గురువారం 22 అక్టోబర్ 2020
Badradri-kothagudem - Sep 30, 2020 , 00:04:52

రైతు బాంధవుడికి ధాన్యాభిషేకం

రైతు బాంధవుడికి ధాన్యాభిషేకం

‘నీవో కారణజన్ముడవు.. మా అందరి అభిషేకాలకు అర్హుడవు. అంతకుమించి మా రైతుబాంధవుడవు. అందుకో జననేత.. మా హృదయపూర్వక ధాన్యాభిషేకం.. క్షీరాభిషేకం.. పుష్పాభిషేకం.. మా ప్రేమాభిషేకం’ అంటూ యావత్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంస్కరణలకు సాహో అంటున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సీఎం సంస్కరణలు, చట్టాలను ప్రశంసిస్తూ.. రైతులు, సబ్బండ వర్గాలు పార్టీలకతీతంగా ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలతో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా కల్లూరులో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో మహిళలు పచ్చని పొలాల నడుమ భారీ ర్యాలీ తీశారు. భద్రాద్రి జిల్లా పాల్వంచలో రైతులు టీఆర్‌ఎస్‌ నాయకుడు వనమా రాఘవ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి.. తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.- ఖమ్మం ప్రతినిధి, నమస్తే తెలంగాణ

ఖమ్మం ప్రతినిధి, నమస్తే తెలంగాణ : నూతన రెవెన్యూ చట్టం 2020కి అన్ని వర్గాల నుంచి సర్వత్రా మద్దతు లభిస్తున్నది. సీఎం కేసీఆర్‌ చర్యలను ప్రశంసిస్తూ మద్దతుగా ప్రజలు, రైతులు ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. రైతన్నలు ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో ప్రదర్శనలు నిర్వహిస్తూ ప్రభుత్వ చర్యలకు బాసటగా నిలుస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రజలు మద్దతుగా ర్యాలీలు నిర్వహిస్తూ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మంగళవారం కల్లూరు మండలంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నేతృత్వంలో మహిళలు భారీ ప్రదర్శన  నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు, రైతులకు నూతన రెవెన్యూ చట్టం వల్ల ఒనగూరనున్న ప్రయోజనాల వల్ల తాము లబ్ధి పొందే అవకాశం లభించడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ చిత్రపటాలను చేతపట్టుకొని ప్రదర్శనలో పాల్గొని అభిమానాన్ని చాటారు. మహిళా రైతులు, రైతు కూలీలు, గృహిణులతో కిలోమీటర్ల కొద్ది ర్యాలీ సాగింది. అనంతరం సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి ధ్యాన్యభిషేకం, పుష్పాభిషేకం, క్షీరాభిషేకం నిర్వహించి అభిమానం తెలుపుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో టీఆర్‌ఎస్‌ నాయకుడు వనమా రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాదిమంది రైతులు, రైతు నాయకులు ప్రదర్శనలో పాల్గొని  సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కల్లూరులో నిర్వహించిన కార్యక్రమంలో  సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, పాల్వంచలో నిర్వహించిన కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకుడు వనమా రాఘవేంద్రరావు పాల్గొని మాట్లాడారు. 

ప్రదర్శనలు, క్షీరాభిషేకాలు

నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో రైతులు, ప్రజలు ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో ప్రదర్శన నిర్వహిస్తున్నారు. రైతన్నలు భారీగా పాల్గొంటున్నారు. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడలో తొలుత ఎడ్లబండ్ల ప్రదర్శన నిర్వహించారు. అనంతరం వేంసూరు మండలంలో భారీ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. రఘనాథపాలెం మండలంలోని రైతులు, టీఆర్‌ఎస్‌ నాయకులు మండలంలోని మంచుకొండ గ్రామం నుంచి భారీ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ఖమ్మం నగరం వరకు ర్యాలీ సాగింది. గత ఆదివారం పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండల కేంద్రంలో వేలాది ట్రాక్టర్లతో ప్రదర్శన జరిగింది. ఖమ్మం రూరల్‌, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, కూసుమంచి మండలాలకు చెందిన రైతులు, రైతు సంఘం, టీఆర్‌ఎస్‌ నాయకులు, శ్రేణులు వేలాదిగా పాల్గొని రెవెన్యూ చట్టానికి మద్దతు ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పినపాక, కొత్తగూడెం, సత్తుపల్లి, మధిర, పాలేరు, ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ట్రాక్టర్ల ర్యాలీలు నిర్వహించారు.  

