ఆదివారం 06 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Sep 27, 2020 , 04:36:50

రెవెన్యూ సంస్కరణలు ప్రజలకు వరం

రెవెన్యూ సంస్కరణలు ప్రజలకు వరం

  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
  • పార్టీ ప్రతిష్టను పెంచేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలి
  • కార్యకర్తల సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యేసండ్ర వెంకటవీరయ్య

కల్లూరు : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్‌ చేపట్టిన రెవెన్యూ సంస్కరణలు ప్రజలకు వరమని, రాబోయే పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో పార్టీ ప్రతిష్టతను పెంచేలా ప్రతిఒక్కరూ కృషి చేసి పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శనివారం స్థానిక మార్కెట్‌ కమిటీ ఆవరణంలో పట్టభద్రుల ఎన్నికల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీ ప్రతిష్టను పెంచి ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా బుధవారం నుంచి అన్ని గ్రామాల్లో తాను విస్తృతంగా పర్యటించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి వినూత్న పద్ధతుల్లో తీసుకెళ్లినపుడే ఆ పథకాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కలుగుతుందని, ప్రతి రాజకీయ నాయకుడు నిత్య విద్యార్థే అన్నారు. నమస్తే తెలంగాణలో నూతన రెవెన్యూ చట్టంపై వస్తున్న కథనాలను నాయకులు పూర్తిగా పరిశీలించి ప్రజలకు వివరించాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని పథకాలు, అభివృద్ధిలో సంక్షేమంలో సత్తుపల్లి నియోజకవర్గం ముందంజలో ఉందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం అసెంబ్లీలో అభినందించారని, రెవెన్యూ చట్టంపై ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ని అభినందిస్తూ తల్లాడ, వేంసూరు మండలాల్లో భారీగా కృతజ్ఞత ర్యాలీ తీయడం పట్ల కేసీఆర్‌ అభినందించారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త పెద్దఎత్తున ఓటర్లను చేర్పించి భారీ మెజార్టీని అందించాలని ఆయన సూచించారు. మంగళవారం నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా కల్లూరులో వెయ్యి మంది మహిళలతో భారీ పాదయాత్ర చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.

ఎస్పీ బాలు మృతి పట్ల సంతాపం...

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మృతి దేశానికి తీరని లోటని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సమావేశానికి ముందుగా బాలు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె పోరాట ప్రతిమను నాయకులకు వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీలు బీరవల్లి రఘు, దొడ్డా హైమావతి శంకర్‌రావు, పొగుట్ల వెంకటేశ్వరరావు, జడ్పీటీసీలు కట్టా అజయ్‌బాబు, కూసంపూడి రామారావు, ప్రమీల, చెక్కిరాల మోహన్‌రావు, మండల పార్టీ అధ్యక్షుడు పాలెపు రామారావు, కన్నగాల వెంకట్రావు, రెడ్డం వీరమోహన్‌రెడ్డి, పాల వెంకటరెడ్డి, యాగంటి శ్రీనివాసరావు, నాయకులు గాదె సత్యం, బొబోలు లక్ష్మణరావు, చల్లగుండ్ల కృష్ణయ్య, సత్తుపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేశ్‌, పసుమర్తి చందర్‌రావు, లక్కినేని రఘు, ఎండీ ఇస్మాయిల్‌, కాటంనేని వెంకటేశ్వరరావు, కొరకొప్పు ప్రసాద్‌, బొప్పన శ్రీనాథ్‌ పాల్గొన్నారు.