సోమవారం 26 అక్టోబర్ 2020
Badradri-kothagudem - Sep 28, 2020 , 00:33:55

మొక్కల పంపిణీలో డోలాయమానం

మొక్కల పంపిణీలో డోలాయమానం

  • సరఫరాపై రైతుల అనుమానం 
  • అధికారులపై సర్వత్రా అసహనం
  • అదును దాటుతున్నా పట్టించుకోని ఆయిల్‌ఫెడ్‌ యంత్రాంగం
  • ఫ్యాక్టరీ సామర్థ్యం పెంపు నిష్ప్రయోజనం

అశ్వారావుపేట : రైతులకు దీర్ఘకాలిక నికర ఆదాయానిచ్చే ఆయిల్‌పాం సాగు విస్తరణపై ఆయిల్‌ఫెడ్‌ డోలాయమానంలో పడింది. అదును దాటుతున్న నేటికీ పామాయిల్‌ మొక్కల పంపిణీపై సంస్థ అధికారులు సందిగ్ధం వీడటం లేదు. దీంతో ఆయిల్‌పాం మొక్కల సరఫరాపై రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇతర పంటలను వదిలేసి ఆయిల్‌పాం సాగు కోసం ఎదురు చూస్తున్న రైతులు అధికారుల తీరుపై సర్వత్రా అసహనం వెలిబుచ్చుతున్నారు. భవిష్యత్‌ అవసరాల అంచనాతో దమ్మపేట ఫ్యాక్టరీ సామార్థ్యాన్ని పెంచినప్పటికీ నిష్ప్రయోజనం అవుతుందేమోనని పెదవి విరుస్తున్నారు. ఆయిల్‌పాం సాగును ప్రభుత్వం ప్రోత్సాహిస్తున్నా అధికారులు నిర్లక్ష్యం వీడకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. డిమాండ్‌ ఉన్న ఉద్యాన తోటల్లో ఆయిల్‌పాం సాగు ప్రధానమైనది. దళారీ వ్యవస్థ లేకుండా పంటను నేరుగా ఆయిల్‌ఫెడ్‌కు అమ్ముకోవడంతో పాటు కనీస మద్దతు ధర పొందటానికి ఈ సాగు అత్యంత అనుకూలం.

సాగు పట్ల ప్రతి ఏటా రైతులు ఆశక్తి చూపడంతో డిమాండ్‌ భారీగా పెరిగింది. మొక్కల పంపిణీ నుంచి తోటల నిర్వహణ, ఎరువుల సరఫరా డ్రిప్‌ మంజూరు వరకు అనేక రాయితీ పథకాలు అమలు కావడంతో రైతుల నుంచి సాగు పట్ల మక్కువ మరింత పెరిగింది. రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించే ఆయిల్‌ఫెడ్‌ అధికారులు జూన్‌ లేదా జూలైలో రైతులకు మొక్కల పంపిణీ ప్రక్రియను మొదలు పెడతారు. కానీ ఈ ఏడాది అధికారుల సమన్వయ లోపం, నిర్లక్ష్యం ఫలితంగా సీజన్‌ ప్రారంభమై సుమారు నాలుగు నెలలు పూర్తి కావొస్తున్నా మొక్కల పంపిణీలో అధికారులు ఇప్పటికీ కొలిక్కి రాలేదు. ఇందుకు ప్రధాన కారణం మొక్కల ఉత్పత్తి సకాలంలో చేపట్టలేదనే వాదన వినిపిస్తున్నది. గతేడాది సెప్టెంబర్‌లోనే విత్తనాలు (మొలకలు) దిగుమతి చేసుకున్న ఆయిల్‌ఫెడ్‌ అధికారులు అక్టోబర్‌లో చిన్న బ్యాగుల్లో పెట్టి షెడ్‌ నట్‌లో పెంపకం ప్రారంభించారు. అయితే 3 నెలల తర్వాత ఆ మొక్కలు బయటకు తీసి 4వ నెలలో పెద్ద బ్యాగులోకి మార్చివేసి (ట్రాన్స్‌ప్లాంటేషన్‌) చేసి మరో 6 నుంచి 7 నెలల పాటు  పెంచాలి. ఒక్కో మొక్క వయస్సు 11నుంచి 12 నెలలు పూర్తయిన తర్వాతనే రైతులకు 12వ నెల తర్వాత పంపిణీ చేస్తారు. టెక్నికల్‌గా పెరిగిన మొక్కలో నాణ్యత ఉంటుంది.

ఇదే పద్ధతి గతేడాది వరకు కొనసాగింది. ఈ ఏడాది మాత్రం మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం, అలసత్వం, అధికారుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది. అక్టోబర్‌లో విత్తనాలను చిన్న బ్యాగుల్లో పెట్టిన అధికారులు షేడ్‌ నట్‌లో ఉంచి మర్చిపోయినట్లున్నారు. 3 నెలల తర్వాత బయటకు తీయాల్సిన మొక్కలను సెప్టెంబర్‌ నెల పూర్తి అవుతున్నా ఇంకా షెడ్‌ నట్‌లోనే ఉంచారు. చిన్న బ్యాగుల్లోనే ఏడాది పాటు మొక్కలను ఉంచటం వల్ల రైతులు నాణ్యతపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్‌లో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోననే ఆందోళన చెందుతున్నారు. మొక్కల కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా గడువు పెంచుకుంటూ కాలయాపన చేస్తున్నారనే భావన రైతుల్లో వ్యక్తమవుతున్నది. కొందరు కౌలు రౌతులు సైతం భూ యాజమానుల నుంచి ఒత్తిడికి గురవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని గమనించిన సంస్థ చైర్మన్‌, ఎండీ మొక్కల పెంపకాన్ని ప్రైవేట్‌ వ్యక్తులకు కాంట్రాక్ట్‌ పద్ధతిలో అప్పగించారు. అయన కూడా ఆగస్టు 1 నుంచి నర్సరీని స్వాధీనం చేసుకున్నారు.

అయినా రెండు నెలలు గడుస్తున్నా మొక్కల పంపిణీపై అధికారులు నిర్ధిష్ట ప్రకటన చేయలేకపోతున్నారు. ఈ ఏడాది ఉద్యాన శాఖ 1,700 హెక్టార్ల ఆయిల్‌పాం సాగుకు అనుమతినివ్వగా 2.60 లక్షల మొక్కలు అవసరముంది. రైతుల నుంచి డిమాండ్‌ అధికంగా ఉండటంతో ఇప్పటికే 4 వేల హెక్టార్లకు మొక్కలు కావాలని రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ లెక్కన సుమారు 6 లక్షల మొక్కలు ఉత్పత్తి చేయాల్సి ఉంది. ఆగమేఘాల మీద మొక్కల పంపిణీ ప్రక్రియను ప్రారంభించినా ఇప్పటికిప్పుడు నర్సరీలో 50 వేలకు మించి మొక్కలు అందుబాటులో లేవని రైతులు స్పష్టం చేస్తున్నారు. మరి దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ ఇంకెప్పుడు మొక్కలు పంపిణీ చేస్తారన్నది జవాబులేని ప్రశ్నగా పేర్కొంటున్నారు. ఈ విషయమై వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయిల్‌ఫెడ్‌ ఇన్‌చార్జ్‌ డివిజనల్‌ ఆఫీసర్‌ బాలకృష్ణ ఫోన్‌కు స్పందించలేదు.  


logo