గురువారం 22 అక్టోబర్ 2020
Badradri-kothagudem - Sep 27, 2020 , 04:36:49

రెండు రోజులుగా ముసురు..

రెండు రోజులుగా ముసురు..

  • ఖమ్మం జిల్లాలో 40.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
  • కామేపల్లి మండలంలో 83.4 మిల్లీమీటర్ల వర్షం
  • 66 రోజులుగా సాధారణంకంటే అధికంగానే రికార్డు
  • పత్తి, మిర్చి పంటలపై తీవ్ర ప్రభావం
  • భద్రాద్రి జిల్లాలో అలుగుపోస్తున్న చెరువులు

ఖమ్మం ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: రెండు రోజులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విస్తారంగా వర్షం కురుస్తోంది. రాత్రి పూట భారీగానూ, పగటి పూట ఓ మోస్తరుగా కురుస్తోంది. ఖమ్మం జిల్లాలో గడిచిన24 గంటల్లో 40.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామేపల్లి మండలంలో అత్యధికంగా 83.4 మిల్లీమీటర్లు, ఏన్కూరు మండలంలో 73.6 మిల్లీ మీటర్ల చొప్పున నమోదైంది. ఈ ఏడాది జూన్‌లో 189.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. సెప్టెంబర్‌లో 231.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షం ప్రభావంతో పలు ప్రాంతాల్లోని వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయి. 

ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు..

ఎగువ ప్రాంతాల్లో రెండు రోజులుగా కురిసి వర్షానికి ఖమ్మంలో మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. సమీపంలోని చెరువులు అలుగు పోస్తున్నాయి. భద్రాద్రి ఏజెన్సీలోని దుమ్ముగూడెం మండలం ఆర్లెగూడెం సమీపంలోని కొండవాగు, పైడాకులమడుగు సమీపంలోని సీజీ ప్రాజెక్టు చెరువు అలుగుపోస్తున్నాయి. అశ్వాపురం మండలంలోని గొందిగూడెం - అశ్వాపురం గ్రామాల మధ్య ఇసుకవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వాగును దాటేందుకు ఓ వ్యక్తి బైక్‌తో ప్రయత్నంచి అదులో పడిపోగా సమీపంలో ఉన్న వారు రక్షించారు. సుజాతానగర్‌ మండలంలో సింగభూపాలెం చెరువు కట్ట కుంగిపోయింది. క్యూట్‌ డ్రాయిన్‌ దెబ్బతినడంతో ఇరిగేషన్‌ అధికారులు యుద్ధప్రాతిపాదికన మరమ్మతులు చేపట్టారు. 

40.2 మిల్లీమీటర్ల వర్షపాతం

గడిచిన 24 గంటల్లో (శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు) ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సరాసరి 40.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కామేపల్లి మండలంలో 83.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఏన్కూరు మండలంలో 73.6, రఘునాథపాలెంలో 67, నేలకొండపల్లిలో 52.2, కూసుమంచిలో 50.4, తల్లాడలో 54.2, బోనకల్లు మండలంలో 47.6 మి.మీ చొప్పున నమోదైంది. 6 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం మూడు మండలాల్లో, 3-6 సెంటీమీటర్ల వర్షపాతం 11 మండలాల్లో నమోదయ్యాయి. బూర్గంపహాడ్‌ మండలంలో నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షానికి వేపలగడ్డలో రైతు మేడం మల్లారెడ్డి వ్యవసాయ బోరులోంచి పాతాళగంగ ఉబికి వస్తోంది. ఆ మండలంలో ఇలా పాతళగంగ పైకి రావడం మొదటిసారని స్థానికులు చెబుతున్నారు. కాగా.. ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది నేటి వరకు 66 రోజులపాటు వర్షం కురవగా 21 మండలాల్లో సాధారణం కంటే అధికంగానే వర్షపాతం నమోదైంది.

భద్రాద్రి జిల్లాలో 44.2 మిల్లీమీటర్లు.. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా సగటున 44.2 మిల్లీమీటర్లుగా వర్షపాతం నమోదైంది. పినపాకలో 41.6, చర్లలో 36.8, దుమ్ముగూడెంలో 40.4, అశ్వాపురంలో 47.6, మణుగూరులో 63.2, గుండాలలో 41.2, ఇల్లెందులో 48.2, టేకులపల్లిలో 21.2, జూలూరుపాడులో 67.2, చండ్రుగొండలో 65.2, కొత్తగూడెంలో 10.4, పాల్వంచలో 22.6, బూర్గంపహాడ్‌లో 72.4, భద్రాచంలో 37.4, ములకలపల్లిలో 77.6, దమ్మపేటలో 58.6, అశ్వారావుపేటలో 34.6 మిల్లీమీటర్లుగా వర్షపాతం నమోదైంది. భద్రాద్రి జిల్లాలో 9558 మంది రైతులు వివిధ రకాల పంటలను నష్టపోయినట్టు అధికారులు గుర్తించారు. వరి 13,764, పత్తి 7218, మొక్కజొన్న పంటలు 17 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. logo