శనివారం 05 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Sep 28, 2020 , 00:33:56

రైతు ప్రయోజనాల కోసమే సేవా కేంద్రాలు

రైతు ప్రయోజనాల కోసమే సేవా కేంద్రాలు

  • జిల్లా వ్యవసాయశాఖాధికారి అభిమన్యుడు

పినపాక: రైతుల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం గ్రామాల్లో ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని జిల్లా వ్యవసాయశాఖాధికారి అభిమన్యుడు అన్నారు. ఆయన ఆదివారం మండలంలోని ఏడూళ్లబయ్యారం, పినపాక గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం ఆయన రైతులతో మాటాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎన్నో రైతు ప్రయోజనాల కార్యక్రమాలను ప్రవేశపెడుతుందని, దీనిలో భాగంగానే రైతులకు అన్ని రకాల ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు అందుబాటులోకి తీసుకువచ్చి ఎమ్మార్పీ ధరలకే విక్రయించేందుకు మారుమూల గ్రామాల్లో సైతం ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఈ ఆగ్రోస్‌ రైతు కేంద్రాలను బీఎస్సీ కెమిస్ట్రీ లేదా పాలిటెక్నిక్‌ అగ్రికల్చర్‌ డిప్లోమా చేసిన నిరుద్యోగులకు ఈ కేంద్రాలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పీఏసీఎస్‌లతో పాటూ ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాలకు 50 శాతం ఎరువులను ప్రభుత్వం అందజేస్తుందన్నారు.

అంతేగాక రైతులకు ఈ కేంద్రాల ద్వారా వ్యవసాయ పనిముట్లను కూడా అందజేస్తామన్నారు. పినపాక మండలంలో 3, కరకగూడెంలో 2 ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ, వైస్‌ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, స్థానిక సర్పంచ్‌లు కోరం రజిని, గొగ్గెల నాగేశ్వరరావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ వీయస్‌ఆర్‌ఎస్‌ వర్మ, వైస్‌ చైర్మన్‌ బత్తుల వెంకటరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్‌ పొనుగోటి భద్రయ్య, ఏడీఏ తాతారావు, ఏవో వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పగడాల సతీశ్‌రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు దొడ్డా శ్రీనివాస్‌రెడ్డి, మైత్రి వెంకటరెడ్డి  పాల్గొన్నారు.

రైతు వేదికలను  త్వరితగతిన పూర్తిచేయాలి

రైతులను ఒకే వేదికపై తీసుకువచ్చి వ్యవసాయ సమాచారాన్ని ఎప్పడికప్పుడు తెలియజేసి రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా వ్యవసాయశాఖాధికారి అభిమన్యుడు అన్నారు. ఆయన ఆదివారం మండల పర్యటనలో భాగంగా ఏడూళ్ళబయ్యారంలో నిర్మిస్తున్న రైతు వేదికను పరిశీలించి మాట్లాడారు. రైతు వేదికల ద్వారా రైతులకు అవసరమైన సమగ్ర సమాచారాన్ని అందుతుందని, రైతులకు లాభదాయకమైన వ్యవసాయంపై ఈ వేదికల ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.