ఆదివారం 25 అక్టోబర్ 2020
Badradri-kothagudem - Sep 23, 2020 , 03:19:26

నిర్మాణ కార్మికులకు ప్రభుత్వ అండ

నిర్మాణ కార్మికులకు ప్రభుత్వ అండ

  • కార్మికుల బాగోగులకు చట్టం 
  • 6,298 మందికి సంక్షేమ ఫలాలు 
  • 1,69,764 మందికి గుర్తింపు కార్డులు 
  • మీ సేవ ద్వారా ఆన్‌లైన్‌ ప్రక్రియ

 భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు కేసీఆర్‌ ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. 37 విభాగాల్లోని భవన, నిర్మాణ కార్మికుల కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనందిస్తున్నది. 1996 నుంచే అమలవుతున్న కార్మిక చట్టాలను కేసీఆర్‌ ప్రభుత్వం మరింత పటిష్టపరిచిం ది. ఏడు విభాగాల్లో  2019 నుంచి గత ఆగస్టు వరకు జిల్లా లో  6,298 మంది కార్మికులు సంక్షేమ ఫలాలు పొం దారు. 2009 నుంచి ఇప్పటివరకు జిల్లావ్యాప్తం గా 1,69,764 మందిభవన, ఇతర నిర్మాణ కార్మిక సం క్షేమ బోర్డు నుంచి  గుర్తింపు కార్డులను అందుకున్నా రు. 18-60 సంవత్సరాల మధ్య వయసున్న నిర్మాణ కార్మికులంతా గుర్తింపు కార్డులకు అర్హులు. ఈ కార్డు తీసుకున్న ఏడాది తరువాత కార్మిక చట్టం కింద అన్ని సంక్షేమ పథకాలను పొందవచ్చు. ఈ కార్డు పరిమితి ఐదేళ్ల వరకు ఉంటుంది.  దీని కాల పరిమితి ము గిసిన  తేదీ నుంచి మూడు నెలల లోపు రెన్యువల్‌ చేసుకోవా లి. మూడు నెలలు దాటితే.. ఆ కార్డు పై సంక్షేమ ఫ లాలు పొందడానికి మళ్లీ కనీసం ఏడాదిపాటు ఎదురుచూడాలి.

ఇలా ఆర్థిక సహాయం

 మహిళా కార్మికురాలి వివాహం, కార్మికుల ఇద్దరు కుమార్తెల వివాహం కోసం ఒకొక్కరికి రూ.30వేలు, ప్రసూతి సహాయంగా ఇద్దరు కుమార్తెలకు రూ.30వేలు (రెండు కాన్పులకు) ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తున్నది. సహజంగా మృతిచెందిన కార్మికుని కుటుంబ సభ్యులకు రూ.లక్ష, ప్రమాదవశాత్తు మృతిచెందిన కార్మికుని కుటుంబ సభ్యులకు రూ.6లక్షల సహాయాన్ని అందిస్తున్నది. ప్రమాదంలో పూర్తిగా శాశ్వతంగా అంగవైకల్యం కలిగిన వారికి రూ.5లక్షలు, పాక్షిక అంగవైకల్యం  కలిగిన వారికి రూ.4లక్షలను ఇస్తున్నది. మృతిచెందిన కార్మికుల అంత్యక్రియలకు రూ.30వేలు, ప్రమాదంలో మరణించిన కార్మికుడు/కార్మికురాలి మృతదేహాన్ని స్వస్థలానికి అంబులెన్స్‌ ద్వారా తరలించేందుకు రవాణా ఖర్చుల కింద కిలోమీటర్‌కు రూ.20 చొప్పున సంబంధిత ఉప కార్మిక శాఖ కమిషనర్‌ చెల్లిస్తుంది. ప్రమాదం/అనారోగ్యంతో చికిత్స కోసం ఐదు రోజులు అంతకు మించి ఆసుపత్రిలో చేరిన వారికి రోజుకు రూ.300 చొప్పున నెలకు రూ.4500 మించకుండా మూడు నెలల వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది. లబ్ధిదారులుగా నమోదు కాకుండా పనిలో ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబ సభ్యులకు రూ.50వేలు, పనిలో ఉన్నప్పుడు ప్రమాదశాత్తు 50 శాతం అంగవైకల్యం కలిగితే రూ.20వేలు, 50 శాతానికన్నా తక్కువ అంగవైకల్యం కలిగితే రూ.10వేలను ప్రభుత్వం అందిస్తుంది.

నమోదు విధానం

నిర్ణీత 27వ ఫారాన్ని కార్మికుడు/కార్మికురాలు పూరించాలి. సంక్షేమ పథకాల ద్వారా చేకూరే లబ్ధిని పొందేందుకు తనపై ఆధారపడిన కుటుంబ సభ్యుల వివరాలు, నామినీ పేర్లను దరఖాస్తులో పొందుపర్చాలి. దరఖాస్తుతోపాటు నిర్మాణ రంగంలో పనిచేస్తున్నట్లుగా ధ్రువపత్రాన్ని జత చేయాలి. కార్మికులు/నిర్మాణ రంగ కార్మిక సంఘాల అభ్యర్థన మేరకు వ్యక్తిగతంగా ధ్రువీకరించిన తరువాత కార్మిక శాఖాధికారులు ధ్రువీకరిస్తారు. పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు రెండు, ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, బ్యాంక్‌ అకౌంట్‌, వయస్సు ధ్రువీకరణ పత్రంతో మీ సేవా కేంద్రంలో నిర్ణీత రుసుము చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలి.  

ఇంతమంది లబ్ధిదారులు

  2019-20 ఆగస్టు వరకు మొత్తం 6,298 మంది ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పొందారు. అందులో ప్రసూతి విభాగంలో 2,427 మంది, వివాహ కానుకగా 1,012 మంది లబ్ధి పొందారు.  సహజంగా          మృతిచెందిన 1,206 మంది కుటుంబాలకు, ప్రమాదశాత్తు మృతిచెందిన 211 మంది కుటుంబాలకు, అంత్యక్రియల కోసం 1,417 మంది కుటుంబాలకు, శాశ్వతంగా అంగవికలురైన 18 మందికి, పాక్షికంగా అంగవికలురైన ఏడుగురికి ప్రభుత్వ నుంచి సంక్షేమ ఫలాలు అందాయి.


logo