శనివారం 31 అక్టోబర్ 2020
Badradri-kothagudem - Sep 30, 2020 , 00:05:18

తొలి పాలకవర్గానికి పచ్చజెండా

తొలి పాలకవర్గానికి పచ్చజెండా

భద్రాచల సీతారామచంద్రస్వామి దేవస్థానానికి పాలకమండలి ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది.  తెలంగాణలో ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కంకణం కట్టుకున్నారు. వంశపారంపర్యత లేకుండా దేవాలయాల్లో  రాజ్యాంగబద్ధంగా పాలక మండలిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దేవస్థానాల్లో ట్రస్టుబోర్డుల ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఆలయ అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేశారు. దీంతో కమిటీలో స్థానంకోసం ఎదురు చూస్తున్న ఆశావాహులకు ఆశలు చిగురించాయి. -భద్రాచలం  

భద్రాచలం: దక్షిణ అయోధ్యగా పిలిచే భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానం పాలకమండలి ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఎన్నో ఏళ్లుగా ట్రస్టుబోర్డు ఏర్పాటుపై ఆశలు పెంచుకున్న ఆశావాహులకు కేసీఆర్‌ ప్రభుత్వం తీపి కబురును అందించింది. తెలంగాణలో ఆలయాల అభివృద్ధికి కంకణం కట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో వంశపారంపర్యత లేని దేవాలయాల్లో రాజ్యాంగబద్ధంగా పాలక మండలిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సోమవారం రాష్ట్రంలోని భద్రాద్రి శ్రీ సీతారామ చంద్రస్వామి, వేముల వాడ రాజరాజేశ్వర స్వామి, యాదాద్రి లక్ష్మీనర్సింహాస్వామి దేవస్థానాల్లో ట్రస్టుబోర్డుల ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ.. దేవాదాయ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో భద్రాచల రాములోరి దేవస్థాన ట్రస్టుబోర్డు కమిటీలో స్థానం కోసం ఎదురు చూస్తున్న ఆశావాహులకు మళ్లీ ఆశలు చిగురించాయి.

14వ పాలక మండలికి దరఖాస్తులు ఆహ్వానం

1960లో భద్రాచల దేవస్థానం.. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో దేవాదాయ శాఖ పరిధిలోనికి వచ్చింది. అప్పటి దేవాదాయ శాఖ మంత్రి కల్లూరి చంద్రమౌళి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు కాగా.. దానికి తొలి ట్రస్టుబోర్డు చైర్మన్‌గా కల్లూరి చంద్రమౌళి ఉన్నారు. అటు తరువాత 13 పాలక మండళ్లు కొలువుదీరాయి. చివరిగా కురిచేటి పాండురంగారావు చైర్మన్‌గా 2010, నవంబర్‌ 26 నుంచి 2012 నవంబర్‌ 25 వరకు ట్రస్టు బోర్డు సేవలను అందించింది. కాగా ఈ ట్రస్టు బోర్డుకు రెండుసార్లు చైర్మన్‌గా ఎన్నికైన ఘనత కేవలం అల్లూరి మూర్తి రాజుకు మాత్రమే దక్కింది. 14వ పాలక మండలికి ఆశావాహుల నుంచి ద రఖాస్తులు ఆహ్వానించింది ప్రభుత్వం. ఈ 14 వ పాలక మండలిలో.. 14 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సమాచా రం.

ఎన్నో ఆశలు

2012 నవంబర్‌ నుంచి నేటి వరకూ భద్రాద్రి రామాలయానికి పాలకమండలి ఏర్పాటు కాలేదు. తెలంగాణ సిద్ధించిన తర్వాత ట్రస్టు బోర్డు ఏర్పాటు రంగంసిద్ధమైనా.. అది కార్యరూపం దాల్చలేదు. దీంతో సుమారు ఎనిమిదేండ్ల తర్వాత రామాలయ ట్రస్టు బోర్డుకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. స్వరాష్ట్రంలో ఇదే తొలి ట్రస్టు బోర్డు కావడంతో ఎంతోమంది ఆశలు పెట్టుకున్నారు. రామాలయ అభివృద్ధి, ఆలయ ఆదాయ వనరులను పెంచటం, రామనామాన్ని ప్రతి పల్లెకు చేర్చేలా ఆధ్యాత్మిక, సేవ భావాలతో ఉన్న కమిటీని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ ముందడుగు వేసింది.