బుధవారం 25 నవంబర్ 2020
Badradri-kothagudem - Oct 12, 2020 , 04:20:42

జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

 జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

కొత్తగూడెం: భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా పరిపాలన యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి ఆదేశించారు. వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో చేపట్టాల్సిన సహాయక చర్యలపై పోలీస్‌, జిల్లా, మండల, మున్సిపల్‌, కేటీపీఎస్‌ అధికారులతో ఆదివారం అత్యవసర టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసినట్లు చెప్పారు. లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు ఉంటుందని అన్నారు. చెట్లు కూలడం, విద్యుత్‌ స్తంభాలు పడిపోవడం, సాధారణ జనజీవనానికి అంతరాయం వంటివ సమస్యలు రాకుండా ముందస్తుగా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. జలాశయాలు, ట్యాంకులు, వాగులు, వంకలు పొంగి ప్రవహించి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తే ప్రమాదం ఉందని చెప్పారు. ఎత్తు తక్కువ ఉన్న వతెనలు, కాజ్‌వేలు పొంగిపొర్లితే ప్రజల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుందని అన్నారు.

గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం అందుబాటులో ఉండాలని, అన్ని ప్రధాన శాఖలు వరద కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నంబర్లు ఏర్పాటు చేయాలని, అత్యవసర వైద్య సేవలకు 108 వాహనాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలో 08744-241950 కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, అనుదీప్‌, ఎస్పీ సునీల్‌దత్‌, అన్ని శాఖల జిల్లా, మండల అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.