కల్లూరు : జైజై కేసీఆర్‌.. జయహో కేసీఆర్‌.. అంటూ కల్లూరు పట్టణం మహిళల నినాదాలతో మార్మోగింది. సంస్కరణల పితామహుడంటూ నూతన రెవెన్యూ చట్టం ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి మద్దతుగా మంగళవారం రెండు వేల మంది మహిళలతో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్‌, కేటీఆర్‌, సండ్ర ప్లకార్డులతో కల్లూరు పట్టణం గులాబీమయమైంది. పుల్లయ్యబంజరు రోడ్డులోని కాశ్మీర దైవక్షేత్రం నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వంలో సంస్కరణలను రూపుదిద్ది నూతన చట్టాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఆరాధ్యదైవంగా సీఎం కేసీఆర్‌ నిలిచారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ర్యాలీ అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన నాటి నుంచి నేటివరకు ప్రజాభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్న నేత కేసీఆర్‌ అని కొనియాడారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్‌ అందిస్తూ వెలుగుజిలుగులతో తెలంగాణను ముందుకు నడుపుతున్న నేత అన్నారు. ప్రాజెక్టుల అవసరాన్ని గుర్తించి సీతారామప్రాజెక్టు ద్వారా 10లక్షల ఎకరాలకు సాగునీరందించే కార్యక్రమం చేపట్టి అతిత్వరలో ఖమ్మం ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేయనున్నారని అన్నారు. రెవెన్యూలో వీఆర్వో వ్యవస్థను రద్దుచేసి వీఆర్‌ఏలకు విద్యార్హతను బట్టి పదోన్నతులు కల్పించేలా స్కేల్‌ తీసుకువచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ధరణి వెబ్‌సైట్‌లో కళ్లు, వేలిముద్రల ద్వారా నిజమైన లబ్ద్ధిదారులను గుర్తించి వారికి న్యాయం చేసేలా ప్రత్యేకంగా పోర్టల్‌ను తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. పూర్వీకుల పేరుతో ఉన్న భూమిని చుట్టుపక్కల వారు ఇచ్చిన సమాచారం మేరకు వారికే మెరూన్‌ పాస్‌పుస్తకం ఇచ్చేలా ఉత్తర్వులు జారీచేశారని, సాదాబైనామాల ద్వారా రైతుకు న్యాయం చేసేందుకు మరోమారు అవకాశం కల్పించారన్నారు. డిజిటలైజేషన్‌ సర్వే ద్వారా భూములను గుర్తించి ప్రతి వ్యక్తికి న్యాయం చేసేలా సర్వే ప్రారంభించారన్నారు. అంబేద్కర్‌ దళిత యూనివర్సిటీని త్వరలో తెలంగాణలో ఏర్పాటు చేస్తామని, నిరుపేదలకు సొంత స్థలాల్లోనే ఇళ్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. తొలుత కేసీఆర్‌ చిత్రపటాలకు మహిళలు పుష్పాభిషేకం చేశారు. ఎమ్మెల్యే సండ్ర, రైతులతో కలిసి సీఎం చిత్రపటానికి ధాన్యాభిషేకం చేశారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు పంచాయతీ నుంచే నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని సూచించారు. అన్ని గ్రామపంచాయతీల్లో ఇళ్లు, భూములను సర్వేచేసి రికార్డులను తెప్పిస్తారని, ఆయా గ్రామాల నాయకులు దగ్గరుండి సక్రమంగా సర్వే జరిగేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల శేషగిరిరావు, ఎంపీపీ బీరవల్లి రఘు, జడ్పీటీసీ కట్టా అజయ్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు, రైతుబంధు సమితి నాయకులు పసుమర్తి చందర్‌రావు, లక్కినేని రఘు, ఆత్మచైర్మన్‌ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, మార్కెట్‌కమిటీ చైర్మన్‌ చెక్కిలాల లక్ష్మణరావు, పెనుబల్లి, తల్లాడ మండలాల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కనగాల వెంకట్రావు, రెడ్డెం వీరమోహనరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ బోబోలు లక్ష్మణరావు, జడ్పీ కోఆప్షన్‌ సభ్యులు ఎండీ ఇస్మాయిల్‌, కాటంనేని వెంకటేశ్వరరావు, కొరకొప్పు ప్రసాద్‌, గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సొసైటీల చైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.logo