మంగళవారం 01 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Sep 23, 2020 , 03:19:26

విహంగాల విహరం

విహంగాల విహరం

  • ప్రభుత్వ ప్రత్యేక చొరవతో పక్షిజాతులకు పునర్జీవం
  • ఏజెన్సీ ప్రాంతాల్లో సందడి చేస్తున్న  నెమళ్లు

ఇల్లెందు రూరల్‌ : అంతరించిపోతున్న జీవరాశులు మళ్లీ  పునర్జీవం పోసుకుంటున్నాయి. ప్రతి పల్లెల్లో పక్షుల కిలకిలరావాలు చెవులకు వినసొంపుగా ఉంటున్నాయి. రామచిలుకలు, గువ్వలు, ఊర పిచుకలు సందడి చేస్తున్నాయి. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం జీవవైవిధ్యం పట్ల తీసుకున్న చొరవతోనే సాధ్యమైందని చెప్పవచ్చు. ఒకప్పుడు పల్లెల్లోని చెరువులు, కుంటల్లోని నీటితో దాహం తీర్చుకొని.. వాటిలోనే జలకాలాడేవి. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందుతూ.. దొరికిన ఆహారాన్ని తింటూ.. మనుగడ సాగించేవి. పెద్ద సంఖ్యలో చెట్లు ఉండటంతో వాటిపై గూళ్లు ఏర్పాటు చేసుకొనేవి. గూళ్ల నుంచి బయటకు వచ్చి అవి చేసే సందడి పర్యావరణ ప్రేమికులను ఉత్సాహపర్చేవి. పిచుకలు, గువ్వలు, గోరువంకలు, పావురాలు, నెమళ్లు, రామచిలుకలు, నీటి కొంగలు, బుల్‌బుల్‌ పిట్టలు, కాకులు వంటి ప్రతి ఒక్కరికి పరిచయమున్న పక్షులు మన కళ్ల ముందే కదలాడేవి. కానీ కాంక్రీటు కీకారణ్యం, అభివృద్ధి పేరుతో చెట్లను నరికివేయడం, వర్షాకాలం మినహా చెరువులలో నీరు ఆవిరైపోవడం వంటి కారణాలతో ఆయా పక్షి జాతులు క్రమంగా కనిపించకుండా పోయాయి. కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా చెరువులను పునరుద్ధరించడం, హరితహారంలో విరివిరిగా మొక్కలు నాటడంతో పల్లెల్లో పచ్చందాలు విస్తరించుకున్నాయి. ఇవన్నీ పక్షుల మనుగడకు అనుకూలంగా మారాయి. కనిపించకుండా పోయిన పక్షి జాతులు క్రమంగా పల్లెల్లోకి వచ్చి చేరుతున్నాయి. మళ్లీ పల్లెల్లో వివిధ రకాల పక్షులు సందడి చేస్తుండటం ప్రజలను ముగ్ధులను చేస్తోంది. ఇల్లెందులోని ఏజెన్సీ గ్రామాల్లో జంతుజాతులకు పూర్వవైభవం వచ్చింది. అటవీ ప్రాంతానికి సమీపాన ఉన్న సువర్ణపురం గ్రామంలో నెమళ్లు జనవాసాల్లోకి వచ్చి సందడి చేసి వెళ్తున్నాయి.