సోమవారం 30 నవంబర్ 2020
Badradri-kothagudem - Oct 02, 2020 , 05:35:44

బండెన‌క బండిక‌ట్టి... కేసీఆర్‌కు జైకొట్టి..!

బండెన‌క బండిక‌ట్టి... కేసీఆర్‌కు జైకొట్టి..!

  • రెవెన్యూ చట్టానికి మద్దతుగా కదిలిన కొత్తగూడెం
  • గులాబీమయంగా మారిన భద్రాద్రి జిల్లా కేంద్రం
  • నూతన రెవెన్యూ చట్టం దేశానికే దిక్సూచి 
  • రైతుబంధు పథకం మహాద్భుతం : ఎమ్మెల్యే వనమా
  • సుజాతనగర్‌ నుంచి లక్ష్మీదేవిపల్లి వరకు 500 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ 
  • డప్పుచప్పుళ్లు, గిరిజనులతో కలిసి కాలు కదిపిన ప్రజాప్రతినిధులు
  • సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసిన రైతన్నలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం దద్దరిల్లింది. ఎటుచూసినా రైతుల హర్షాతిరేకాల నడుమ.. ‘జయహో.. జననేత’ అనే నినాదాలతో హోరెత్తింది. సుజాతనగర్‌ నుంచి లక్ష్మీదేవిపల్లి వరకూ 500 ట్రాక్టర్లతో చేపట్టిన భారీ ర్యాలీ.. రైతుల ఆనందానికి అద్దంపట్టింది. సబ్బండవర్గాల డప్పు చప్పుళ్లకు.. గిరిజనుల సంప్రదాయ నృత్యాలకు ప్రజాప్రతినిధులు కాలు కదిపారు. కనులవిందుగా సాగిన ఈ భారీ ర్యాలీలో అడుగడుగునా గుబాబీ జెండాలు రెపరెపలాడాయి. ర్యాలీని ఉద్ధేశించి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టం దేశానికి దిక్సూచి వంటిదని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 

- కొత్తగూడెం

 కొత్తగూడెం : కొత్త రెవెన్యూ చట్టం దేశానికి దిక్సూచి అని, సీఎం కేసీఆర్‌ రైతుల పక్షపాతి అనడానికి ఇంత కంటే నిదర్శనం ఏముంటుందని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ కొత్తగూడెం పట్టణంతో పాటు మూడు మండలాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. సుజాతనగర్‌ మండలం నాయకులగూడెం వద్ద ఎమ్మెల్యే వనమా ఆలయంలో పూజలు చేసి సీఎం కేసీఆర్‌ ప్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ట్రాక్టర్ల ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. రైతుల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రైతన్నలకు చాలా ఉపయోగపడుతున్నాయన్నారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. నియంత్రిత సాగు విధానంతో రైతులకు చాలా మేలు జరిగిందన్నారు. అంచనాకు మించి పంటల సాగు చేశారని అన్నారు.  ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాహిత పథకాలను చూసి ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఎద్దేవా చేశారు. రైతుల కోసం ప్రభుత్వం ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఇవ్వాళ రైతు పచ్చగా ఉన్నాడంటే కారణం తెలంగాణ సర్కారు అని అన్నారు. రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేసేవిధంగా చర్యలు తీసుకుందని అన్నారు. ఈ ఏడాది కూడా ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. పండించిన పంటలను నిల్వ చేసుకునేంకు అన్ని మండలాల్లో గోదాంలను ఏర్పాటు చేసిందన్నారు. రైతుల కోసం పాటుపడుతున్న ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. అందుకే ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఇంత పెద్దఎత్తున ప్రజలు వచ్చి మద్దతు తెలిపినందుకు ప్రతీ ఒక్కరికి రుణపడి ఉంటానన్నారు. 

సుజాతనగర్‌ నుంచి లక్ష్మీదేవిపల్లి వరకు 500 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ 

   కొత్తగూడెం నియోజకవర్గమంతా గులాబీమయమైంది. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేంద్రరావు నాయకత్వంలో ఏర్పాటు చేసిన ట్రాక్టర్ల ర్యాలీకి భారీగా రైతులు ట్రాక్టర్లతో తరలివచ్చారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు సుజాతనగర్‌, చుంచుపల్లి, కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో హారుతులు ఇచ్చి ఘనస్వాగతం పలికారు. నాయకులగూడెంలో లంబాడీలు బిందెలు నెత్తిన పెట్టుకుని సంప్రదాయ దుస్తులతో నృత్యాలు చేశారు. ప్రజాప్రతినిధులు ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మి, ఇతర ప్రజాప్రతినిధులు డప్పుచప్పుళ్లతో నృత్యం చేశారు.  సుజాతనగర్‌ నుండి వేపలగడ్డ, విద్యానగర్‌ కాలనీ, పోస్టాఫీస్‌ సెంటర్‌, బస్టాండ్‌, సూపర్‌బజార్‌ సెంటర్‌, లక్ష్మీదేవిపల్లి, ఇల్లెందు క్రాస్‌ వరకు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల ర్యాలీ నిర్వహించారు. గొల్లకురుమలు, గౌడసంఘం,బెస్త సంఘం,బంజారాలు, మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు.

మరో పదేళ్లు టీఆర్‌ఎస్‌కు ఎదురు లేదు : వనమా రాఘవ 

   తెలంగాణ హయాంలోనే ప్రజలకు మేలు జరిగిందని మరో పదేళ్ల వరకు టీఆర్‌ఎస్‌ పార్టీకి ఎదురు లేదని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేంద్రరావు అన్నారు. ట్రాక్టర్ల ర్యాలీలో ఆయన మాట్లాడారు. పేదల కోసమే తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రెవెన్యూ చట్టానికి మద్దతుగా ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ర్యాలీకి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. పాల్వంచలో కూడా ర్యాలీ చేశామని అక్కడ కూడా ప్రజలు వనమా నాయకత్వానికి బ్రహ్మరథం పట్టారని అన్నారు.  ఈ ర్యాలీలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ కంచర్ల చంద్రశేఖరరావు, మున్సిపల్‌ చైర్మన్‌ కాపు సీతాలక్ష్మి, వైస్‌ చైర్మన్‌  దామోదర్‌, ఎంపీపీలు విజయలక్ష్మి, భూక్యాసోనా, శాంతి, సొసైటీ చైర్మన్‌ మండే వీరహనుమంతురావు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, కో-ఆప్షన్‌ మెంబర్లు, వ్యాపారులు, రైతు నాయకులు, కులసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.