ఆదివారం 29 నవంబర్ 2020
Badradri-kothagudem - Oct 07, 2020 , 03:04:11

పత్తి, ధాన్యం కొనుగోళ్లకు సిద్ధంగా ఉండాలి

పత్తి, ధాన్యం కొనుగోళ్లకు సిద్ధంగా ఉండాలి

  • ఈ సీజన్‌లో 2.26 లక్షల మెట్రిక్‌ టన్నుల పత్తి ఉత్పత్తి అంచనా
  • 4.60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం
  • జిల్లాలో 363 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
  • అధికారుల సమావేశంలో ఖమ్మం కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ 

ఖమ్మం: జిల్లాలో వానాకాలం (ఖరీఫ్‌ 2020-21) పత్తి, ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ అధికారులను ఆదేశించారు. వానకాలం పత్తి, ధాన్యం కొనుగోలుపై మంగళవారం టీటీడీసీ సమావేశ మందిరంలో మార్కెట్‌ కమిటీల చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, కార్యదర్శులు, వ్యవసాయ, మార్కెటింగ్‌, రవాణా, అగ్నిమాపక అధికారులు, జిన్నింగ్‌ మిల్లుల యజమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ ఆదేశించారు.

ఈ సీజన్‌లో 2.26 లక్షల మెట్రిక్‌ టన్నుల పత్తి ఉత్పత్తి అంచనా

వానకాలం సీజన్‌లో జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం పెరిగిందని, ఈ ఏడాది 101675 హెక్టార్లలో పత్తి సాగు జరిగిందని, సుమారు 226130 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి అంచనాకు అనుగుణంగా రైతుకు కనీస మద్దతు ధర  లభించే విధంగా సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు జరగాలని కలెక్టర్‌ సూచించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌తో పాటు జిల్లాలోని వ్యవసాయ మార్కెట్‌లలో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రైతుల సౌకర్యార్థం రోడ్డు సైడు గల రైతు వేధికల్లో తేమ శాతం నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని  వ్యవసాయ విస్తరణాధికారులు, ఐకేపీ, రెవెన్యూ సిబ్బంది  కౌలు రైతులకు ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలన్నారు. జిన్నింగ్‌ మిల్లులకు వచ్చే రైతులు రోజుల తరబడి వేచి ఉండకుండా, త్వరగా వారి ఉత్పత్తులను కొనుగోలు చేసి పంపే విధంగా అవసరమైన కంప్యూటర్లు, సిబ్బంది అదనంగా సమకూర్చుకోవాలని మార్కెటింగ్‌ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. జిన్నింగ్‌ మిల్లులు, మార్కెట్‌ యార్డుల్లో కొవిడ్‌-19 నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలన్నారు. రైతులు కూడా మాస్క్‌లు ధరించేలా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. పత్తి కొనుగోలుకు సీసీఐ ద్వారా ఏర్పాటు చేస్తున్న 11 కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం నిర్ధారణ పరికరాలను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలన్నారు. 

4.60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ

ఖరీఫ్‌ వానకాలం ధాన్యం సేకరణకు జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌ , వ్యవసాయ మార్కెట్‌ కమిటీల ద్వారా మొత్తం 343 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. వానాకాలం సీజన్‌లో సుమారు 4 లక్షల 60 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు అంచనాలో భాగంగా ఈ సారి మార్కెటింగ్‌ శాఖ ద్వారా కూడా 20 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ముందుగానే ప్రణాళికా బద్ధంగా అవసరమైన గన్నీబ్యాగులను సిద్ధంగా ఉంచాలని, అవి కేవలం రైతులకే అందించాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ట్యాబ్‌ ఎంట్రీల్లో ప్రతిరోజు డేటా ఎంట్రీ జరగాలని కలెక్టర్‌ సూచించారు. వ్యవసాయ, మార్కెట్‌, పౌరసరఫరాలు, సివిల్‌ సప్లయీస్‌, రవాణాశాఖ అధికారులు సమన్వయంతో ధాన్య  సేకరణ జరగాలని సూచించారు. అనంతరం వానాకాలం సీజన్‌ పత్తి, ధాన్యం కనీస మద్దతు ధర, రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు, రైతులకు సూచనలతో రూపొందించిన పోస్టర్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌, డీఆర్‌డీఏ పీడీ స్నేహలత మొగిలి, అదనపు కలెక్టర్‌ ఎస్‌ మధుసూధన్‌రావు, జిల్లా మార్కెటింగ్‌ అధికారి నాగరాజు, జిల్లా వ్యవసాయ శాఖాధికారి విజయనిర్మల, జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేందర్‌, సీసీఐ అసిస్టెంట్‌ బ్రాంచి మేనేజర్‌ ప్రవీణ్‌, ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణ, రైతుబంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్‌ నల్లమల వెంకటేశ్వరరావు, జిల్లా సహకార అధికారి విజయకుమారి, జిల్లాలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీల చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, కార్యదర్శులు, జిన్నింగ్‌ మిల్లుల యజమానులు పాల్గొన్నారు.