బుధవారం 02 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Sep 30, 2020 , 00:05:02

పంచాయతీల్లో ప్రతి పైసా ఖర్చుపెట్టాలి

పంచాయతీల్లో ప్రతి పైసా ఖర్చుపెట్టాలి

బూర్గంపహాడ్‌ : తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ అభివృద్ధి చెందాలని భారీ స్థాయిలో నిధులు కేటాయిస్తుందని, ఈ నిధులను ప్రతీ పైసా పంచాయతీ అభివృద్ధికి కేటాయించాలని, అవకతవకలకు పాల్పడితే సహించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మంగళవారం నిర్వహించిన బూర్గంపహాడ్‌ మండల సర్వసభ్యలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలే పరమావధిగా భావించి పల్లెలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, పథకాల అమలులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. విధుల్లో అలసత్వం వహించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ముందుగా మండల సర్వసభ్య సమావేశం వ్యవసాయ అధికారి అనీల్‌ ఈ మూడు నెలల్లో సాధించిన ప్రగతిని వివరిస్తుండగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రైతుబీమా దరఖాస్తుల్లో వంద దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని జిల్లా వ్యవసాయ అధికారి దృష్టికి తీసుకెళ్లి సదరు ఏవోపై చర్యలు తీసుకునేలా చేస్తానన్నారు. వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో వెళ్లకుండా వారు పొంతనలేని లెక్కలు చెప్తున్నారని, దీంతో ప్రభుత్వానికి తప్పుడు సమాచారం అందుతోందన్నారు. ఏవో అనీల్‌ కిన్నెరసాని లెప్ట్‌ కెనాల్‌ పరిధిలోని పంచాయతీలకు సాగునీరు వస్తుందని చెప్పడంతో ఆయా పంచాయతీల సర్పంచ్‌లను ఈ విషయంపై అడిగారు. తమకు సాగునీరు రావడం లేదని సర్పంచ్‌లు చెప్పడంతో మిడిమిడి జ్ఞానంతో ఎలాంటి సమాచారం లేకుండా సమావేశానికి రావొద్దన్నారు. అన్ని శాఖల సమావేశం అనంతరం విప్‌ మాట్లాడుతూ... ప్రభుత్వం అన్నివర్గాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ దేశంలోనే ఏ రాష్ట్రం అమలుచేయని పథకాలను అమలు చేస్తోందని, రైతుబంధు, రైతుబీమా, రైతులకు నిరంతరం విద్యుత్‌, మిషన్‌ కాకతీయ, భగీరథ లాంటి పథకాలతో ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు. ఈ పథకాల అమలులో ముఖ్యంగా కృషి చేయాల్సింది స్థానికంగా ఉండే సర్పంచ్‌లు కృషి చేయాలని చెప్పారు.  భద్రాచలం డంపింగ్‌ యార్డును సారపాకలో ఏర్పాటు చేయడంపై మండల స్థాయి అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, కొండారెడ్డి, మండల స్పెషల్‌ ఆఫీసర్‌ చంద్రప్రకాశ్‌, ఎంపీడీవో శంకర్‌, తహసీల్దార్‌ కిషోర్‌, మండలంలోని అన్ని పంచాయతీల సర్పంచ్‌లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.