం నమోదుకాగా, 4,198 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు.

బుధవారం ఉదయం నుంచి వర్షం తెరిపివ్వడంతో వ్యవసాయశాఖ అధికారులు పంట నష్టాన్ని లెక్కించే పనిలో నిమగ్నమయ్యారు. వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా ఏడు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 115 ఇళ్లు పూర్తిగా నీటమునిగాయి. 24 చోట్ల విద్యుత్‌ స్తంభాలు, 77 చోట్ల వృక్షాలు విరిగిపడ్డాయి. దీంతో పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్లపై చెట్లు విరిగిపడటంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి విద్యుత్‌ పునరుద్ధరణ, రోడ్లకు మరమ్మతులు చేపట్టారు. 

నిండుకుండలా ప్రాజెక్ట్‌లు, చెరువులు

వర్షాలతో జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువులు, వాగు లు, వంకలు, ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. పాల్వంచ రూరల్‌ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టు 407 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరడంతో అధికారులు రెండు గేట్లు ఎత్తి మంగళవారం సాయంత్రం 8వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. తాలిపేరు ప్రాజెక్టు  పూర్తిస్థాయిలో నీటిమట్టానికి చేరుకుంది. పెదవాగు ప్రాజె క్టు నాలుగుగేట్లు ఎత్తి 18వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. 

నీటమునిగిన పంటలు

జిల్లా వ్యాప్తంగా రెండురోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పలు మండలాల్లో పంట నీటమునగడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి ఆదేశాలతో మండలాల వారీగా రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు రంగంలోకి దిగి నీటమునిగిన పంటను లెక్కిస్తున్నారు. త్వరితగతిన పంట నష్టాన్ని అంచనా వేసి నివేదిక అందజేయాలని కలెక్టర్‌ ఆదేశించారు.  

ఆందోళనలో అన్నదాతలు

భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు రావడంతో వరి పంట నేలవాలిపోయింది. పత్తి, వేరుశనగ, మిర్చీ పంటల్లో నీరు నిలిచిపోవడంతో పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి దెబ్బతిన్న పంటల సర్వేను చేపట్టి నష్టపరిహారం కోసం నివేదికలు సిద్ధం చేయాలని వ్యవసాయ, అనుబంధశాఖల అధికారులను ఆదేశించారు. 

అధికారులు అందుబాటులో ఉండాలి


కొత్తగూడెం : భారీ వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు అందుబాటులో ఉండాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి తెలిపారు. వాగులు పొంగి పొర్లడం, రహదారులపైకి నీరు చేరడం, కోతకు గురికావడం, విద్యుత్‌ సమస్యలు రాకుండా వైద్య సేవలు అంతరాయం లేకుండా అటు ప్రభుత్వ ఆదేశాలు, ఇటు అధికారుల పర్యవేక్షణ, ప్రజల సహకారం పట్ల కలెక్టర్‌ ఎంవీ రెడ్డి అభినందించారు. సత్వరం ఇబ్బందులు తొలగించేందుకు కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ముందస్తు చర్యలు చేపట్టి రవాణాను నియంత్రించి, విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా చేసినట్లు చెప్పారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా నిత్యం అధికారులతో మాట్లాడుతూ సలహాలు, సూచనలిస్తూ పరిస్థితులను చక్కదిద్దారు. మంచినీటి వనరులను తనిఖీ చేయాలని ఆదేశించారు. వరదల వల్ల దెబ్బతిన్న పంటలను సర్వే చేసి పరిహారం కోసం నివేదికలు సిద్ధం చేయాలని వ్యవసాయ అనుబంధ అధికారులను ఆదేశించారు. రైతులు మానసికంగా కృంగిపోకుండా వ్యవసాయ అనుబంధ అధికారులు, రైతుబంధు సభ్యులు, ప్రజా ప్రతినిధినిధులు రైతులకు మనోధైర్యాన్ని కల్పించాలని సూచించారు.