బుధవారం 21 అక్టోబర్ 2020
Badradri-kothagudem - Sep 24, 2020 , 01:23:36

సకలం.. హరితం

సకలం.. హరితం

  • హరితవనాలుగా మారనున్న ‘పల్లె సీమలు’
  • మున్సిపాలిటీల్లోనూ పార్కులు, వాకింగ్‌ ట్రాక్‌లు
  • ఒక్కో ప్రకృతివనానికి రూ.6.23 లక్షలు
  • గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి నిధులు 
  • భద్రాద్రి జిల్లాలో 1248 వనాల ఏర్పాటుకు ప్రణాళిక 

సకలం హరితమయం కానున్నాయి. పల్లెసీమలన్నీ పచ్చని శోభను సంతరించుకోనున్నాయి. పట్టణాల్లోనూ పార్కులు, వాకింగ్‌ ట్రాక్‌ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.. పల్లెల్లో ఒక్కో ప్రకృతి వనానికి రెండు విడుతలుగా ప్రభుత్వం రూ.6.23 లక్షలు వెచ్చిస్తున్నది. ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1248 వనాలను ఏర్పాటు చేయనుంది. కాలుష్యాన్ని నివారించేందుకు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు పల్లె ప్రకృతి వనాలు ఎంతగానో దోహదం కానున్నాయి. అదే వనాల్లోని ఎకరం స్థలంలో నీడనిచ్చే మొక్కలు, పలురకాల పూల మొక్కలు, పండ్ల మొక్కలను నాటి సంరక్షించనున్నారు.  


భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ : జనాభాతోపాటు రోజురోజుకూ కాలుష్యమూ పెరిగిపోతోంది. అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలతో వాతావరణంలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. పారిశ్రామిక వ్యర్థాలతోపాటు మానవులు తమ అవసరాలకు వినియోగించి పడేసిన వస్తువులు, వాహన కాలుష్య కారకాలు అంతకంతకూ పెరుగుతూ మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. గృహ, ఇతర అవసరాలకు అడవుల్లో ఉన్న చెట్లను నరకడంతో అటవీ విస్తీర్ణం విపరీతంగా తగ్గిపోతోంది. దీనికి చెక్‌పెట్టి జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. రాష్ర్టాన్ని హరిత తెలంగాణగా మార్చేందుకు నడుం బిగించారు సీఎం కేసీఆర్‌. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారు. ఏటా దాన్ని విజయవంతం చేస్తూ వస్తున్నారు. దీంతో జిల్లాలో గత ప్రభుత్వాల కాలంలో తరిగిపోయిన అటవీ విస్తీర్ణాన్ని తిరిగి విరివిగా పెంచుతున్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంతో పాటు పల్లెలను పచ్చని వనాలతో నింపేందుకు ప్రతి గ్రామంలో ప్రకృతివనాల (పార్కుల) ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకుసాగుతోంది. ఈ వనాల్లో ప్రజలు సేదతీరి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించేలా ఎకరం స్థలంలో నీడనిచ్చే మొక్కలు, రకరకాల పూలమొక్కలు, పండ్ల మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని నిర్ణయించింది. వాకింగ్‌ ట్రాక్‌ను కూడా ఏర్పాటు చేసి పల్లెప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించనుంది. 

హరితవనాలుగా మారనున్న ‘పల్లెలు’

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పల్లెలన్నీ హరితవనాలు గా మారనున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో 1248 ప్రకృతివనాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో స్థలసేకరణ కూడా పూర్తికావస్తోంది. రెండు విడుతలుగా పల్లె ప్రగతికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ప్రభు త్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేసింది. దీంతో పల్లెల రూపురేఖలన్నీ మారిపోయాయి. గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకువచ్చి ప్రజాప్రతినిధుల, అధికారుల సమన్వయంతో తమ గ్రామాలను అభివృద్ధి చేసుకున్నారు. పల్లెకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామ రహదారులకు ఇరువైపులా హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను ప్రజలు, పంచాయతీ సిబ్బంది తీసుకొని రహదారులను హరితమయం చేశారు. ఇప్పుడు ఏర్పాటుకానున్న ప్రకృతివనాలతో పల్లెలన్నీ హరితపల్లెలుగా మారనున్నాయి.


మున్సిపాలిటీల్లోనూ హరిత పార్కులు,  వాకింగ్‌ ట్రాక్‌లు

గత ప్రభుత్వాల కాలంలో పల్లెలతో పాటు పట్టణాలకు సరిగా నిధులు కేటాయింపులు జరుగక పారిశుధ్యం పడకేసేది. ఎన్నో ఏళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన పల్లెలు, మున్సిపాలిటీలు ఉండేవి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి పారిశుధ్యానికి పెద్దపీట వేసి నిధులు కేటాయించారు. దీంతో పల్లెలతో పాటు పట్టణాలు కూడా నూతనత్వాన్ని సంతరించుకున్నాయి. ఇంటింటికీ వెళ్లి తడి చెత్త, పొడి చెత్త సేకరణ మొదలుకుని వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టి మంచి వాతావరణానికి బాటలు వేసింది. రానున్న రోజల్లో మున్సిపాలిటీల్లోని ప్రతి వార్డులోనూ ప్రకృతి వనాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం స్థల సేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదేశాలు జారీ చేశారు.  మున్సిపాలిటీల్లో వాడవాడలా ఆక్సిజన్‌ పార్కులు ఏర్పాటు కానున్నాయి. వీటిల్లో కూడా వాకింగ్‌ ట్రాక్‌లను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు. దీంతో అటు పల్లెలు, ఇటు పట్టణాలు హరితమయం కానున్నాయి.

ఈజీఎస్‌ నుంచి నిధులు.. 

పల్లెల్లో ప్రకృతివనాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఈజీఎస్‌ నుంచి పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేస్తోంది. ఈ హరితవనాల ఏర్పాటుకు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి రెండు విడుతలుగా మొత్తం రూ.6.23 లక్షలను అందించనుంది. మొదటి సంవత్సరం రూ.3.95 లక్షలు, రెండో సంవత్సరం రూ.2.28 లక్షలు అందించనున్నారు. రెండు దఫాలుగా నిధులను మంజూరు చేసి పల్లెల రూపురేఖలను మార్చి ప్రజలకు స్వచ్ఛమైన గాలిని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించి ప్రజలు ఆయురారోగ్యాలతో విలసిల్లేలా చర్యలు చేపట్టారు. 


logo